తెలుగుదేశం పార్టీ కన్నా పూర్వం పరిపాలించిన బ్రిటీష్ పాలనే నయమని రైతుకూలీ సంఘం సహాయకార్యదర్శి జె.కిషోర్‌బాబు విమర్శించారు.
- రైతుకూలీ సంఘం విమర్శ
భోగాపురం : తెలుగుదేశం పార్టీ కన్నా పూర్వం పరిపాలించిన బ్రిటీష్ పాలనే నయమని రైతుకూలీ సంఘం సహాయకార్యదర్శి జె.కిషోర్‌బాబు విమర్శించారు. మండలంలోని ఎయిర్‌పోర్టు బాధిత గ్రామాలను గురువారం సాయంత్రం రైతుకూలీల సంఘం, అఖిలభారత కార్మిక సంఘాల సమాఖ్య (ఏఐఎఫ్‌టీయూ) నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బ్రిటీష్ పాలనలో రైలు మార్గానికనో, రోడ్డు మార్గానికనో, లేదా ఒక కంపెనీ స్థాపనకో రైతుల వద్దనుంచి భూమిని సేకరించేవారని అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం అవేమీ కాకుండా విదేశీ వ్యాపారసంస్థలకు అప్పజెప్పేందుకు పేద రైతుల వద్దనుంచి భూములు లాక్కుంటుందని మండిపడ్డారు. అధికారపార్టీ మంత్రుల భూముల మినహాయించి పేద రైతుల భూమిని తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మేక్ ఇన్ ఇండియా పేరుతో మోదీ, అభివృద్ధి పేరుతో చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు బాధితుల ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దంతులూరి వర్మ, రాష్ట్రకార్యవర్గ సభ్యులు టి.అరుణ, ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయక కార్యదర్శి గణేష్‌పాండా, రాష్ట్ర కార్యవర్గసభ్యులు బెహరా శంకరరావు, ఎం.గోపాలం తదితరులు పాల్గొన్నారు.