మాజీ మంత్రి ఎదుట వాపోయిన కార్యకర్తలు
జీవో నెం. 97 జీవో రద్దు చేయాలన్న మణికుమారి
చింతపల్లి: ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే తాము గిరిజనులకు మద్దతుగా పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి మత్సరాస మణికుమారి చెప్పారు. స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాల పార్టీ నాయకులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గిరిజనుల మనోభావాలను గౌరవించి చంద్రబాబు 97 జీవోను రద్దు చేయాలని కోరారు. ఎస్టీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ మన్యంలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. మన్యంలో టీడీపీ పరిస్థితిని అధినేతకు వివరించడానికే సిగ్గుగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
అధ్యక్షునికి అవమానం
మండల పార్టీ అధ్యక్షుడు గోకాడ సత్యనారాయణకు ఈ సమవేశంలో సముచిత స్థానం కల్పించక పోవడంపట్ల పలువురు కార్యకర్తలు పెదవి విరిచారు. ఆయన అధ్యక్షతన జరగాల్సిన ఈ సమావేశంలో ఆయన కూర్చునేందుకు కుర్చీ కూడా కేటాయించలేదు. దీంతో సమావేశం ముగిసేంత వరకు ఆయన వెనకాల నిలబడక తప్పలేదు. చింతపల్లి మార్కెట్ యార్డు డెరైక్టర్ దుచ్చరి చిట్టిబాబు, ఎంపీపీ కవడం మచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.