క్రూరం.. కర్కశం!
*వివాహమైన నాటి నుంచి తప్పని నరకం
*ఆరేళ్లుగా మరీ దుర్మార్గం
*పెళ్లి పేరుతో మహిళకు ఇల్లే కారాగారం
కోటవురట్ల, న్యూస్‌లైన్: బతుకే కారాగారం.. బయిటపడే దారి శూన్యం.. అందరు యువతుల మాదిరిగానే కోటి కలలతో కాపురానికి వస్తే, జీవితం వాడిపోయి, బతుకు బండబారిపోయిన విషాదం.. ఇదీ 43 ఏళ్ల నాగమల్లేశ్వరికి ఎదురైన దారుణ అనుభవం. ఏనాడో 22 ఏళ్ల క్రితం పెళ్లయింది మొదలు.. ఆమె బతుకు కన్నీటి సంద్రమే అయింది. దినమొక గండంగాకాలం గడిచింది. జీవితమంతా తోడుండాల్సిన భర్త నిర్దయుడే అయి, నిత్యం నరకాన్ని అనుభవంలోకి తెస్తే, కన్నీరు కూడా ఇంకిపోయింది.
ఆరేళ్లుగా బతుకు మరీ దుర్భరమైంది. తనది అనుకున్న అత్తవారింటిలో ఓ చిన్నగది ఆమెకు ఖైదుగా మారింది. పగలూ, రాత్రీ ఆ గదే ఆమెకు నెలవైంది. బయిట నుంచి భర్త గడియ పెట్టి, ఓ పాశవికంగా వ్యవహరిస్తే మూగరోదనే గతయింది. కుమార్తెలా చూసుకోవాల్సిన అత్త, సోదరిగా భావించాల్సిన ఆడపడచు మాటలతో హింసిస్తే, కుమిలిపోవడమే బతుకైంది. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన కోటవురట్ల వాస్తవ్యుడు పి.వి.ఎస్.జె.ప్రసాద్ ఇల్లాలి దీనగాథ ఇది..
బియ్యమే గతి..
భార్య పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ప్రసాద్ ఆమెకు కడుపు నిండా భోజనం పెట్టకుండా హింసించేవాడు. ‘నెలకు ఐదు కిలోల బియ్యం ఇచ్చేవారు. గదిలో ఉన్న స్టౌపై ఆ బియ్యాన్ని ఉడకబెట్టి గెంజితో తినాల్సి వచ్చేది. ఆరేళ్ల క్రితం కాస్త మాంసం పెట్టారు.
అదే నేను తిన్న కూర’ అని ఆమె కన్నీళ్లతో, బలహీనమైన గొంతుతో శుక్రవారం పోలీసులకు వివరిస్తూ ఉంటే విన్నవారికి గుండె కరిగిపోయింది. ‘రోగం వచ్చినా దిక్కు లేదు.. ఈ ఇంటికన్నా ఖైదు మేలు’ అని ఆమె చెబుతూ బావురుమంది. గదిలో లైట్ కూడా వేసుకునే స్వేచ్ఛలేదని ఆమె రోదిస్తూ పోలీసులకు చెప్పింది. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సోదరులు ఇప్పుడు స్పందించక పోవడంతో ఆమె బతుకు మరీ దయనీయమైంది. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగమల్లేశ్వరికి న్యాయం ఏ రీతిన లభిస్తుందో వేచిచూడాల్సి ఉంది.