జేసీబీతో స్థలం చదును
అడ్డుకున్న వ్యక్తిపై కర్రలతో దాడి పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
రూ.3 కోట్ల వంక పొరంబోకు స్థలంపై టీడీపీ నేత కన్ను
పాకాల : మండలంలోని నేండ్రగుంట పంచాయతీ కొత్తూరులో టీడీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు సురేష్‌కుమార్, అతని అనుచరులు కుంట పొరంబోకును ఆక్రమించడానికి యత్నించారు. శుక్రవారం జేసీబీతో సుమారు రెండు ఎకరాల కుంట పొరంబోకు స్థలాన్ని చదును చేశారు. అడ్డుకున్న వ్యక్తిపై దౌర్జన్యానికి తెగబడ్డారు. వీఆర్‌వో వెంకటేష్ పిళ్లై కథనం మేరకు.. నేండ్రగుంట-తిరుపతి మార్గం కొత్తూరు గ్రామ పరిసరాలలో 758 సర్వే నంబర్‌లో కుంట పొరంబోకు స్థలం 2 ఎకరాలు ఉంది. దాని విలువ సుమారు రూ.3 కోట్ల పైచిలుకు ఉంటుందని అంచనా. దీనిపై కన్నేసిన నేండ్రగుంటకు చెందిన టీడీపీ నాయకుడు జేసీబీ సహాయంతో చదును చేశారు.
సమాచారం అందడంతో తహశీల్దార్ సుధాకరయ్య ఆదేశాల మేరకు వీఆర్వో, వీఆర్‌ఏ భాస్కర్ అక్కడికి చేరుకున్నారు. కుంట పొరంబోకును ఆక్రమించరాదని కోరారు. అయినా ఆక్రమణ పర్వం కొనసాగించారు. అంతేకాకుండా కుంట పొరంబోకు పక్కనే వున్న ప్రసాద్‌రెడ్డి ఇంటి ముందు ఉన్న రాతి స్తంభాలను సైతం పెకలించి వేశారు. దీనిని ప్రసాద్‌రెడ్డి అడ్డుకునేందుకు యత్నించడంతో ఆయనపై దౌర్జన్యం చేశారు. వంక పొరంబోకు స్థల ఆక్రమణకు యత్నించడమే కాకుండా తనపై జెడ్పీటీసీ సభ్యుడు సురేష్‌కుమార్, నిరంజన్‌నాయుడు, పెద్దబ్బ కర్రలతో దాడి చేశారని వారి పేర్లతో సహా బాధితుడు పాకాల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.