
ఖాళీ స్థలాలపైనా సర్కారు కన్ను
* పన్ను భారీగా పెంచే యోచనలో సర్కారు!
* వసూళ్లలో ఇక కఠినంగానే..
* ఆదాయం పెంచుకోవడమే లక్ష్యం
* మున్సిపాలిటీలు నష్టాల్లో ఉన్నాయన్న సాకు
* త్వరలో స్థలాల యజమానులకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాబడి పెంచుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ర్టంలోని అన్నివర్గాల వారి ఖాళీ స్థలాలపైనా కన్నేసి వాటిపై పన్నును భారీగా పెంచే యోచనలో ఉంది. అంతేకాదు క్రమం తప్పకుండా వసూలు చేయనుంది. చాలామంది పట్టణాల్లో మంచి రేట్లు వ చ్చినప్పుడు అమ్ముకోవచ్చనో, లేదా ఎప్పటికైనా వచ్చి స్థిరపడవచ్చనో స్థలాలను కొంటూంటారు. కానీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఖాళీగానే వదిలేస్తారు.
ఇలాంటి స్థలాలపై పురపాలక శాఖ నామమాత్రంగా పన్నులు వసూలు చేస్తుంది. సాధారణంగా ఎవరూ వీటికి పన్ను చెల్లించరు. అధికారులు కూడా అంతగా వత్తిడి చేయరు. భవన నిర్మాణాల అనుమతులకు వెళ్లినప్పుడు మాత్రం ఒకవేళ పన్ను చెల్లించకుండా ఉంటే స్థలం కొన్న తేదీనుంచి లెక్కేసి నామమాత్రంగా వసూలు చేస్తారు. ఇకపై ఇలాంటి పరిస్థితి ఉండదు. రాష్ర్టంలోని 60 శాతం మున్సిపాలిటీలు నష్టాల్లో ఉన్నాయన్న పేరుతో ఇకపై ఖాళీ స్థలాలపై వసూలు చేస్తున్న పన్నును పెంచాలని, అదికూడా క్రమం తప్పకుండా రాబట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు పురపాలకశాఖ కసరత్తు చేస్తోంది. మున్సిపాలిటీల వారీగా ఖాళీ స్థలాలు గుర్తించడంతో పాటు ప్రస్తుతం వాటిపై ఎంత పన్ను వస్తోంది, పన్ను ఏ మేరకు పెంచితే ఆదాయం పెరుగుతుంది ఇతరత్రా అంశాలను పరిశీలిస్తోంది. చాలా మున్సిపాలిటీలో భారీగా ఖాళీ స్థలాలు ఉన్నాయి.
అయితే ముఖ్యంగా కార్పొరేషన్ల పరిధిలో ఎక్కువగా పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కార్పొరేషన్లలో భూమి రిజిస్ట్రేషన్ విలువపై 0.5 శాతం మేరకు పన్నుగా వసూలు చేస్తున్నారు. ఇక గ్రేడ్ 1, గ్రేడ్ 2 మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు.. ఇలా వాటి స్థాయిని బట్టి ఖాళీ స్థలాలకు పన్నులు పెంచాలని చూస్తున్నారు. విజయవాడలాంటి మున్సిపాలిటీ రూ.350 కోట్ల నష్టంలో ఉందని, దీంతో దీని పరిధిలోకి వచ్చే అన్ని వర్గాల ఖాళీ స్థలాలపై పన్నులు పెంచాలని యోచిస్తున్నారు.
పురపాలక శాఖ మంత్రి ఇటీవలి ఎన్నో సమీక్షా సమావేశాల్లో నష్టాల్లో ఉన్న మున్సిపాలిటీల్లో పన్నులు నామమాత్రంగానైనా పెంచాల్సిందేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానికి సంబంధించి వీజీటీఎం రద్దయి సీఆర్‌డీఏ రానున్న నేపథ్యంలో దాని పరిధి మరింతగా విస్తరించడంతో ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండనున్నాయి. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ స్థలాల యజమానులందరికీ త్వరలోనే పన్ను సంబంధిత నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.
భవనాలపైనా బాదుడే
చాలా మున్సిపాలిటీలలో అన్ అసెస్డ్ (పన్నుల పరిధిలో లేనివి), అండర్ అసెస్డ్ (నామమాత్రపు పన్నులు వసూలు చేస్తున్నవి) భవనాలకు కూడా భారీగా పన్నులు పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. అండర్ అసెస్‌డ భవనాలు మున్సిపాలిటీల పరిధిలో వేల సంఖ్యలో ఉన్నాయి. వాటన్నిటినీ పన్నుల పెంపు పరిధిలోకి తెస్తే కోట్లాది రూపాయలు సమకూర్చుకోవచ్చుననేది ప్రభుత్వ యోచనగా ఉంది. ఇప్పటివరకు కొన్ని భవనాలు మున్సిపాలిటీల అసెస్‌మెంట్‌లోనే లేవు. వీటిని కూడా వీలైనంత త్వరగా గుర్తించాలని, వాటికి కూడా పన్నులు వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. జనవరి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఎంతమేరకు పెంచాలి అన్నదానిపై ఇంకా నిర్ణయం జరగలేదని తెలిసింది.