
గుబులు గుబులుగా..
సాక్షి, కాకినాడ :పాలనా వ్యవస్థలో ఏళ్ల తరబడి అంతర్భాగమైపోయిన వారు లేకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక్క ఫైల్ కూడా ముందుకు కదలదు. కొన్ని శాఖల్లో అయితే ప్రభుత్వ సిబ్బందికంటే వారి సంఖ్యే అధికం. అటువంటి ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగిం చాలని టీడీపీ సర్కార్ యోచిస్తోంది. మరోపక్క ఈ నెలాఖరుతో వారి కాలపరిమితి ముగియనుంది. ఈ నేపథ్యంలో తమను కొనసాగిస్తారో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 53 ప్రభుత్వ శాఖల్లో 55 వేలమంది వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. వీరిలో 16,230 మంది 11 ఏళ్లుగా ఔట్‌సోర్సింగ్ సిబ్బందిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
దాదాపు అన్ని శాఖల్లోనూ వీరు పని చేస్తున్నప్పటికీ.. వైద్య, ఆరోగ్య శాఖ, సర్వశిక్షా అభియాన్, హౌసింగ్, డ్వామా, రెవెన్యూ వంటి కీలకమైన శాఖల్లో అత్యధికంగా వీరు ఉన్నారు. వీరిలో క్లాస్-4 సిబ్బందికి రూ.6,700 వరకు; కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది రూ.8,900 వరకూ డ్రా చేస్తున్నారు. పేరుకు ఎనిమిది గంటల ఉద్యోగమే అయినప్పటికీ రోజుకు 10 నుంచి 12 గంటల పాటు వీరు పని చేస్తూంటారు. కొన్ని శాఖల్లో రెగ్యులర్ సిబ్బంది చేసే పనికంటే నాలుగైదు రెట్లు అధికంగా వీరు పని చేస్తున్నారు. వీరిలో చాలామంది నైపుణ్యత కలిగినవారు ఉండడంతో రెగ్యులర్ సిబ్బందిలో పలువురు పూర్తిగా వీరిపైనే ఆధారపడుతూంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఔట్‌సోర్సింగ్ సిబ్బందిలో ఏ ఒక్కరు లేకపోయినా సంబంధిత శాఖల్లో ఏ పనీ ముందుకు కదలని పరిస్థితి నెలకొంది.
పాలనా వ్యవస్థలో ఇంతగా అంతర్భాగమైపోయిన వీరిని రెగ్యులర్ చేయాలని ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. వాస్తవానికి వారి కాలపరిమితి రాష్ర్టపతి పాలన ఉన్న సమయంలోనే మార్చి 31తో ముగిసింది. అప్పట్లో వారు రాష్ర్టపతికి మొర పెట్టుకోగా మూడు నెలల పాటు కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తరువాత అధికారం చేపట్టే ప్రభుత్వం వారి కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటుందని అప్పట్లో తెలిపారు. వారికి రాష్ర్టపతి ఇచ్చిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించే అవకాశం లేదంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
ఔట్‌సోర్సింగ్ సిబ్బందిలో అత్యధికులకు ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు పొందేందుకు వయోపరిమితి దాటిపోయింది. ఇప్పటికిప్పుడు రోడ్డున పడితే వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారనుంది. పదేళ్లుగా అధికారానికి దూరమైన టీడీపీ ఈ కొలువులను తమ కార్యకర్తలకు ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను, కొలువులను కట్టబెట్టే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడువు తరుముకొస్తున్నా తమ కొనసాగింపుపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటనా చేయకపోవడంతో ఔట్‌సోర్సింగ్ సిబ్బందిలో గుబులు మొదలైంది.