టీడీపీ నేతల హల్‌చల్! | TDP leaders Hulchul! | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల హల్‌చల్!

Published Tue, Dec 16 2014 1:00 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

టీడీపీ నేతల హల్‌చల్! - Sakshi

టీడీపీ నేతల హల్‌చల్!

పదవులు లేకపోయినా వేదికలెక్కుతున్న తెలుగుతమ్ముళ్లు
పిలవకపోతే అధికారులపై చిందులు
బహిరంగంగానే బెదిరింపులు, ఆగ్రహావేశాలు
తీవ్ర ఆవేదన చెందుతున్న అధికారులు

 
పెందుర్తి : ‘ఏమోయ్ నీకు ప్రొటోకాల్ తెలుసా... ఎవరో చెప్పిన తరువాత నన్ను వేదిక మీదకు పిలుస్తావా... ఎలా ఉంది నీకు... నీ సంగతి చూస్తా’... ఇదీ ఆదివారం పురుషోత్తపురంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఓ ఉన్నతాధికారిపై టీడీపీ నేత పీలా శ్రీనివాసరావు చిందులు. నియోజకవర్గంలోని అధికారులకు ప్రొటోకాల్ తలనొప్పులు పట్టుకున్నాయి. ఎక్కడ ఎలాంటి కార్యక్రమం జరిగినా తెలుగుతమ్ముళ్లు వాలిపోతున్నారు. తమను వేదిక పైకి పిలవకపోతే అలుగుతున్నారు. కొందరు ఓ అడుగు ముందుకేసి ఏకంగా అధికారులను దూషిస్తున్నారు. మరికొందరు బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఇదెక్కడి ప్రొటోకాల్ బాధరా బాబూ అంటూ అధికారులు జట్టు పీక్కుంటున్నారు. మొత్తానికి పదవుల్లేని తెలుగుతమ్ముళ్లు సరికొత్త ‘ప్రొటోకాల్’తో ప్రభుత్వ కార్యక్రమాలు కాస్త పార్టీ కార్యక్రమాలుగా మారిపోతున్నాయని ప్రజలు విసుక్కుంటున్నారు.

ఇదెక్కడి బాధ...

వాస్తవానికి అధికారపక్షంలో ఉన్నా పదవులు లేని నాయకులను వేదికల మీదకు పిలవాల్సిన పనిలేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకే తప్ప నాయకులకు ప్రొటోకాల్ వర్తించదు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక పెందుర్తి నియోజకవర్గంలో ప్రొటోకాల్‌కు అర్థం మారిపోయింది. ఎమ్మెల్యేల అనుచరులు ఎంతమంది వేదిక వద్దకు వస్తే అంతమందిని పైకి పిలవాల్సిన పరిస్థితి అధికారులకు ఏర్పడింది. పదుల సంఖ్యలో వస్తున్న నాయకులతో వేదిక నిండిపోవడంతో కార్యక్రమాన్ని నడిపించాల్సిన ఉన్నతాధికారులు సైతం ఏదో మూల నిలబడ్డమో..వేదిక ముందు కూర్చోవడమో చేస్తున్నారు. మరోవైపు వేదిక మీదకు వెళ్లిన ప్రతి నేతకు మైక్ ఇవ్వాల్సి రావడంతో ప్రభుత్వ కార్యక్రమం కాస్త పార్టీ కార్యక్రమంగా మారిపోతుందుని కొందరు అధికారులు వాపోతున్నారు.
 
అందరికీ కోపమే...

 అధికారుల తీరు ఇలా ఉంటే స్థానిక ఎమ్మెల్యే పరిస్థితి మరోలా ఉంది. వాస్తవానికి ఎమ్మెల్యే బండారుతో పాటు మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పెందుర్తిలో అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. దీంతో సదరు ఎమ్మెల్యేల అనుచరులు ఈ ప్రాంతంలో జరిగే ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఒక్కో ఎమ్మెల్యే, అందులో వర్గాలు కలుపుకుని అంతా కలిపి దాదాపు 50 నుంచి 60 మంది అవుతున్నారు. వీరందరినీ వేదిక పైకి పిలవకపోతే స్థానిక ఎమ్మెల్యే బండారుపై అలుగుతున్నారు. దీంతో ఇటు నాయకులకు సర్దిచెప్పలేక... అటు అధికారులను సముదాయించలేక బండారు మౌనం వహిస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement