ఎన్నికల వేళ అసమ్మతి గోల
వలసలపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం
టికెట్ల కేటాయింపులో అధినేత ఇష్టారాజ్యం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు :
జిల్లా తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య విబేధాలు పొడచూపాయి. మొదటి నుంచీ జెండాలు మోసిన వారిని పక్కనబెట్టి కొత్త వారికి అవకాశం కల్పించడాన్ని కొందరు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఒక నాయకుడిని బుజ్జగించేలోపే మరో అసమ్మతి వాది తిరుగుబాటు జెండా ఎగుర వేస్తున్నాడు. ఒక పక్క మునిసిపల్ ఎన్నికలు, మరో పక్క సార్వత్రిక ఎన్నికలు రావడంతో నేతలకు తలలు బొప్పికడుతున్నాయి. మునిసిపల్ ఎన్నికలకు సరైన అభ్యర్థులు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి తెచ్చుకునే పరిస్థితి టీడీపీకి దాపురించింది.
మరో పక్క సార్వత్రిక ఎన్నికలకు కూడా ఇతర ప్రాంతాల వారిని, ఇతర పార్టీల వారిని ఆహ్వానించడాన్ని పార్టీ నేతలు సహించలేకపోతున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో అసమ్మతి గోల
మహానంది అనే అభ్యర్థిని పోటీలోకి దింపాలని భావిస్తున్నారు. ఈయనైతే యాదవ సామాజిక వర్గం ఓట్లు కొన్నైనా పడతాయన్న ఆలోచనలో ఉన్నారు. మహానంది రాకను ఇబ్రహీం వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో వీరిద్దరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, పార్టీ సీనియర్ నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తిలు వీరిద్దరినీ బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. అదేవిధంగా కందుకూరు అభ్యర్థిగా దివి శివరాంను పోటీలోకి దింపాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.
అయితే అక్కడ టికెట్ ఆశిస్తున్న చల్లా శ్రీనివాసరావు తనకే సీటు కేటాయించాలని చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చారు. డెయిరీ చెర్మైన్‌గా ఉన్న చల్లా శ్రీనివాసరావు.. శివరాం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరిద్దరితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ కూడా కందుకూరుపై కన్నేసినట్లు తెలిసింది. వీరిద్దరినీ కాదని శివరాంకు సీటు కేటాయించే అవకాశం లేదు. ఇదిలా ఉండగా కనిగిరి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కదిరి బాబూరావును నియమించే అవకాశం ఉండగా ఆయన ఆశలు అడియాశలయ్యే అవకాశం కనిపిస్తోంది.
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఇరిగినేని తిరుపతినాయుడు మరో రెండురోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతినాయుడు చేరితే టికెట్ ఆయనకే ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి తెలుగుదేశంలో చేరనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రె స్ నుంచే పోటీ చేస్తానని ఆయన ప్రకటించడంతో తాజాగా కదిరి బాబూరావు ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ తెరమీదకు తిరుపతినాయుడు రావడంతో కదిరి తలపట్టుకున్నారు.
చీరాలలో పోతుల సునీతకు సీటు కేటాయించడంపై ఆ పార్టీలో అసమ్మతి తారా స్థాయికి చేరింది. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి బొడ్డు సరోజనితో పాటు పలవురు సర్పంచులు, ఇతర నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశంలో ఏర్పడిన లుకలుకలతో పార్టీ అధినేత చంద్రబాబు తలపట్టుకున్నారని జిల్లాకు చెందిన రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.