ముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట/చందుర్తి/పెద్దపల్లి/మంథని/గొల్లపల్లి, న్యూస్‌లైన్ : తెలంగాణ రైతులను కిరణ్ సర్కార్ చిన్నచూపు చూస్తోందని టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు విమర్శించారు. పెద్దపల్లి ఎంపీ వివేక్, పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, సిహెచ్.రమేష్‌బాబు, కావేటి సమ్మయ్య, పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వినోద్‌కుమార్, నారదాసు లక్ష్మణ్‌రావులతో కూడిన బృందం శనివారం పంటనష్టంపై అధ్యయనం చేసింది.
ముస్తాబాద్ మండలం రామలక్ష్మణులపల్లి, ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్, పదిర, చందుర్తి మండలం తిమ్మాపూర్, మంథని మండలం పుట్టపాక, పెద్దపల్లి మండలం కాసుపల్లి, గొల్లపల్లి మండలం రాఘవపట్నం, గుంజపడుగు గ్రామాల్లో పంట నష్టాన్ని పరిశీలించారు. రైతులకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల సీమాంధ్రలో ఫై-లీన్ తుపాను బాధితులను ఆదుకునేందుకు తక్షణ సహాయం కింద రూ.70 కోట్లు ప్రకటించిన కిరణ్ సర్కారు.. తెలంగాణ ప్రాంతంలోని రైతులు నష్టపోతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
అసెంబ్లీ సాక్షిగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క నయపైసా ఇవ్వనని ప్రకటించాడని, నేడు అదే విధానాన్ని అవలంబిస్తూ తెలంగాణ రైతుల ఉసురు పోసుకుంటున్నాడని దుయ్యబట్టారు. నష్టపోయిన తెలంగాణ రైతాంగానికి అండగా ఉండేందుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నెలరోజుల వేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలోని ఏడు జిల్లాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు ఆరు బృందాలుగా ఏర్పడి కేసీఆర్ ఆదేశాల మేరకు పంట నష్టాలను సర్వే చేస్తున్నట్లు తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో సర్వే చేయించాల్సిన ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని, అధికారులు సైతం దళారులతో కుమ్మక్కయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతులు పుట్టెడు దుఃఖంలో ఉంటే కాంగ్రెస్ నేతలు జైత్రయాత్ర చేయడం విడ్డూరంగా ఉందని, ఇందుకు వారికి మనసెలా ఒప్పిం దని అన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న సీఎం కిరణ్‌పై దండయాత్ర చేయాలన్నారు. జిల్లాకు చెందిన శ్రీధర్‌బాబు మంత్రిగా ఉన్నా రైతులకు పరిహారం ఇప్పించడంలో విఫలమయ్యాడని విమర్శించారు. ఇప్పటికైనా రైతుల పక్షాన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నిలువాలని సూచించారు. ఈ బృందం వెంట టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, మహిళా నాయకులు తుల ఉమ, బొడిగె శోభ తదితరులు పర్యటించారు.
తెలంగాణ రైతులపై చిన్నచూపు
Published Sun, Oct 27 2013 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
Advertisement
Advertisement