ట్యాక్స్.. టెన్షన్ | tax tension | Sakshi
Sakshi News home page

ట్యాక్స్.. టెన్షన్

Published Wed, Feb 19 2014 11:28 PM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

ట్యాక్స్.. టెన్షన్ - Sakshi

ట్యాక్స్.. టెన్షన్

 కర్నూలు(కలెక్టరేట్) :
 మార్చి వస్తుందంటే ఉద్యోగుల్లో గుండెదడ మొదలవుతుంది. ఎందుకంటే ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి ఉద్యోగి విధిగా ఫిబ్రవరి జీతం నుంచి ఇన్‌కంట్యాక్స్ చెల్లించాల్సి ఉండటమే.
 
 ఆదాయపు పన్ను చెల్లించగా ఉద్యోగులకు మిగిలే జీతం నామమాత్రమే. ప్రతి ఉద్యోగి మార్చి 1న తీసుకునే ఫిబ్రవరి జీతం నుంచి విధిగా ఇన్‌కంట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. రూ.16667 గ్రాస్‌పైబడి జీతం తీసుకునే ఉద్యోగులంతా విధిగా ఆదాయపు పన్ను ఫైల్ చేయాల్సి ఉంది. ఒకేసారి ఆదాయపు పన్ను భారం పడకుండా ఏడాదికి పడే పన్నును మూడు విడతలుగా చెల్లించవచ్చు. ఆర్థిక సంవత్సరంలో జూన్ చివరికి పన్ను మొత్తంలో 30 శాతం ఉద్యోగుల జీతం నుంచి కట్ చేసి ఆదాయపు పన్ను శాఖకు జమ చేయాల్సి ఉంది. ఈ బాధ్యత డీడీఓలపై ఉంది. డిసెంబర్ చివరికి 60 శాతం చెల్లించాలి. ఈ ప్రకారం ఆదాయపు పన్ను చెల్లిస్తే ఉద్యోగులకు భారం అనిపించదు. కానీ చాలా వరకు ఉద్యోగులు జూన్, డిసెంబర్‌లలో చెల్లించకుండా ఫిబ్రవరి జీతం నుంచే చెల్లించాల్సి రావడంపై ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. ఏడాదికి రూ.2 లక్షల ఆదాయంలోపు ఉన్న వారు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.2 లోల నుంచి రూ.5 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు 10శాతం, రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. అయితే ఏ స్థాయిలో ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా 3 శాతం సర్‌చార్జీ చెల్లించాల్సి ఉంది. సర్‌చార్జీలో ఒక శాతం హయ్యర్ ఎడ్యుకేషన్, 3 శాతం పాఠశాల విద్యకు వినియోగిస్తారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 1900 మందికి పైగా డ్రాయింగ్ డిస్పర్సింగ్ ఆఫీసర్స్ (డీడీఓ)లు ఉన్నారు. ఫిబ్రవరి జీతం నుంచి డీడీఓలు విధిగా ఆదాయపు పన్నును కట్ చేసి ట్రెజరీకి జీతాల బిల్లును పంపాల్సి ఉంది.
 ఆదాయపు పన్నుకు మినహాయింపులు:
 ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులు అధికారులు, పన్ను నుంచి మినహాయింపు పొందేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. ఏపీజీఎల్‌ఐ, జీపీఎఫ్, గ్రూప్ ఇన్స్యూరెన్స్, ఎల్‌ఐసీ వంటి సేవింగ్‌తో పాటు ట్యూషన్ ఫీజులు ఉంటే రూ. లక్ష వరకు మినహాయింపు ఉంటుంది. ఇవి గాక ఎడ్యుకేషన్‌లోన్‌పై వడ్డీ మాత్రమే ఆదాయపు పన్ను రాయితీగా లభిస్తుంది. హౌసింగ్ లోన్‌పై వడ్డీ రూ.1.50 లక్షల వరకు ఇన్‌కంట్యాక్స్ రాయితీ ఉంటుంది. మెడికల్ ఇన్స్యూరెన్స్‌కు సంబంధించి రూ.15 వేలు వరకు రాయితీ లభిస్తుంది. 80 శాతం పైగా డిజబులిటీ ఉంటే రూ.లక్ష, 50 శాతం పైబడి ఉంటే రూ.50 వేలు ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుందని జిల్లా ట్రెజరీ ఉప సంచాలకులు  సుధాకర్ తెలిపారు. డీడీఓలు అన్నింటిని సరి చూసుకొని ఉద్యోగుల జీతం నుంచి ఆదాయపు పన్ను కట్ చేసి జీతాల బిల్లులు పంపాల్సి ఉంటుందని వివరించారు. ఫిబ్రవరి జీతం నుంచి ఆదాయపు పన్ను కట్ చేయాల్సి ఉన్నందున జీతాల బిల్లులు ట్రెజరీకి చేరే సరికి బాగా జాప్యం జరిగే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement