పరిగి, న్యూస్‌లైన్: కర్నూలు, అనంతపురం జిల్లాలతో రాయల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రతిపాదనకు ఒప్పుకునేది లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పరిగిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి సహా తెలంగాణ ప్రాంత మంత్రులందరూ వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. మంత్రులు స్పందించకుంటే వారంతా సీమప్రాంత నేతల ప్రయోజనాల కోసం పాకులాడుతూ తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే భావిస్తామని అన్నారు.
రాష్ట్రంలో ఇటీవలి తుపాన్లకు పంటలు నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల పరిహారం తక్షణమే అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే రంగు మారిన ధాన్యం, పత్తి, మొక్కజొన్నలను మద్దతు ధరలకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. లేదంటే రైతులతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పి.చంద్రయ్య మాట్లాడుతూ కృష్ణా జలాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కృష్ణా జలాల వాటాలో అన్యాయం జరిగిందని ఆరోపించారు. టీడీపీ లేఖ తర్వాతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని గుర్తు చేశారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని, కాంగ్రెస్ పార్టీని గద్దె దింపేందుకు ప్రజలు తహతహలాడుతున్నారని అన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు లాల్‌కృష్ణప్రసాద్, నయీముద్దీన్ ఉన్నారు
రాయల తెలంగాణకు టీడీపీ వ్యతిరేకం
Published Sun, Dec 1 2013 11:59 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement