Poramboku
-
దర్జాగా కబ్జా
జేసీబీతో స్థలం చదును అడ్డుకున్న వ్యక్తిపై కర్రలతో దాడి పోలీసులకు బాధితుడి ఫిర్యాదు రూ.3 కోట్ల వంక పొరంబోకు స్థలంపై టీడీపీ నేత కన్ను పాకాల : మండలంలోని నేండ్రగుంట పంచాయతీ కొత్తూరులో టీడీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు సురేష్‌కుమార్, అతని అనుచరులు కుంట పొరంబోకును ఆక్రమించడానికి యత్నించారు. శుక్రవారం జేసీబీతో సుమారు రెండు ఎకరాల కుంట పొరంబోకు స్థలాన్ని చదును చేశారు. అడ్డుకున్న వ్యక్తిపై దౌర్జన్యానికి తెగబడ్డారు. వీఆర్వో వెంకటేష్ పిళ్లై కథనం మేరకు.. నేండ్రగుంట-తిరుపతి మార్గం కొత్తూరు గ్రామ పరిసరాలలో 758 సర్వే నంబర్లో కుంట పొరంబోకు స్థలం 2 ఎకరాలు ఉంది. దాని విలువ సుమారు రూ.3 కోట్ల పైచిలుకు ఉంటుందని అంచనా. దీనిపై కన్నేసిన నేండ్రగుంటకు చెందిన టీడీపీ నాయకుడు జేసీబీ సహాయంతో చదును చేశారు. సమాచారం అందడంతో తహశీల్దార్ సుధాకరయ్య ఆదేశాల మేరకు వీఆర్వో, వీఆర్ఏ భాస్కర్ అక్కడికి చేరుకున్నారు. కుంట పొరంబోకును ఆక్రమించరాదని కోరారు. అయినా ఆక్రమణ పర్వం కొనసాగించారు. అంతేకాకుండా కుంట పొరంబోకు పక్కనే వున్న ప్రసాద్‌రెడ్డి ఇంటి ముందు ఉన్న రాతి స్తంభాలను సైతం పెకలించి వేశారు. దీనిని ప్రసాద్‌రెడ్డి అడ్డుకునేందుకు యత్నించడంతో ఆయనపై దౌర్జన్యం చేశారు. వంక పొరంబోకు స్థల ఆక్రమణకు యత్నించడమే కాకుండా తనపై జెడ్పీటీసీ సభ్యుడు సురేష్‌కుమార్, నిరంజన్‌నాయుడు, పెద్దబ్బ కర్రలతో దాడి చేశారని వారి పేర్లతో సహా బాధితుడు పాకాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
నటించకున్నా పర్వాలేదు...కానీ..
సినిమా కొందరికి సరదా.. మరికొందరికి ఫ్యాషన్. ఇంకొందరికి శ్వాస. ఈ మూడో కోవకు చెందిన వ్యక్తి నటుడు శ్యామ్. సినిమానే జీవితంగా భావిస్తున్న ఈయన సినిమా వయసు 13 ఏళ్లు. చేసిన సినిమాలు 25. ఇలా ఏడాదికి సగటున రెండు చిత్రాలు చేసుకుంటూ ఇటు తమిళంతో పాటు అటు తెలుగులోనూ మంచి పాత్రలు చేస్తూ నిలకడగా నట జీవితాన్ని సాగిస్తున్న శ్యామ్ 25వ చిత్రం పొరంబోకు. ఎస్.పి.జననాథన్ దర్శక, నిర్మాతగా బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రంలో ఆర్య, విజయసేతుపతిలు కూడా హీరోలుగా నటించారు. ఈ మధ్య విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నటుడు శ్యామ్‌తో చిన్న చిట్‌చాట్.. ప్రశ్న: ఎస్పీ జననాథన్ దర్శకత్వంలో తొలుత ఇయర్కై చిత్రంలో నటించారు. మళ్లీ పొరంబోకు చిత్రంలో నటించిన అనుభవం? జవాబు: ఇయర్కై చిత్రం సమయంలో నాకంతగా అనుభవం లే దు. జననాథన్‌కు అది దర్శకుడిగా తొలి చిత్రం. తరువాత ఆయనేమిటన్నది గ్రహించాను. జననాథన్ చాలా ఆలోచనాపరుడు. తను నటుల కోసం కథ తయారు చేయరు. కథా పాత్రల కోసం నటుల్ని ఎంపిక చేసుకుంటారు. అలాంటి దర్శకుడితో రెండోసారి పని చేయడం సంతోషం. ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడు జననాథన్. ఇయర్కై చిత్రంలో నేను సరిగా నటించలేదనిపించేది. ఆ చింత పొరంబోకు చిత్రంతో పోయింది. ప్రశ్న: పొరంబోకు చిత్రంలో ఆర్య, విజయ్‌సేతుపతితో నటించిన అనుభవం? జవాబు: ఈ చిత్రంలో మేము ముగ్గురూ మూడు విభిన్న పాత్రల్లో నటించాం. ఎవరి దృష్టిలో వారు చేసేది కరెక్ట్ లాంటి పాత్రలవి. దర్శకుడు సృష్టించిన మూడుముఖ్య భూమికలను మేము ముగ్గురం భుజాలపై మోశాం. ఇక ఆర్య, నేను నటించిన ఉళ్లం కే టు 20 చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. అలాంటిదిప్పుడింత స్థాయికి ఎదగడం సంతోషం. విజయ్ సేతుపతి చాలా మంచి మనసున్న వ్యక్తి. మాలో ఎవరికి షూటింగ్ లేకపోయినా అందరితో పాటు షూటింగ్ వెళుతాం. ఖాళీ సమయాల్లో క్యారవాన్‌లో కూర్చొని జాలీగా మాట్లాడుకుంటాం. మా మధ్య ఇగోకు తావు లేదు. ప్రశ్న: తెలుగులోనూ నటుడిగా ఎదుగుతున్నట్లున్నారు? జవాబు: తెలుగులో ఇప్పటి వరకు ఐదు చిత్రాలు చేశాను. తదుపరి కిక్, రేసుగుర్రం చిత్రాల దర్శకుడు సురేంద్రరెడ్డి తదుపరి చిత్రంలో నటించనున్నాను. ప్రశ్న: నిర్మాతగా ‘6’ చిత్రం చేశారు. ఆ అనుభవం గురించి, మళ్లీ చిత్రం నిర్మించే ఆలోచన ఉందా? జవాబు: నిజం చెప్పాలంటే 6 చిత్రం నిర్మాతగా నాకు లాభాలు తెచ్చిపెట్టలేదు. మంచి గౌరవాన్ని గుర్తింపును తెచ్చిపెట్టింది. అదే విధంగా శ్యామ్ బాధ్యత తెలియని వ్యక్తి కాదు. అన్వేషణ, అంకిత భావం, నిరంతర శ్రమ జీవి అనే పేరును తెచ్చిపెట్టింది. కచ్చితంగా మళ్లీ చిత్రం నిర్మిస్తా. అయితే అది నా గత 25 చిత్రాలకు పూర్తి భిన్నంగా, కొత్తగా, నన్ను నవ్యపరిచేలా ఉంటుంది. ప్రశ్న: మీ 25 చిత్రాల నట జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే? జవాబు: చాలా ఘనంగాను, సంతోషంగాను సంతృప్తి గాను ఉంది. అయితే ఇవన్నీ తలచుకుంటూ కూర్చోలేదు. ఇంకా ఇంకా పరిగెత్తాలి. శ్రమించాలి. ఎదగాలి. నటుడిగా రంగ ప్రవేశం చేసి 13 ఏళ్లు అయ్యింది. నిరంతరపోటీలో ఇంతకాలం నిలబడడం పెద్ద విషయం గానే భావిస్తున్నాను. నా గురువు జీవా నన్ను పరిచయం చేశారు. ఎంతగానో ప్రోత్సహించారు. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా కాలం చెందడంతో నాకు చేయూత నిచ్చేవారే లేకపోయారు. కిందకు పడతోసే వాళ్లు మాత్రం చాలా మంది తయారయ్యారు. అలాంటి పరిస్థితిలో తప్పొప్పులను సరి చూసుకుంటూ నేనే నటిస్తున్నాను. చాలామంది కథలుబాగానే చె ప్పేవారు. అలాంటి చిత్రాలు బాగా ఆడుతాయని గ్యారింటీ ఏముంటుంది. అలా ఎంతకాలం పొరపాట్లు చేస్తూ బోల్తాపడేది? ఇప్పుడలా కాదు సరైన నిర్ణయాలు తీసుకునే పరిణితి సాధించాను. సొంత డబ్బుతో చిత్రం చేసి నిలదొక్కుకున్నాను. ఇకపై నటించకపోయినా ఫర్వాలేదు. కాని చెడ్డ చిత్రం చేసి ఇంట్లో కూర్చోవడం నరకం. మధ్యలో అలాంటి పరిస్థితి చవిచూశాను. ఇకపై అలా జరగకుండా జాగ్రత్త పడుతాను. -
ప్రేక్షకుల గుండెల్లో ఉండాలి
అమ్మ రాధ నటించిన 200 చిత్రాలకు నేను నటించిన రెండు చిత్రాలు సమం అంటున్నారు నటి కార్తీక. ఈమె మలయాళం, తెలుగు, తమిళం, కన్నడం అంటూ దక్షిణాది భాషలన్నింటిలోను నటిస్తున్నా తన కంటూ ఒక స్థాయికి చేరుకోలేదన్నది నిజం. ఒక స్టార్ హీరోయిన్ వారసురాలిగా పరిచయం అయినా ఆశించిన విజయాలను సాధించలేదు. ప్రస్తుతం అవకాశాలు కూడా అంతగా లేవు. విడుదలకు సిద్ధం అవుతున్న వా, పొరంబోకు చిత్రాలే కార్తీక భవిష్యత్తును డిసైడ్ చేయనున్నాయని చెప్పవచ్చు. ఇటీవల వా చిత్ర విలేకరుల సమావేశంలో ఈ అమ్మడి ముచ్చట్లు... ప్రశ్న: వా చిత్రంలో మీ పాత్ర గురించి? జవాబు: ఇందులో సింధు అనే పాత్రలో నటించాను. చిత్రంలో నాకు ఫైట్ సన్నివేశాలాంటివి లేకపోయినా దిల్ వున్న పాత్ర చేశాను. అయితే తొలిసారిగా పూర్తిగా తమిళ సినిమా నాయకిగా నటించాను. హీరోయిన్గా చిత్రంలో పరిచయం పాటలో నటించాలని చాలా కాలంగా ఆశిస్తున్నాను. అలాంటిది ఈ చిత్రంలో నెరవేరింది. ప్రశ్న: కేవీ ఆనంద్, భారతీరాజా లాంటి ప్రముఖ దర్శకుల చిత్రాలలో నటించారు. ఈ చిత్రాల్లో నూతన దర్శకుడితో చేసిన అనుభవం? జవాబు: ఒక నూతన దర్శకుడు కథను ఎంత బాగా చెప్పినా దాన్ని ఎలా తెరపై ఆవిష్కరిస్తారోనన్న సందేహం కలుగుతుంది. అయితే ఈ చిత్ర దర్శకుడు రత్తం శివ కథ చెప్పినప్పుడే నా పాత్ర ఏమిటో ఊహించగలిగాను. చిన్న నటీనటులతో చిన్న కెమెరాతో ముందుగా చిన్న ట్రైలర్‌ను రూపొందించి చూపించారు. అది చాలా ఇంప్రెస్ చేయడంతో నేను వా చిత్రంలో నటించడానికి అంగీకరించాను. ప్రశ్న: చాలామంది హీరోయిన్ల తల్లులు వారి వెంట షూటింగ్‌లకు వస్తుంటారు. మీ అమ్మ మీతో పాటు షూటింగ్‌లకు రాదట. నిజమేనా? జవాబు: మీరు అన్నట్లుగానే చాలామంది హీరోయిన్ల తల్లులు షూటింగ్‌లకు వస్తుంటారు. ఏ ఏ సన్నివేశాల్లో చిత్రీకరిస్తున్నారు అని ఆరాలు తీస్తుంటారంటారు. అలా ఎవరు అనుకోకూడదనే మా అమ్మ షూటింగ్‌లకు రారు. ఒకవేళ దర్శకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం చూడాలనిపిస్తే షూటింగ్ ప్రారంభం రోజున వస్తారు. అయినా క్యారవాన్ వ్యాన్లోనే కూర్చొంటారు గాని షూటింగ్ స్పాట్‌కు రారు. అమ్మ అప్పట్లో తమిళం, తెలుగు భాషలలో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందారు. ఆమెకు పలువురు దర్శక నిర్మాతలు తెలుసు. వారంతా కథలు వినిపించడానికి వస్తుంటారు. వారితో కథా చర్చల్లో పాల్గొంటారు. ప్రశ్న: కో చిత్రం ఘన విజయం సాధించినా మీ మార్కెట్ పెరగలేదే? జవాబు: కో చిత్రం తరువాత తెలుగులో వరుసగా చిత్రాలు చేశాను. అమ్మకు తొలి చిత్రం తమిళంతోనే అమరింది. నేను తొలి చిత్రాన్ని తమిళంలోనే ఆశించాను. అయితే అది మన చేతుల్లో లేదని తెలిసిపోయింది. పదవ తరగతి చదువు పూర్తి కాగానే సినీ రంగ ప్రవేశం చేశాను. తెలుగులో నాగార్జున కొడుకు నాగచైతన్య సరసన జోష్ చిత్రం ద్వారా పరిచయం అయ్యాను. ఆయన నటన, డాన్స్‌లో శిక్షణ పొంది నటించడానికి వచ్చారు. నేను అలాంటివేవీ లేకుండానే నటించడానికి సిద్ధం అయ్యాను. అలాగే తమిళంలో నా చిత్రాలకు గ్యాప్ వచ్చి ఉండవచ్చు గాని తెలుగు, మలయాళం, కన్నడం అంటూ నేను వరుసగా నటిస్తూనే ఉన్నాను. అన్ని చిత్రాలలోనూ ముఖ్యపాత్రలు కావడంతో అధిక కాల్షీట్స్ కేటాయించాల్సి వస్తోంది. ఏడాదికి ఒక చిత్రం చేసినా అది ప్రేక్షకులకు నచ్చాలి. వారి గుండెల్లో నేను ఉండాలి. ప్రశ్న: అన్నకొడి చిత్రంలో నటించినందుకు బాధపడ్డారట? జవాబు: ఎవరలా అన్నది? ఆ చిత్రంలో నటించడం చాలా సంతోషం. కో చిత్రం తరువాత భారతీరాజా ఇచ్చినఅవకాశం అది. కో చిత్రం తరువాత ఎవరూ ఊహించని పాత్రను అన్నకొడి చిత్రంలో చేశాను. నటనలో శిక్షణ పొందలేదన్న లోటు ఆ చిత్రంలో నటించడంతో తీరింది. ఉదయ చంద్రిక అనే తన తల్లిని రాధగా మార్చిన భారతీరాజా దర్శకత్వంలో నటించడం నా భాగ్యం. ప్రశ్న: మీ అమ్మ రాధ పలు చిత్రాల్లో నటించారు. ఒక నటిగా మీకు అలాంటి ఆశ ఉందా? జవాబు: సూపర్ హీరోల నుంచి కామెడీ నటుల వరకు పలువురి సరసన నటించిన నటి మా అమ్మ. ఎవరి సరసన నటించినా అమ్మను అంగీకరించారు, ఆదరించారు. ఆ కాలం వేరు. అందుకే అమ్మ సులభంగా 200 చిత్రాలు పూర్తి చేశారు. ఆ రోజుల్లో రెండు నెలల్లో మూడు నాలుగు చిత్రాలు నటించేవారు. ఇప్పుడు ఒక చిత్రం పూర్తి చేయడానికి ఏడాది పడుతోంది. అలా చూస్తే అమ్మ నటించిన 200 చిత్రాలు నేను చేసిన రెండు చిత్రాలకు సమం. -
రంజిత్ దర్శకత్వంలో ఆర్య?
అట్టకత్తి చిత్రంతో మెగాఫోన్ పట్టిన దర్శకుడు రంజిత్. తొలి చిత్రంలోనే విజయం సాధించి అట్టకత్తి దర్శకుడిగా గుర్తింపు పొందిన ఈయన మలి ప్రయత్నం కార్తీతో చేసి మెడ్రాస్ చిత్రాన్ని విజయతీరానికి చేర్చారు. దీంతో ఈ సక్సెస్ఫుల్ దర్శకుడిపై పలువురు హీరోలు కన్నేశారు. ఈయన దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ వరుసలో నటుడు ఆర్య ముందున్నట్టు సమాచారం. రంజిత్, ఆర్య కాంబినేషన్లో ఆల్ ఎంటర్టైన్మెంట్ అంశాలతో కూడిన ఒక చిత్రం తెరకెక్కనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని ఇంతకుముందు మెడ్రాస్ చిత్రాన్ని నిర్మించిన స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. విశేషమేమిటంటే ఈ సంస్థ బయట హీరోలతో నిర్మిస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. ఇప్పటి వరకు సూర్య, కార్తీలే ఈ బ్యానర్లో నటించారు. ఇది వారి సొంత నిర్మాణ సంస్థ. అయితే ఆర్యతో నిర్మించనున్న ఈ చిత్రం గురించి అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఆర్య మిగమాన్, పొరంబోకు, మచ్చకన్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నారు.