ఇదేనా ప్రజా సంక్షేమం
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) :అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేసిన పని ఒక్కటీ కనబడటం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉభయ గోదావరి జిల్లాల పరిశీలకులు ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పార్టీ అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షుల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుద్‌హుద్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన బియ్యాన్ని ఉత్తరాంధ్రలో టీడీపీ కార్యకర్తలు దోచుకున్న ఘటనలు వెలుగు చూశాయని గుర్తు చేశారు.
రాష్ట్ర రాజధాని విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ధర్మాన దుయ్యబట్టారు.టీడీపీ హయాంలో పోలీసులు సినిమా పోలీసుల్లా వ్యవహరిస్తున్నారని, అన్యాయం చేసింది టీడీపీ కార్యకర్తలైతే, అన్యాయానికి గురైన వారిపైనే కేసులు నమోదు చేస్తూ న్యాయ వ్యవస్థను, చట్టాలను పోలీసులు అవహేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటున్న చంద్రబాబుకు సింగపూర్‌లో వ్యవసాయం లేదని తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తే రైతులకు ఒనగూరే ప్రయోజనమేమిటని నిలదీశారు. రైతులను మోసగించడం మొదటినుంచీ చంద్రబాబుకు అలవాటైన విద్యేనని పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని అందరూ అనుకుంటున్నారని, అది వాస్తవం కాదని అన్నారు. పార్టీ పుట్టి నాలుగేళ్లే అయ్యిందని, తొలుత ఒక స్థానం నుంచి ప్రారంభమైన పార్టీ ప్రస్థానం అనంతరం 17 స్థానాలు, ప్రస్తుతం 69 స్థానాలతో దినదినాభివృద్ధి చెందుతోందనే విషయాన్ని గుర్తెరగాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ 150 స్థానాలకు పైబడి సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పదవిని బట్టి గౌరవం దక్కుతుంని అనుకోవడం పొరపాటేనని, పదవీ బాధ్యతల నిర్వహణను బట్టే గౌరవం పెరుగుతుందని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వివిధ విభాగాల అధ్యక్షులకు ధర్మాన హితబోధ చేశారు. పార్టీ నిర్మాణంలో అనుబంధ విభాగాల నిర్మాణం కీలక ఘట్టమని, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ ్లనాని ఆ ఘట్టాన్ని సమర్థవంతంగా పూర్తి చేశారని అభినందించారు. ఇక పార్టీ నిర్మాణం అనుబంధ విభాగాల చేతుల్లో ఉందని ఏ విభాగానికీ ప్రత్యేక ప్రతిపత్తి ఉండదని, పార్టీ జిల్లా విభాగానికి లోబడి పనిచేయాలన్నారు. మరో రెండేళ్లలో వైఎస్సార్ సీపీలోకి ఇతర పార్టీల నాయకులు వలసలు వచ్చే పరిస్థితి ఉంటుందని అన్నారు.
ఏ వర్గానికీ న్యాయం
జరగడం లేదు : కొత్తపల్లి
టీడీపీ పాలనలో జిల్లాలోని ఏ వర్గానికీ న్యాయం జరగడం లేదని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. ఉన్న పింఛన్లు తొలగించి ప్రభుత్వం అర్హుల ఉసురుపోసుకుంటోందని ద్వజమెత్తారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రతిపక్షాలు ప్రజలకు తెలపాల్సిన అవసరం లేదని, ప్రజలకే ప్రత్యక్షంగా అనుభవం అవుతోందని పేర్కొన్నారు. అన్ని పార్టీల నాయకులు గడ్డాలు మెరిసిపోయిన వారు కాగా, తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే ఉత్సాహం నిండిన యువకుడని, ఆయన నాయకత్వంలో పనిచేయడం అదృష్టమని అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అనుబంధ విభాగాలు పోరాటాలు చేయాలని, వారికి రక్షణ కవచంగా తాము ఉంటామని హామీ ఇచ్చారు.
సింగపూర్‌కు రూ.400 కోట్లు
తరలించాడు : ఇందుకూరి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని పదేపదే చెబుతున్నారని, అయితే ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తిలో రూ.400 కోట్లను సింగపూర్‌కు తరలించినట్టు వార్తలు వచ్చిన నేపధ్యంలో చంద్రబాబు సచ్ఛీలతపై అనుమానాలు తలెత్తాయని అన్నారు. అనుకోకుండా వచ్చిన అధికారాన్ని చూసి టీడీపీ నాయకులు విర్రవీగుతున్నారని, సామాన్య ప్రజలపై కూడా వారి దాష్టీకాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యకర్తల్లో ఉత్తేజం నింపడంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నాని సఫలమయ్యారని, అనుబంధ సంఘాల నాయకులు పార్టీని బలోపేతం చేయడంలో ఆయనకు సహకరించాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో పార్టీ జిల్లాలో స్థానాలనూ సాధిస్తుందని జోస్యం చెప్పారు.
త్వరలోనే మండల కమిటీలు : ఆళ్ల నాని
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల నిర్మాణం పూర్తయ్యిందని, త్వరలోనే మండల కమిటీలపై దృష్టి పెడతామని పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని తెలిపారు. జిల్లాలోని అందరి నాయకుల, కార్యకర్తల సూచనలతో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించామన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి నూతన విభాగాలు పనిచేయాలన్నారు. టీడీపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల సమస్యలను గుర్తించామని, నరసాపురం నియోజకవర్గంలో సమావేశం నిర్వహించాల్సి ఉందన్నారు. 48 మండలాల్లో పార్టీని పటిష్టం చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు.