ఎందుకీ వివక్ష! | TDP alleges discrimination | Sakshi
Sakshi News home page

ఎందుకీ వివక్ష!

Published Thu, Aug 14 2014 1:51 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

ఎందుకీ వివక్ష! - Sakshi

ఎందుకీ వివక్ష!

 ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలందరూ ఒకటే.. అధికారపక్షం, ప్రతిపక్షం అన్న వివక్ష కూడదు. అందరూ ప్రజాప్రతినిధులే అయినందున ఒకేరీతిలో గౌరవించాలి.. ప్రభుత్వపరంగా జరిగే కార్యక్రమాలు, సమావేశాలకు తప్పనిసరిగా ఆహ్వానించాలి. అందుకు కొన్ని పద్ధతులు, సంప్రదాయాలు ఉన్నాయి. కానీ టీడీపీ పాలనలో అవన్నీ గాలిలో కలిసిపోతున్నాయి. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. స్వపక్షం, విపక్షం అన్న తేడాతోపాటు.. స్వపక్షంలోనూ విపక్షాన్ని దూరం పెట్టే కుసంస్కృతి పాదుగొంటోంది. బ్యాంకర్ల కమిటీ సమావేశానికి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఆహ్వానమే లేకపోవడం.. సమావేశ వేదికపై ఒక ఎమ్మెల్యేకు ఉచితాసనం వేసి, మిగిలిన వారిని వేదిక ముందు కూర్చోబెట్టి ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారు.
 
 శ్రీకాకుళం పాతబస్టాండ్: వారందరూ శాసనసభ్యులే.. అందరికీ ఒకటే ప్రొటోకాల్ వర్తిస్తుంది. కానీ బుధవారం జరిగిన జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. పాతపట్నం ఎమ్మెల్యేకు సమావేశానికి సంబంధించిన సమాచారమే పంపకపోగా, హాజరైన ఎమ్మెల్యేల  పట్ల వివక్షాపూరితంగా వ్యవహరించారు. ఈ సమావేశానికి మంత్రి, విప్, అధికారులతోపాటు నలుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మంత్రి, విప్, జిల్లా కలెక్టర్, ఇతర ముఖ్యులు వేదికపై కూర్చోవడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ వారితోపాటు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానించి ఉచితాసనం ఇచ్చారు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం వేదిక దిగువన అధికారులతోపాటు కూర్చున్నారు.
 
 వీరిలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులుతోపాటు టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఉన్నారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ గుండ లక్ష్మీదేవిని మాత్రమే మంత్రులతోపాటు వేదికపై కూర్చోనిచ్చారు.  శ్రీకాకుళం ఎమ్మెల్యేలకు మాత్రమే ఎందుకు ప్రాధాన్యమిస్తున్నారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకుముందు ఆరోగ్యశాఖ మంత్రి జరిపిన సమీక్ష గానీ, బుధవారం నాటి బ్యాంకర్ల సమావేశం గానీ శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందినవి కావు.
 
 రెండూ జిల్లా స్థాయి సమావేశాలే. వీటిలో పాల్గొన్న ఎమ్మెల్యేలందరినీ వీలైతే వేదికపై కూర్చోబెట్టాలి.. లేదంటే అందరినీ దిగువన సీట్లు కేటాయించాలి. అలా కాకుండా గుండ లక్ష్మీదేవినే ఎందుకు గౌరవిస్తున్నారు.. మిగిలినవారిని ఎందుకు అగౌరవిస్తున్నట్లు?.. పోనీ ఆమె సీనియర్ ఎమ్మెల్యేనా అంటే.. అదీ కాదు. బుధవారంనాటి సమావేశంలో పాల్గొన్న మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలతో సమానంగా తొలిసారి ఎన్నికైనవారే. మరి ఎందుకీ దుస్సంప్రదాయానికి తెర తీశారన్నదానికి జిల్లా అధికారులు, మంత్రి పుంగవులే సమాధానం చెప్పాలి.
 
 సమాచారం పంపడంలోనూ..
 మరోవైపు సమావేశాల సమాచారం పంపడంలోనూ అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల విషయంలో వివక్ష కనిపిస్తోంది. బ్యాంకర్ల కమిటీ సమావేశానికి సంబంధించి పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు సమాచారం అందలేదు. ఇదే విషయాన్ని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు సమావేశంలో ప్రస్తావించారు. సమాచారం ఎందుకు పంపలేదని జిల్లా అధికారులను ప్రస్తావిస్తూ.. అందువల్లే ఆయన హాజరుకాలేకపోయారని చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారం జిల్లాస్థాయిలో జరిగే సమావేశాలు, కార్యక్రమాలకు జిల్లా ఎమ్మెల్యేలందరినీ తప్పనిసరిగా ఆహ్వానించాలి, వీలైనంతవరకు ఆహ్వన పత్రం పంపించాలి, సమయం లేనప్పుడు కనీసం పోన్లో అయినా తెలియజేయాలని ఆయన గుర్తు చేశారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ ‘ఇప్పుడంతా ఫాస్ట్.. ఎస్‌ఎంఎస్‌లు చూడటం నేర్చుకోవాలి’ అంటూ వ్యంగ్యంగా, అసహనంగా వ్యాఖ్యానించారు. అయితే విప్ కూన రవికుమార్ కల్పించుకొని ‘సంప్రదాయం పాటించాల్సిందేనని.. ఫోనులో అయినా సమాచారం పంపాలని, ఎస్‌ఎంఎస్‌లు చూసుకోమనడం సరికాదన్నారు. దీన్నే అంగీకరిస్తే.. రేపు మనకూ ఎస్‌ఎంఎస్‌లే వస్తాయని’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement