సాక్షి, విజయవాడ/అమరావతి: తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టిన రేషన్ డీలర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రేషన్ డీలర్లు ఈ నెల 16వ తేదీ నుంచి మూకుమ్మడి సెలవుకు సిద్ధమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రేషన్ డీలర్లు రోడ్డెక్కితే నిత్యావసర వస్తువుల పంపిణీ జరగదని, చెడ్డ పేరు వస్తుందని భావిస్తున్న ప్రభుత్వం ఏకంగా అత్యవసర సేవల చట్టం(ఎస్మా) ప్రయోగించింది. ఈ మేరకు డీలర్లకు నోటీసులు జారీ చేసింది. పౌర సరఫరాల శాఖ సిబ్బంది డీలర్ల చేతికి నోటీసులు ఇచ్చి, సంతకాలు చేయించుకుంటున్నారు.
డ్రాక్వా గ్రూపులకు కేటాయింపు
పౌర సరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ ఈ నెల 11న ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. డీలర్లు 18వ తేదీలోగా సరుకులకు బిల్లులు చెల్లించి గోదాముల నుంచి తీసుకువెళ్లి కార్డుదారులకు అందచేయాలని సూచించారు. డీలర్లు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా వారి డీలర్‌షిప్‌ను రద్దు చేసి సమీపంలోని స్వయం సహాయక సంఘాలకు (డ్రాక్వా) కేటాయించాలని ఆదేశించారు. రెండు రోజులుగా పౌరసరఫరాల అధికారులు, తహసీల్దార్లు రేషన్ డీలర్లను వ్యక్తిగతంగా పిలిచి సమ్మె చేస్తారా? లేక బిల్లులు కడతారా? అంటూ ఒత్తిడి చేస్తున్నారు. సమ్మెకు సిద్ధమైతే వెంటనే వారి వద్ద ఉన్న ఈ–పాస్ యంత్రం, ఎలక్ట్రానిక్ కాటాను తెచ్చి తమకు అప్పగించాలని ఆదేశిస్తున్నారు. సమ్మె చేయమని చెప్పి... సరుకు తీసుకోకుండా తాత్సారం చేసినా సమ్మె చేస్తున్నట్లుగానే భావించి డీలర్‌షిపు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సరుకు తీసుకోవాలని, సమ్మె విరమించుకోవాలని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు బెదిరిస్తున్నారని డీలర్ల సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
రేషన్ డీలర్ల డిమాండ్లు ఇవే....
తమకు గౌరవ వేతనం ఇవ్వాలని, చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకల కమీషన్‌ను రూ.10–20కు పెంచాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు. గోదాముల నుంచి రేషన్ డిపోలకు రవాణ చేసే సరుకులను ఉచితంగా దిగుమతి చేయించాలని, పెండింగ్ బిల్లులు రూ.100 కోట్లను తక్షణం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం బకాయిలు చెల్లించేందుకు ఆసక్తి చూపడం లేదు. గౌరవ వేతనం ఊసే ఎత్తడం లేదు. డీలర్ల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వారిని తొలగించి కొత్త వారికి అవకాశం కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
దుకాణాల అద్దె కూడా చెల్లించలేకపోతున్నాం..
ప్రభుత్వం నుంచి న్యాయబద్ధంగా అందాల్సిన ప్రయోజనాలతోపాటు ఆహార భద్రతా చట్టం ప్రకారం తమకు చెల్లించాల్సిన కమీషన్‌లో కోత విధించకుండా మొత్తం చెల్లించాలని డీలర్లు కొన్నాళ్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా కాకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ఇస్తున్న సరుకుల్లో కోత విధించడంతో డీలర్లకు ఆశించిన మేర కమీషన్ రావడం లేదు. దీనికితోడు అరకొరగా వచ్చే కమీషన్‌లోనూ ఈ–పాస్ మిషన్ల నిర్వహణ ఖర్చుల పేరిట ప్రతినెలా క్వింటాల్‌కు రూ.17 చొప్పున కమీషన్‌లో కోత విధిస్తున్నారు. దీంతో కుటుంబ జీవనం సంగతి అటుంచితే కనీసం రేషన్ దుకాణాల అద్దె కూడా చెల్లించలేకపోతున్నామని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె తప్పదని రేషన్ డీలర్ల జేఏసీ నేతలు ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతిఏటా పండుగల సందర్భంగా ఇచ్చే చంద్రన్న కానుకను సైతం పంపిణీ చేయకుండా నిలిపివేయాలని నిర్ణయించారు. జనవరికి గాను పంపిణీ చేయాల్సిన బియ్యం తదితర సరుకులు తీసుకోకూడదని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29 వేల మంది డీలర్లకు జేఏసీ నేతలు ఇప్పటికే సమాచారం ఇచ్చారు.
న్యాయం కోరితే బెదిరిస్తారా?
ప్రభుత్వం జారీ చేసే నోటీసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని రేషన్ డీలర్ల జేఏసీ నేతలు చెప్పారు. ఈ నెల 15న విజయవాడలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. చర్చలకు పిలవకుండా డీలర్లను భయబ్రాంతులకు గురి చేసేలా ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని జేఏసీ నాయకులు దివి లీలామాధవరావు, బుగతా వెంకటేశ్వరరావు, పి.చిట్టిరాజు, ఎం.వెంకటరావు తదితరులు గురువారం ప్రకటించారు. 36 నెలలుగా బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకోకుండా నోటీసులు జారీ చేయడాన్ని వారు తప్పుపట్టారు. ప్రజా పంపిణీ వ్యవస్థ అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని, అందుకుగాను ప్రభుత్వానికి జాతీయస్థాయిలో 9 అవార్డులు వచ్చాయని గొప్పగా చెప్పుకునే టీడీపీ సర్కారు ఇప్పుడు తమ సమస్యలను పరిష్కరించాలని కోరితే బెదిరించడం ఏమిటని రేషన్ డీలర్లు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment