
శోకసంద్రంలో మంత్రి నారాయణ కుటుంబం
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన మంత్రి నారాయణ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక్కగానొక్క కుమారుడు ఆకస్మిక మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ప్రమాద వార్త తెలుసుకుని జూబ్లీహిల్స్ ఆస్పత్రికి రాజకీయ నేతలు, నారాయణ బంధువులు తరలి వస్తున్నారు. కాగా నిషిత్ (23) ఈ రోజు తెల్లవారుజామున ముడు గంటల సమయంలో తన స్నేహితుడు రాజా రవివర్మతో కలిసి బెంజ్ కారులో వెళ్తుండగా వీరి వాహనం అదుపు తప్పి జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36లో మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది. జూబ్లీహిల్స్‌లోని మంత్రి నారాయణ నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. మంత్రి నారాయణకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు.
అలాగే ఈ ప్రమాదంలో నిశిత్ నారాయణతో పాటు ఆయన స్నేహితుడు రాజా రవివర్మ మృతి చెందాడు. అనంతరం వారి మృతదేహాలను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగినప్పుడు వాహనాన్ని ఎవరు నడుపుతున్నారనేది తెలియరాలేదు. మద్యం సేవించారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.
మరోవైపు ఈ విషాద వార్త తెలుసుకున్న నారాయణ వియ్యంకుడు, మంత్రి గంటా శ్రీనివాసరావు హుటాహుటీన హైదరాబాద్ బయల్దేరారు. కాగా మంత్రి నారాయణ ప్రస్తుతం లండన్‌లో అధికారిక పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ రోజు రాత్రికి నేరుగా నెల్లూరు చేరుకునే అవకాశం ఉంది. మంత్రి నారా లోకేశ్ కూడా నిషిత్ మృతి పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని హైదరాబాద్ బయల్దేరారు.