గాలి ముద్దుకృష్ణమనాయుడు (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు (70) ఇకలేరు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం అర్ధరాత్రి తర్వాత తుదిశ్వాస విడిచారు. మూడు నెలల కిందటే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న ముద్దుకృష్ణమ.. డెంగ్యూతో బాధపడుతూ రెండు రోజులముందు ఆస్పత్రిలో చేరారు. వైద్యుల ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చివరికి ఆయన తనువుచాలించారు. మృద్దుకృష్ణమ మరణంతో ఆయన కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది.
మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్ వల్లే : జ్వరంతో బాధపడిన ముద్దుకృష్ణమను కుటుంబీకులు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ‘‘డెంగ్యూ జ్వరం, బీపీ కంట్రోల్ లేని స్థితిలో ఆదివారం ఆయన ఆస్పత్రిలో చేరారు. రెండురోజుల్లోనే మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల పరిస్థితి చేయిదాటిపోయింది’’ అని కేర్ వైద్యుడు డాక్టర్ కళాధర్ తెలిపారు.
స్వగ్రామంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు : ముద్దుకృష్ణమ నాయుడి అంత్యక్రియలను ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని వెంకట్రామాపురంలో నిర్వహించనున్నట్లు కుటుంబీకులు చెప్పారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ముద్దుకృష్ణమ కుమారుడు జగదీశ్, అల్లుడు వంశీలు తెలిపారు.
ఉపాధ్యాయుడి నుంచి మంత్రిగా.. : గాలి ముద్దుకృష్ణమనాయుడు 1947, జూన్9న జన్మించారు. స్వస్థలం చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని వెంకట్రామాపురం. విద్యాభ్యాసం తర్వాత అధ్యాపక వృత్తిలోకి ప్రవేశించిన ఆయన.. 1983లో ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం శాసనమండలిలో సభ్యుడిగా ఉన్నారు. గాలి మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment