ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యాశాఖ మంత్రులు గంటా శ్రీనివాస రావు, జగదీశ్వర్ రెడ్డి మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యాశాఖ మంత్రులు గంటా శ్రీనివాస రావు, జగదీశ్వర్ రెడ్డి మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయం గురించి మంత్రులు చర్చించారు. కాగా ఏ అంశంపై కూడా స్పష్టత రాకుండానే సమావేశం అసంపూర్తిగా ముగిసింది.
మంత్రులు మీడియా ముందు భిన్న వాదనలు వినిపించారు. ఇంటర్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించాలన్న ప్రతిపాదనపై ప్రతిష్టంభన ఉందని గంటా శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్ర విడిపోయినందున ఇంటర్ పరీక్షలను ప్రత్యేకంగా నిర్వహించాలని జగదీశ్వర్ రెడ్డి అన్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లాగే ఏపీకి 15 శాతం ఓపెన్ కోటా వర్తిస్తుందని జగదీశ్వర్ చెప్పగా, అన్ని రాష్ట్రాలతో ఏపీని పోల్చడం తగదని గంటా సూచించారు. ఇంటర్, ఎంసెట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించాలని గంటా చెప్పారు. ఉమ్మడి పరీక్షల విధానంపై విభజన చట్టాన్ని పాటించాలని కోరారు. కాగా ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా ఇంటర్ బోర్డులు ఉండాలని జగదీశ్వర్ రెడ్డి సూచించారు.