కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు అందిస్తున్న వలంటీర్లు
సాక్షి, కాశీబుగ్గ: ప్రజల ఇంటికే ప్రభుత్వ సేవలతోపాటు సంక్షేమ పథకాలు అందుతుండటంతో టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తమ మనుగడకే ముప్పు తప్పదని భయపడుతున్న వారంతా వలంటీర్లపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఇటీవల రేగిడి మండలం కాగితాపల్లిలో దాడి చేయగా, తాజాగా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి ఉదయంపురంలో ఓ టీడీపీ నాయకుడు తీవ్ర స్థాయిలో దూషించాడు. మహిళలని చూడకుండా దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై బాధిత వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... పలాస ఉదయపురం వీధిలో మండపం వద్ద 17, 19, 21, 22, 23 వార్డులకు సంబంధించిన రైతుభరోసా కార్యక్రమాన్ని శనివారం ఏవో ప్రభావతి సమక్షంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇదేక్రమంలో 22వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ గాలి కృష్ణారావు తమ వార్డు వలంటీర్ ఎవరని.. తమకెందుకు సమాచారం ఇవ్వలేదంటూ కొవ్వూరు లక్ష్మి చేతిలో నుంచి బలవంతంగా మైకు లాక్కోని ఆమెను ఇష్టానుసారంగా దూషించాడు.
ఇంతలో మరో వలంటీర్ సమాధానం ఇవ్వడంతో ‘నువ్వెవరు సమాధానం చెప్పడానికి’ అంటూ కొత్తపల్లి శోభారాణిపై విరుచుకుపడ్డాడు. వలంటర్ లక్ష్మి కల్పించుకుని ముందు రోజు రాత్రి ఏడు గంటలకు ఇంటికి వెళ్లామని తన భార్య, తల్లిని కలిసి ఇళ్ల దరఖాస్తులు అందించామని, అయినా రాలేదని, పర్సనల్ ఫోన్‌కు సమాచారం అందించలేదని అనడం ఏమిటని ప్రశ్నించింది. దీంతో కోపోద్రిక్తుడై ఆమెపై దురుసుగా ప్రవర్తించడంతో ఆవేదన చెందింది. వలంటీర్లపై విరుచుకుపడ్డ తీరును అందరూ ఖండించారు. తీవ్ర మనస్తాపానికి చెందిన మహిళా వలంటీర్లు కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఎస్‌ఐ మహమ్మద్ ఆలీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వలంటీర్లలో కొవ్వూరు లక్ష్మి, కే శోభారాణి, సీహెచ్ దుర్గారావు, ఆర్ కుమారి, ఎం సుధారాణి, బీ జ్యోతి, ఎస్ వెంకటరమణ, డీ వాసుదేవ్ ఉన్నారు.
కొత్త చెలికానివలసలో పోలీసు పికెట్..
రేగిడి: మండలంలోని కొత్త చెలికానివలస గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ వలంటీరు దాసు పుండరీకి గ్రామానికి చెందిన తోట నాగభూషణం, తోట రామారావు, తోట జగన్ తదితరులకు చిన్నపాటి ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో మరో వలంటీరు పూసరి జోత్స్న వీడియో తీస్తోంది. వీడియో ఎందుకు తీస్తున్నావని రామారావు తదితరులు ఇద్దరు వలంటీర్లపై దాడికి యత్నించారు. ఈ విషయం శనివారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఏఎస్సై శ్రీనివాసరావుతోపాటు సిబ్బంది గ్రామానికి వెళ్లి ఎటువంటి గొడవలు తలెత్తకుండా పహారా కాస్తున్నారు. ఇరువర్గాలకు నచ్చజెప్పి సమస్య పరిష్కారమయ్యే విధంగా చేస్తామని ఏఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment