ప్రేక్షకుల గుండెల్లో ఉండాలి | the hearts of the audience | Sakshi
Sakshi News home page

ప్రేక్షకుల గుండెల్లో ఉండాలి

Published Sat, May 2 2015 2:16 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

ప్రేక్షకుల గుండెల్లో ఉండాలి - Sakshi

ప్రేక్షకుల గుండెల్లో ఉండాలి

అమ్మ రాధ నటించిన 200 చిత్రాలకు నేను నటించిన రెండు చిత్రాలు సమం అంటున్నారు నటి కార్తీక. ఈమె మలయాళం, తెలుగు, తమిళం, కన్నడం అంటూ దక్షిణాది భాషలన్నింటిలోను నటిస్తున్నా తన కంటూ ఒక స్థాయికి చేరుకోలేదన్నది నిజం. ఒక స్టార్ హీరోయిన్ వారసురాలిగా పరిచయం అయినా ఆశించిన విజయాలను సాధించలేదు. ప్రస్తుతం అవకాశాలు కూడా అంతగా లేవు. విడుదలకు సిద్ధం అవుతున్న వా, పొరంబోకు చిత్రాలే కార్తీక భవిష్యత్తును డిసైడ్ చేయనున్నాయని చెప్పవచ్చు. ఇటీవల వా చిత్ర విలేకరుల సమావేశంలో ఈ అమ్మడి  ముచ్చట్లు...
 
ప్రశ్న: వా చిత్రంలో మీ పాత్ర గురించి?


జవాబు: ఇందులో సింధు అనే పాత్రలో నటించాను. చిత్రంలో నాకు ఫైట్ సన్నివేశాలాంటివి లేకపోయినా దిల్ వున్న పాత్ర చేశాను. అయితే తొలిసారిగా పూర్తిగా తమిళ సినిమా నాయకిగా నటించాను. హీరోయిన్‌గా చిత్రంలో పరిచయం పాటలో నటించాలని చాలా కాలంగా ఆశిస్తున్నాను. అలాంటిది ఈ చిత్రంలో నెరవేరింది.
 
 ప్రశ్న: కేవీ ఆనంద్, భారతీరాజా లాంటి ప్రముఖ దర్శకుల చిత్రాలలో నటించారు. ఈ చిత్రాల్లో నూతన దర్శకుడితో చేసిన అనుభవం?

జవాబు: ఒక నూతన దర్శకుడు కథను ఎంత బాగా చెప్పినా దాన్ని ఎలా తెరపై ఆవిష్కరిస్తారోనన్న సందేహం కలుగుతుంది. అయితే ఈ చిత్ర దర్శకుడు రత్తం శివ కథ చెప్పినప్పుడే నా పాత్ర ఏమిటో ఊహించగలిగాను. చిన్న నటీనటులతో చిన్న కెమెరాతో ముందుగా చిన్న ట్రైలర్‌ను రూపొందించి చూపించారు. అది చాలా ఇంప్రెస్ చేయడంతో నేను వా చిత్రంలో నటించడానికి అంగీకరించాను.

 ప్రశ్న: చాలామంది హీరోయిన్ల తల్లులు  వారి వెంట షూటింగ్‌లకు వస్తుంటారు. మీ అమ్మ మీతో పాటు షూటింగ్‌లకు రాదట. నిజమేనా?

జవాబు: మీరు అన్నట్లుగానే చాలామంది హీరోయిన్ల తల్లులు షూటింగ్‌లకు వస్తుంటారు. ఏ ఏ సన్నివేశాల్లో చిత్రీకరిస్తున్నారు అని ఆరాలు తీస్తుంటారంటారు. అలా ఎవరు అనుకోకూడదనే మా అమ్మ షూటింగ్‌లకు రారు. ఒకవేళ దర్శకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం చూడాలనిపిస్తే షూటింగ్ ప్రారంభం రోజున వస్తారు. అయినా క్యారవాన్ వ్యాన్‌లోనే కూర్చొంటారు గాని షూటింగ్ స్పాట్‌కు రారు. అమ్మ అప్పట్లో తమిళం, తెలుగు భాషలలో ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందారు. ఆమెకు పలువురు దర్శక నిర్మాతలు తెలుసు. వారంతా కథలు వినిపించడానికి వస్తుంటారు. వారితో కథా చర్చల్లో పాల్గొంటారు.
 
 ప్రశ్న: కో చిత్రం ఘన విజయం సాధించినా మీ మార్కెట్ పెరగలేదే?

జవాబు: కో చిత్రం తరువాత తెలుగులో వరుసగా చిత్రాలు చేశాను. అమ్మకు తొలి చిత్రం తమిళంతోనే అమరింది. నేను తొలి చిత్రాన్ని తమిళంలోనే ఆశించాను. అయితే అది మన చేతుల్లో లేదని తెలిసిపోయింది. పదవ తరగతి చదువు పూర్తి కాగానే సినీ రంగ ప్రవేశం చేశాను. తెలుగులో నాగార్జున కొడుకు నాగచైతన్య సరసన జోష్ చిత్రం ద్వారా పరిచయం అయ్యాను. ఆయన నటన, డాన్స్‌లో శిక్షణ పొంది నటించడానికి వచ్చారు. నేను అలాంటివేవీ లేకుండానే నటించడానికి సిద్ధం అయ్యాను. అలాగే తమిళంలో నా చిత్రాలకు గ్యాప్ వచ్చి ఉండవచ్చు గాని తెలుగు, మలయాళం, కన్నడం అంటూ నేను వరుసగా నటిస్తూనే ఉన్నాను. అన్ని చిత్రాలలోనూ ముఖ్యపాత్రలు కావడంతో అధిక కాల్‌షీట్స్ కేటాయించాల్సి వస్తోంది. ఏడాదికి ఒక చిత్రం చేసినా అది ప్రేక్షకులకు నచ్చాలి. వారి గుండెల్లో నేను ఉండాలి.
 
 ప్రశ్న: అన్నకొడి చిత్రంలో నటించినందుకు బాధపడ్డారట?

జవాబు: ఎవరలా అన్నది? ఆ చిత్రంలో నటించడం చాలా సంతోషం. కో చిత్రం తరువాత భారతీరాజా ఇచ్చినఅవకాశం అది. కో చిత్రం తరువాత ఎవరూ ఊహించని పాత్రను అన్నకొడి చిత్రంలో చేశాను. నటనలో శిక్షణ పొందలేదన్న లోటు ఆ చిత్రంలో నటించడంతో తీరింది. ఉదయ చంద్రిక అనే తన తల్లిని రాధగా మార్చిన భారతీరాజా దర్శకత్వంలో నటించడం నా భాగ్యం.
 
 ప్రశ్న: మీ అమ్మ రాధ పలు చిత్రాల్లో నటించారు. ఒక నటిగా మీకు అలాంటి ఆశ ఉందా?

జవాబు: సూపర్ హీరోల నుంచి కామెడీ నటుల వరకు పలువురి సరసన నటించిన నటి మా అమ్మ. ఎవరి సరసన నటించినా అమ్మను అంగీకరించారు, ఆదరించారు. ఆ కాలం వేరు. అందుకే అమ్మ సులభంగా 200 చిత్రాలు పూర్తి చేశారు. ఆ రోజుల్లో రెండు నెలల్లో మూడు నాలుగు చిత్రాలు నటించేవారు. ఇప్పుడు ఒక చిత్రం పూర్తి చేయడానికి ఏడాది పడుతోంది. అలా చూస్తే అమ్మ నటించిన 200 చిత్రాలు నేను చేసిన రెండు చిత్రాలకు సమం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement