సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు హోదాలో నాలుగేళ్లపాటు కీలకంగా వ్యవహరించిన డాక్టర్ పరకాల ప్రభాకర్‌కు సీఎం చంద్రబాబు కార్యాలయం పొమ్మనకుండా పొగ బెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్రం నుంచి టీడీపీ వైదొలగిన అనంతరం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పరకాలను దూరం పెట్టినట్లు అధికార వర్గాల్లో జోరుగా చర్చ మొదలైంది. కొన్నాళ్లుగా పరకాల ప్రాధాన్యాన్ని తగ్గించిన చంద్రబాబు ముఖ్యమైన అంశాల్లో ఆయన్ను సంప్రదించడంలేదని తెలిసింది. ఇటీవల కలెక్టర్ల సదస్సు సందర్భంగా పరకాల అక్కడ ఉండగానే సీఎం చంద్రబాబు ‘ఎం’ గ్రూపునకు చెందిన సంజయ్ అరోరాను ప్రభుత్వ మీడియా సలహాదారుగా పరిచయం చేశారు. తద్వారా పరకాలను పక్కనపెట్టినట్లేనని భావిస్తున్నారు.
తనంతట తానే వెళ్లిపోయే వ్యూహం
ఇన్నాళ్లూ కీలకంగా ఉన్న పరకాల ప్రాధాన్యాన్ని చంద్రబాబు కొద్దిరోజుల నుంచి అనూహ్యంగా తగ్గించేశారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత ఇక ఆయనతో అవసరం లేదనే అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమవుతుండడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. పరకాల ప్రభుత్వంలో ఉంటే తమకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం, ఇతర వ్యవహారాలన్నీ కేంద్రానికి చేరిపోయే అవకాశం ఉందని అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి ఆయన్ను పక్కనపెడితే ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో పొమ్మనకుండా పొగ బెడుతున్నట్లు చెబుతున్నారు. అందుకే ఆయన స్థానంలో సంజయ్ అరోరాను మీడియా సలహాదారుగా చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ఒకటికి రెండుసార్లు పరిచయం చేశారు.
ప్రభుత్వానికి సంబంధించిన ప్రచారం, మీడియా మేనేజ్‌మెంట్ గురించి సంజయ్ ఆరోరాతో ప్రజెంటేషన్ ఇప్పించారు. మీడియా సలహాదారు, సమాచార శాఖ కమిషనర్‌ను కాదని కొద్దిరోజులుగా చంద్రబాబు ప్రచార వ్యవహారాలు చూస్తున్న సంజయ్‌తో ప్రజెంటేషన్ ఇప్పించడం, ఆయన్ను కమ్యూనికేషన్ సలహాదారుగా చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. పరకాల ప్రభాకర్‌ను 2014లో ప్రభుత్వ మీడియా సలహాదారుగా సీఎం చంద్రబాబు నియమించారు. పరకాల అప్పటి నుంచి మీడియా విషయాలే కాకుండా ప్రభుత్వ, టీడీపీ వ్యవహారాల్లోనూ కీలకంగా ఉంటూ వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment