
తిరగబడ్డ తమ్ముళ్లు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ :మున్సిపల్ పోరులో గెలిచిన ముచ్చట మూడు నెలలు కూడా తీరకుండానే పెద్దాపురంలో తెలుగు తమ్ముళ్ల తగవు బజారుకెక్కింది. ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడైన నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం రాష్ట్రంలోనే రెండు మున్సిపాలిటీలు (పెద్దాపురం, సామర్లకోట) ఉన్న ఏకైక నియోజకవర్గం. ఈ రెండు పట్టణాల్లో టీడీపీయే విజయం సాధించింది. పెద్దాపురంలో 28 వార్డులుండగా 23 ఆ పార్టీ గెలుచుకుంది. తిరుగులేని మెజారిటీ సాధించిన ఈ పట్టణంలో చైర్‌పర్సన్ గా అనుభవజ్ఞుడైన రాజా సూరిబాబురాజును కౌన్సిలర్లు ఏకాభిప్రాయంతో ఎన్నుకున్నారు. అయితే ఇప్పుడాయన ఏలుబడి ఏకపక్షంగా సాగుతోందంటూ స్వపక్షానికి చెందిన మెజారిటీ కౌన్సిలర్లు పార్టీ జిల్లా నాయకత్వానికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
సూరిబాబురాజు వైఖరిని నిరసిస్తున్న వారు పార్టీ జిల్లా అధ్యక్షుడైన చినరాజప్పకు ఆదివారం ఫిర్యాద ు చేశారు. ఇదే విషయాన్ని వారు శనివారం పార్టీ సీనియర్ నాయకుడైన గోలి రామారావు దృష్టికి తీసుకువెళ్లారు. చినరాజప్పతో మాట్లాడి సర్దుబాటు చేద్దామని రామారావు నచ్చచెప్పినా వారు ససేమిరా అన్నారు. అనేక సందర్భాల్లో అభివృద్ధి, ఇతర విషయాల్లో తమకు కనీస సమాచారం ఉండడం లేదని, తాము ఏ చిన్న పని కోసం అధికారులను అడుగుతున్నా చైర్‌పర్సన్‌తో ఫోన్ చేయించండనడం అవమానకరంగా ఉందని 15 మంది కౌన్సిలర్లు చినరాజప్పకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. ఫలితంగా ఈ వివాదం ముదురుపాకాన పడింది. చైర్‌పర్సన్ పక్షాన ఎనిమిది మంది కౌన్సిలర్‌లు నిలవగా, వైస్ చైర్మన్ ఎస్.సత్యభాస్కరరావు సహా 15 మంది ఆయన వ్యతిరేకవర్గంగా నిలిచారు. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్నపెద్దాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
లే అవుట్ల వ్యవహారమే ప్రధాన కారణం..
తమ ప్రమేయం లేకుండా చైర్‌పర్సన్ 13 ఎకరాల లే అవుట్ అనుమతులకు కౌన్సిల్‌లో ప్రతిపాదించడమే మెజారిటీ కౌన్సిలర్‌ల ఆగ్రహానికి ప్రధాన కారణమైంది. ఇదే విషయాన్ని వారు చినరాజప్ప దృష్టికి తీసుకువెళ్లారు. రామారావుపేటలో 13 ఎకరాల లేఅవుట్‌లో 139 ఫ్లాట్‌లు నిర్మించాలని ఒక సంస్థ ప్రతిపాదించింది. ఇదే లే అవుట్‌కు ఇటీవల చినరాజప్ప భూమి పూజ చేయడం గమనార్హం. తమకు మాట వరసకైనా చెప్పకుండా చైర్‌పర్సన్ ఏకపక్షంగా ప్రతిపాదించడంలో ఆంతర్యమేమిటని కౌన్సిలర్‌లు ప్రశ్నిస్త్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో పూడిక తీత పనులకు టెండర్లు పిలిచే వ్యవహారం చైర్‌పర్సన్‌పై కౌన్సిలర్‌ల తిరుగుబాటుకు మరో కారణమైంది. పనులన్నింటినీ చైర్‌పర్సన్ ఏకపక్షంగా నామినేషన్ ప్రాతిపదికన అప్పగించేయడంపై కూడా కౌన్సిలర్‌లు చినరాజప్పకు ఫిర్యాదు చేశారు. పూడికతీత పనులకు రూ.15 లక్షలు మున్సిపాలిటీ కేటాయించింది.
ఈ నిధులను 18 పనులుగా విభజించారు. రూ.లక్ష దాటే పనులకు విధిగా టెండర్లు పిలవాలి. లక్షలోపు అయితే నామినేషన్ ప్రాతిపదికన అప్పగించే వెసులుబాటు ఉంది. ఈ వెసులుబాటును ఆసరాగా రూ.15 లక్షలతో చేపట్టే ప్రతి పనినీ రూ.లక్ష లోపుగా నిర్ణయించి తనకు నచ్చిన ముగ్గురు కాంట్రాక్టర్‌లకు చైర్‌పర్సన్ అప్పగించేశారని కౌన్సిలర్‌లు ఆరోపిస్తున్నారు. ఇందుకు తోడు మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల పింఛన్ల కమిటీల ఏర్పాటులో కూడా తమతో సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరించారని కౌన్సిలర్‌లు మండిపడుతున్నారు. చైర్‌పర్సన్, మెజారిటీ కౌన్సిలర్ల మధ్య విభేదాలతో మున్సిపల్ అధికారుల పరిస్థితి ‘అడకత్తెరలో పోకచెక్క’లా మారింది. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తెలుగుతమ్ముళ్ల వివాదాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి.