టీడీపీ అంటే 'తెలుగు డిస్ట్రక్షన్ పార్టీ': బృందా కారత్
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీపై సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు డిస్ట్రక్షన్ పార్టీ (తెలుగువాళ్లను విచ్చిన్నం చేసే పార్టీ) అని వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నంలోని గాజువాక నియోజకవర్గంలో సీపీఎం పార్టీ అభ్యర్ధి నర్సింగరావు తరపున ప్రచారం నిర్వహించిన బృందా కారత్.. తెలుగుదేశం, బీజేపీల పొత్తుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాణానికి రెండు వైపుల్లాంటి వాళ్లు అని విమర్శించారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మ్యానిఫెస్టో చూస్తే వారి మధ్య ఎలాంటి తేడాలు లేవని బృందా కారత్ అన్నారు. రాజకీయాల్లో అధికార పక్షానికి, ప్రతిపక్షం కుమ్మక్కవడం అత్యంత శోచనీయం అని అన్నారు. ప్రధాని పీఠంపై కూర్చోవడానికి ముందు నరేంద్రమోడీ చరిత్రలోని కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి ఉందని బృందాకారత్ ఎద్దేవా చేశారు.