కరీంనగర్ కల్చరల్, న్యూస్‌లైన్: అస్తిత్వం.. ఆవేదనల నుంచి ఉద్యమం పుట్టింది. దశాబ్దాల పోరాటం ఫలించింది. రాజకీయ కారణాల వల్ల తెలంగాణ ప్రక్రియ జాప్యమవుతోంది. ఈరోజు కాకున్నా.. రేపైనా రాష్ట్రం వస్తుంది. తెలంగాణ పునర్నిర్మాణం ఎలా అన్నదే ప్రశ్న. ఇప్పటికే పెద్ద ఎత్తున వనరుల విధ్వంసం జరిగింది. భాషా సంస్కృతులపైనా దాడి సాగింది. తెలంగాణ సాహిత్యమంటే చిన్నచూపు ఉంది. ఆధిపత్యం, అణిచివేతలను ఎంతమాత్రం సహించొద్దు. తెలంగాణ గొప్పతనాన్ని ఎల్లెడలా చాటుదాం. బంగారు తెలంగాణ సాధించుకునేందుకు రాష్ట్ర పునర్నిర్మాణంలో అగ్రభాగాన నిలుద్దాం.. అని కవులు, రచయితలు ముక్తకంఠం వినిపించారు.
కరీంనగర్ పద్మనగర్‌లోని ఇందిరాగార్డెన్స్‌లో ఆదివారం జరిగిన అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక రెండో మహాసభకు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ప్రవాస తెలంగాణ రచయితలు తరలివచ్చారు. గోవా లోకాయుక్త జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, సాహిత్య అకాడమీ కన్వీనర్ డాక్టర్ ఎన్.గోపి విశిష్ట అథితిగా పాల్గొన్నారు. మహాసభలో వేదిక అధ్యక్షుడు డాక్టర్ నలిమెల భాస్కర్, ప్రధానకార్యదర్శి మచ్చ ప్రభాకర్ నేతృత్వంలో నాలుగు విభాగాలుగా వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. తెలంగాణ కల సాకారం కానున్న ప్రస్తుత తరుణంలో ఈ మహాసభ తెలంగాణ సాహిత్యానికి దశా దిశా నిర్దేశం చేసింది. తెలంగాణ పునర్నిర్మాణంలో కీలకపాత్ర వహించే కవులు, రచయితలు ఈ సభలో తమ ఆలోచనలను వెల్లడించారు. ప్రశ్నించలేకుండా ఉండలేము.. కాళోజీ వారసులం అంటూ.. రాజ్యాంగ హక్కుతోనే విభజన కోరుతున్నాం.. వీరెవరు అడ్డుకోవడానికి.. అని ప్రశ్నించారు. వేదిక అధ్యక్షుడు నలిమెల భాస్కర్, కార్యదర్శి మచ్చ ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు గాజోజు నాగభూషణం, జూకంటి జగన్నాథం, నూరెపల్లి సుజాత, బూర్ల వెంకటేశ్వర్లు, అహ్వానసంఘం అధ్యక్షుడు నగునూరి శేఖర్ పాల్గొన్నారు.
మొదటి సభ కార్యక్రమం రెండు గంటల ఆలస్యం కాగా.. ప్రవాస తెలంగాణ రచయితల సదస్సును మధ్యాహ్నం నిర్వహించారు. నేషనల్ బుక్‌ట్రస్ట్ తెలుగు విభాగం ఉప సంపాదకుడు డాక్టర్ పత్తిపాక మోహన్, సీఎస్.రెడ్డి, గట్టు నారాయణ గురూజీ, వెల్లి సుదర్శన్, సంగెవేని రవీంద్ర, నడిమెట్ల ఎల్లప్ప, గండూరి లక్ష్మీనారాయణ, సంకు సుధాకర్ మాట్లాడుతూ.. తామెక్కడ ఉన్నా ఎలా ఉన్నా అమ్మ భాషను, సంస్కృతిని, సంప్రదాయాలను మరిచిపోలేదన్నారు. తర్వాత అల్లం నారాయణ, అనిల్ అంశుయన్, మాడిశెట్టి గోపాల్ ఆధ్వర్యంలో కవులు, రచయితలు రాసిన దాదాపు 25 పుస్తకాలను, కవితా సంపుటిలను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణం మన ముందున్న అంశమన్నారు. కవులు, రచయితలు, మేధావులు అందరూ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరారు. ప్రస్తుత పరిణామాలు, సాహిత్య సాంస్కృతిక కర్తవ్యాలు అనే అంశంపై జరిగిన ముగింపు సభలో అల్లం రాజయ్య, దాస్యం సేనాధిపతి, బాల శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.
తీర్మాణాలు
హైదరాబాద్ కూడిన తెలంగాణ ప్రకటించాలి. తెలంగాణలో విధ్వంసాన్ని అరికట్టి వనరులను పరిరక్షించాలి. తెలంగాణ భాష యాసలను పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెట్టాలి. రాష్ట్ర పునర్నిర్మాణంలో రచయితల వేదిక అగ్రభాగాన ఉంటుంది. అఖిల భారత స్థాయిలో తెలంగాణ సాహిత్యాన్ని తీసుకెళ్లాలి. తెలంగాణ సాహిత్యానికి పరిపుష్టి చేకూర్చాలి. తెలంగాణ సాహితీమూర్తుల జీవిత చరిత్రలను లిఖించాలి.
తెలంగాణ వంటలతో భోజనం
మహాసభకు వచ్చిన వారికి తెలంగాణ వంటలతో మధ్యాహ్నభోజనం వడ్డించారు. గటుక, ఎల్లిపాయకారం, పప్పన్నం, వంకాయకూర, తొక్కులు, పప్పు, చింతచారు, సాయంత్రం నాస్తాగా మక్కగుడాలు అందించారు.
బంగారు తెలంగాణ
Published Mon, Sep 23 2013 3:43 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
Advertisement
Advertisement