ఏ నోట విన్నా.. మోసాల మాటలే!
వైఎస్సార్‌సీపీ నేతల ఎదుట బాధితుల ఏకరువు
నాడు టీడీపీకి ఓటేసి తప్పుచేశామంటున్న ప్రజలు
ప్రజా వ్యతిరేక విధానాలపై సర్వత్రా వ్యతిరేకత
జిల్లా వ్యాప్తంగా గడపగడపకూ వైఎస్సార్‌కు ఘనస్పందన
విజయనగరం మున్సిపాలిటీ: రెండేళ్ల తెలుగుదేశం ప్రభుత్వంపై అప్పుడే జనానికి ఏవగింపు కలిగింది. సంక్షేమ పథకాల అమలులో వివక్ష, ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీల అమలుపై నిర్లక్ష్యవైఖరిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలకు పిర్యాదులు అందుతున్నాయి. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా జరుగుతున్న గడపగడపకూ వైఎస్సార్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఇతర నాయకులు పార్టీ రూపొందించిన 100 ప్రశ్నల ప్రజాబ్యాలెట్‌లతో ప్రజల్లోకి వెళ్తుంటే వారికి మంచి స్పందన లభిస్తోంది.
విజయనగరం మున్సిపాలిటీ 4వ వార్డు పూల్‌బాగ్‌కాలనీలో గురువారం జరిగిన జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, పట్టణ అధ్యక్షుడు ఆశపువేణు తదితరులు పాల్గొనగా... సాలూరు మండలం సారిక, కురుపుట్టి గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, జెడ్పీటీసీ, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రెడ్డిపద్మావతిలు పాల్గొన్నారు.
పార్వతీపురం మండలం నవిరి, నవిరి కాలనీల్లో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి జమ్మాన ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ప్రజలతో మమేకమయ్యారు. అదేవిధంగా నెల్లిమర్లలోని గరికిపేటలో జరిగిన కార్యక్రమంలో పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు ప్రజా సమస్యలను అడిగితెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా కల్పించారు. అదేవిదంగా గరివిడి మండలం బాగువలసలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకుడు మజ్జిశ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు పాల్గొనగా, ఎస్‌కోట మండలం సీతారాంపురంలో జరిగిన జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి నెక్కల నాయుడుబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు గడపగడపకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలు వివరించారు.
బాబూ... ఆయనొచ్చారు. మా పింఛన్ ఊడింది. అయ్యా... ఆయన గద్దెనెక్కారు... మా రేషన్‌కార్డు గల్లంతయింది. ఇంటికోసం దరఖాస్తు చేశా... ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇదీ గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా పల్లెలకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులవద్ద వినిపిస్తున్న బాధితుల గోడు. మాఫీలకు ఆశపడి ఓటేసినందుకు తగిన శాస్తిజరిగిందని పశ్చాత్తాప పలుకులు.