తస్మాత్ జాగ్రత్త | Tasmat care | Sakshi
Sakshi News home page

తస్మాత్ జాగ్రత్త

Published Tue, Oct 14 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 PM

తస్మాత్ జాగ్రత్త

తస్మాత్ జాగ్రత్త

సాక్షి, కర్నూలు: అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా కన్ను కర్నూలు జిల్లాపై పడిందా..? దీనికి నిఘా వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. సినిమాను తలపించేలా వీరి వ్యూహం ఉంటోందని అనుమానిస్తున్నారు. వీరు ప్రాంతాలను పంచుకుని మరీ దొంగతనాలకు పాల్పడుతుండడం.. పని పూర్తిచేసుకుని ఎంచక్కా తిరిగి విమానాల్లో తమ ప్రాంతాలకు వెళ్లిపోతున్న వైనం జిల్లా పోలీసులను దిగ్భాంతికి గురిచేస్తోంది. దొంగల కదలికలు పోలీసు యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. మాఫియా గ్యాంగ్‌లాగా దోపిడీ దొంగలు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవడంపై ఉన్నతాధికారులు నిఘా పెట్టడంతో కళ్లు తిరిగే వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.

 కర్నూలు, అనంతపురం జిల్లాలను లక్ష్యంగా చేసుకుని అంతర్ రాష్ట్ర ముఠాలు భారీ దోపిడీలకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో గత కొంతకాలం నుంచి దొంగతనాలు ఎక్కువయ్యాయి. ప్రాంతాలు, పరిసరాలతో సంబంధం లేకుండా ఎక్కడికక్కడ తమ వంతు చేతివాటాన్ని ప్రదర్శిస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. అయితే వీటిపై జరుపుతున్న దర్యాప్తులో కర్నూలు పోలీసు యంత్రాంగానికి విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రాయలసీమ నాలుగు జిల్లాల్లోనూ తమ చేతివాటం చూపేందుకు సిద్ధమైన దొంగల ముఠాలు.. క్షేత్ర స్థాయిలో ఇప్పటికే తమ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు వినిపిస్తుండగా.. దీనికి వెనుక భారీ నెట్‌వర్క్ ఉందన్న విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది. ఉత్తర భారతదేశానికి చెందిన పలువురు నేరగాళ్లు ఈ తంతు వెనక కీలకపాత్ర పోషిస్తున్నట్లు స్పష్టమవుతుండగా.. అందులోనూ మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన వ్యక్తులు సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. వీరంతా గతంలో పలు కేసుల్లో నిందితులు కాగా, ఇప్పుడు బృందాలుగా ఏర్పడి దోపిడీలకు తెగబడుతున్నట్లు అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

 బెంగళూరు నుంచి అపరేషన్!
 దోపీడీ దొంగల ముఠా సభ్యులు బెంగళూరు నుంచి ఈ మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నేరాల్లో ఆరితేరిన గ్యాంగ్‌లోని సభ్యులంతా దొంగల ముఠాలుగా ఏర్పడి ఇలా వరుస చోరీలకు దిగుతున్నట్లు సమాచారం. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను కొల్లగొట్టాలనే క్రమంలో దొంగలు విమానాలను సైతం ఆశ్రయిస్తున్నారన్న విషయం పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది.

ఢిల్లీ నుంచి బెంగళూరు విమానాశ్రాయానికి చేరుకుంటున్నవారు, సమీప ప్రాంతాల్లో తిష్ట వేస్తున్నారు. అక్కడి నుంచి పక్కాగా వ్యూహాన్ని రూపొందించుకున్న అనంతరం రాయలసీమ జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. ఇందుకు బెంగళూరు, దేవనహళ్లి విమానాశ్రయాలను వీరు తమ రాకపోకలకు అనువుగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధాన సూత్రధారులు బెంగళూరు కేంద్రంగానే రాకెట్ నడుపుతుండగా.. ముఠాలు మాత్రమే సీమ జిల్లాల్లో తిరుగుతున్నాయి.

తాజాగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జరిగిన కొన్ని గొలుసుకట్టు దొంగతనాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అక్కడి దొంగతనాల తీరుతెన్నులు, నేరగాళ్ల చేతివాటం ఆధారంగా పరిశీలిస్తే ఉత్తర భారత ముఠాల కార్యకలాపాలుగా స్పష్టమైనట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు స్పష్టం చేశారు. సదరు ముఠాల సభ్యులు చాలా తెలివిగా నిఘా కెమెరాలకు సైతం దొరకకుండా, వేలిముద్రలు దొరక్కుండా దోపిడీలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ బృందాలు తిరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. వీఐపీల ఇళ్లు, భారీ షాపింగ్ మాల్స్, ప్రధాన వాణిజ్య కేంద్రాలను లూటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.   
 
నిఘా పెంచాం: కర్నూలు జిల్లాలో ఉత్తర భారత నేరగాళ్ల కదలికలు ఉన్న మాట వాస్తవమే. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి, నిఘా పెంచాం. ఇప్పటికే ప్రత్యేక బృందాలతో జల్లెడ పడుతున్నాం. ముఖ్యంగా బ్యాంకులు, పెట్రోల్ బంకులు, మాల్స్ వద్ద తనిఖీలు ముమ్మరం చేస్తున్నాం. అనుమానితుల వివరాలను సేకరిస్తున్నాం.
 - ఆకె రవికృష్ణ, జిల్లా ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement