100 కోట్ల స్థలంపై తమ్ముడి కర్ఛీఫ్
- రాజమహేంద్రవరం నడిబొడ్డున ‘అధికారిక’ కబ్జా
- పేదలను ఖాళీ చేయించి కంచె వేసిన టీడీపీ నేత
- ‘సాక్షి’ వద్ద పక్కా ఆధారాలు
రాజమండ్రి: వివాదంలో ఉన్న స్థలం లేదా ఖాళీగా ప్రభుత్వం స్థలం కనపడితే చాలు తెలుగు తమ్ముళ్లు కర్చీఫ్ వేసేస్తున్నారు. ఆక్రమించిన స్థలానికి కంచె వేసి ఈ స్థలం తాము కొన్నామంటూ దొంగ ఆధారాలు సృష్టించేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను రక్షించాల్సిన అధికారులు రాజకీయ ఒ›త్తిళ్ల వల్ల చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరం నడిబొడ్డున అత్యంత విలువైన నగరపాలక సంస్థ స్థలాన్ని అధికారపార్టీకి చెందిన ఓ నాయకుడు కబ్జా చేశాడు.
ఆ స్థలాన్ని తాను కొనుగోలు చేశాని చెబుతూ అక్కడ 50 ఏళ్లుగా గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకుని నివసిస్తున్న 110 మంది పేద కుటుంబాలను ఖాళీ చేయించి కంచె వేశాడు. ఆ స్థలం విలువ రూ. 100 కోట్ల పైనే ఉంటుందని అంచనా. పేదలు నిరాశ్రయులు కావడంతో ఆ స్థలం గురించిన పూర్వాపరాలను ’సాక్షి’ శోధించింది. తీరా అది ప్రభుత్వ స్థలమని ఆధారాలతో సహా నిర్థారణ అయింది. ఈ ‘అధికారిక’ కబ్జాకు సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
ఆదెమ్మ దిబ్బ అసలు కథ ఇదీ...
రాజమహేంద్రవరం నగర నడిబొడ్డున కంబాల చెరువు సమీపంలో 36,38 డివిజన్ల పరిధిలో కొందరు ప్రైవేటు వ్యక్తుల స్థలం ఉంది. దీనిని ఆదెమ్మ దిబ్బ ప్రాంతంగా పిలిస్తున్నారు. నగరపాలక సంస్థ పాఠశాల నిర్మాణం కోసం అప్పటి రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ 1978 నవంబర్ 8వ తేదీన సర్వే నంబర్లు 724/1డీలో 25 సెంట్లు, 725/3ఏలో ఎకరా 81 సెంట్లు, 725/3ఈలో ఒక సెంటు, 730/2సీ2లో 3 ఎకరాల 69 సెంట్లు, 731/2లో 11 సెంట్లు వెరసి మొత్తం 5 ఎకరాల 87 సెంట్ల స్థలం సేకరణకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. 28.05.1980లో ఈ సేకరణకు సంబంధించి డ్రాఫ్ట్ డిక్లరేషన్ జారీ చేసి 12.06.1981లో ఆమోదించారు. ఆయా స్థలాల యజమానులకు 30.07.1985లో సబ్‌కలెక్టర్ ప్రదీప్‌చంద్ర అవార్డు (నంబర్ 6/85) ప్రకటించారు.
అవార్డు ఇచ్చిన సర్వే నంబర్ల స్థలాలు, యజమానులు వీరే..
ఐదు సర్వే నంబర్లలో మొత్తం 5 ఎకరాలు 87 సెంట్లకు అప్పటి కలెక్టర్ ప్రదీప్ చంద్ర (30.07.1985లో) అవార్డు (నంబర్6/85) ప్రకటించగా.. తర్వాత ప్రభుత్వం కొంత స్థలం సేకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. మరి కొందరు న్యాయస్థానానికి వెళ్లి తమ స్థలం సేకరణపై స్టే తెచ్చుకున్నారు. వీరు పోగా మిగిలిన వారికి అవార్డు(నగదు) అందజేశారు. అవార్డు అందుకున్న వారిలో ఈపు అప్పలస్వామి (సర్వే నంబర్ 724/1డీలో 25 సెంట్లు), కందుల సత్యానందం, కందుల మదన మోహనరావు, కందుల రాజేంద్రప్రసాద్ (సర్వే నంబర్ 725/ 3ఏ1లో ఎకరా 63 సెంట్లు), కందుల సంజీవరావు (çసర్వే నంబర్ 730/2సీ2పీలో సెంటు), సత్యవోలు పాపారావు అతని కుమారులు నలుగురు (సర్వే నంబర్ 730/2సీ2పీలో ఎకరా 81 సెంట్లు), వాడరేవు వీరభద్రరావు (సర్వే నంబర్ 731/2లో 9 సెంట్లు) ఉన్నారు.
సర్వే నంబర్ 725/3ఏ2లో 7800 చదరపు అడుగులకు ప్రభుత్వం ప్రకటించిన అవార్డు వర్తించలేదు. అదే విధంగా సర్వే నంబర్ 730/2సీ2పీలో సత్యవోలు సత్యవతి(పాపారావు తమ్ముడు లింగమూర్తి సతీమణి)కి చెందిన ఎకరా 88 సెంట్ల స్థలానికి కూడా అవార్డు వర్తించలేదు. వీరు తమ స్థల సేకరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు స్టే(యథాతథ స్థితి) విధించింది. ఇంకా సర్వే నంబర్ 725/3ఏ2, సర్వే నంబర్ 731/2పీలోని 1083 చదరపు అడుగుల స్థలాన్ని సేకరణ ప్రతిపాదన నుంచి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ నాలుగు సర్వే నంబర్లపై కోర్టులో ఆరు కేసులు నడిచాయి.
సత్యవోలు శేషగిరిరావు వద్ద కొనుగోలు చేశానంటూ...
తెలుగుదేశం పార్టీ నేత, కోలమూరు గ్రామ జన్మభూమి కమిటీ సభ్యుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడు తాను ఈ స్థలం సత్యవోలు పాపారావు(లేట్) రెండో కుమారుడు సత్యవోలు శేషగిరిరావు వద్ద కొనుగోలు చేశానని చెబుతున్నారు. ఆదెమ్మ దిబ్బ ప్రాంతంలో సత్యవోలు కుటుంబానికి సర్వే నంబర్ 730/2సీ2లో 3 ఎకరాల 69 సెంట్ల స్థలం ఉంది. ఇందులో సత్యవోలు పాపారావు ఎకరా 81 సెంట్లు, అతని తమ్ముడు సత్యవోలు లింగమూర్తి సతీమణి సత్యవతి ఎకరా 89 సెంట్లు సేకరిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
అయితే సత్యవోలు లింగమూర్తి సతీమణి హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో వారికి ప్రభుత్వం వారికి అవార్డు ఇవ్వకుండా సేకరణ నుంచి ఆ స్థలం ఉపసంహరించుకుంది. సత్యవోలు పాపారావు అతని కుమారులకు మాత్రం ఎకరా 81 సెంట్ల స్థలానికి అవార్డు(రూ. 2, 30, 260)ను ప్రకటించింది. దీనిని బట్టి తేలిందేమిటంటే అక్కడ ఇక సత్యవోలు పాపారావు అతని కుమారులకు సెంటు స్థలం కూడా లేదు. అయితే టీడీపీ నేత పిన్నమరెడ్డి ఈశ్వరుడు తాను సత్యవోలు పాపారావు రెండో కుమారుడు శేషగిరిరావు వద్ద ఈ స్థలం కొనుగోలు చేశానని చెబుతూ కంచె వేయడం గమనార్హం. దీనిపై రెవెన్యూ ఉన్నతాధికారులు, నగరపాలక సంస్థ అధికారులు విచారణ జరిపాలని, ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఖాళీ చేయించిన ఆ స్థలంలో ఇళ్లు కట్టించి ఇవ్వాలని గూడులేని పేదలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
70 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం..
మాకు పెళ్లి అయినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. మా అత్త, వాళ్ల అత్త కూడా ఇక్కడే ఉన్నారని మా ఆయన చెబుతున్నారు. దాదాపు 70 ఏళ్లు నుంచి ఇక్కడే ఉన్నాం. ఆవ(మడగు)ను పూడ్చి ఇళ్లు కట్టుకున్నాం. మా తర్వాత చాలా మంది పేదలు వచ్చారు. ఇప్పుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడు అనే వ్యక్తి ఈ స్థలం కొన్నామంటూ ఖాళీ చేయాలంటున్నారు. అందరూ ఖాళీ చేసి వెళ్లిపోయారు. మా గుడిసెను కూడా కలుపుతూ కంచె వేశారు. మా గుడిసెను కూడా తీసేయాలని బెదిరిస్తున్నారు. మాకు ఏ ఆధారం లేదు. న్యాయం చేయండయ్యా. – కొయ్య నాగమణి, ఆదెమ్మదిబ్బ ప్రాంత నివాసి