ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలను స్వీకరించే విషయంలో గందరగోళం నెలకొంది. ఫారం-19 ఇస్తే
భీమవరం అర్బన్ :ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలను స్వీకరించే విషయంలో గందరగోళం నెలకొంది. ఫారం-19 ఇస్తే తీసుకుంటామని, ఫారం-7 తీసుకునే అర్హత తమకు లేదని భీమవరం మునిసిపల్ కమిషనర్ బీఆర్ సత్యనారాయణ, తహసిల్దార్ గంధం చెన్నుశేషు చెప్పడం, తనకు సంబంధం లేదని కమిషనర్ పేర్కొన డం గందరగోళానికి దారి తీశాయి. దీనిని నిరసిస్తూ యూటీఎఫ్ నాయకులు మంగళవారం రాత్రి మునిసిపల్ కమిషనర్ చాంబర్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ విషయమై యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బి.గోపిమూర్తి మాట్లాడుతూ భీమవరం పరిధిలో మొత్తం 700 ఉపాధ్యాయ ఓట్లు ఉన్నట్టు పేర్కొంటూ జాబితా విడుదల చేశారని చెప్పారు. అందులో 167 ఓట్లు బోగస్ అని తేలిందన్నారు. వాటిపై అభ్యంతరాలు తెలియజేస్తూ 167 బోగస్ ఓట్లకు సంబంధించి ఫారం నంబర్-7ను తహసిల్దార్‌కు ఇచ్చామన్నారు.
తనకు ఫారం-7 తీసుకునే అధికారం లేదని, మునిసిపల్ కమిషనర్ వద్దకు వెళ్లాలని తహసిల్దార్ చెప్పారన్నారు. కమిషనర్‌ను కలసి అభ్యంతరాల జాబితా ఇచ్చామన్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ తనకు ఫారం-19 మాత్రమే తీసుకునేందుకు అర్హత ఉం దని, ఫారం నంబర్-7 తీసుకునే అర్హత లేదని చెప్పారన్నారు. అభ్యంతరాల స్వీకరణకు మంగళవారం ఆఖరు తేదీ అని, అధికారులు ఎవరికి వారు ఈవిధంగా తప్పించుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాసేందుకే బోగస్ ఓట్లపై అభ్యంతరాలను స్వీకరించడం లేదని గోపిమూర్తి ఆరోపించారు. అభ్యంతరాలను స్వీకరించాలని ధర్నా చేస్తుంటే మునిసిపల్ కమిషనర్ బాధ్యతారాహిత్యంగా వెళ్లిపోయారని అన్నారు. ఇందుకు నిరసనగా రాష్ట్రస్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
సాయంత్రం 4 గంటలకు మొదలైన ధర్నా రాత్రయినా కొనసాగటంతో సీఐ జి.కెనడీ రాత్రి 9 గంటల సమయంలో అక్కడకు చేరుకున్నారు. మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావుతో కలసి యూటీఎఫ్ నాయకులతో చర్చలు జరిపారు. రాత్రి సమయంలో ఇక్కడ ఆందోళన చేయ డం వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. దీనిపై యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్లను భారీగా చేర్చారని, దీనిపై గడువులోపు తాము అభ్యంతరాలను తెలి పేందుకు వస్తే అధికారులు తమకు సంబంధం లేదంటున్నారని విరుచుకుపడ్డారు. మునిసిపల్ చైర్మన్, సీఐ బదులిస్తూ బుధవారం ఉదయం ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఇందుకు తాము కూడా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
శాంతిం చిన యూటీఎఫ్ నాయకులు ధర్నాను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ప్రకటించారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.జోసఫ్‌గాంధీ, యూటీఎఫ్ జిల్లా శాఖ కార్యదర్శి పి.సీతారామరాజు, జిల్లా ఆడిట్ కన్వీనర్ పి.శ్రీనివాసరాజు, యూటీఎఫ్ రూరల్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ పట్టాభిరామయ్య, నాయకులు ఎంఐ విజయకుమార్, పాలకోడేరు మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఎస్ విజయరామరాజు, జి.సుధాకర్, కాళ్ల మండల శాఖ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఆర్‌సీహెచ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.