
ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యల్లో కీలక ముందడుగు
శిథిలాల తొలగింపు వేగవంతం చేసిన సహాయక బృందాలు
ఏఐ రోబోలను వినియోగించే అవకాశాల పరిశీలన
ఏ క్షణంలోనైనా కార్మికుల ఆచూకీ దొరికే అవకాశం
ప్రమాద కారణాలను అన్వేషిస్తున్న సీస్మాలజీ బృందం
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు కొనసాగుతున్న సహాయక చర్యల్లో కీలక ముందడుగు పడింది. సొరంగం లోపల 13 కి.మీ. దూరంలో ఉన్న మట్టి, శిథిలాలను వేగంగా తొలగించేందుకు ఆధారమైన కన్వేయర్ బెల్టును మంగళవారం మధ్యాహ్నానికి సహాయక బృందాలు అందుబాటులోకి తెచ్చాయి. సింగరేణి సంస్థకు చెందిన నిపుణులు కన్వేయర్ బెల్టు జాయింట్ మెషీన్, డ్రమ్ పరికరాలను బిగించి పునరుద్ధరించారు.
కన్వేయర్ బెల్టు ద్వారా గంటకు 800 టన్నుల మేర మట్టిని తరలించేందుకు వీలుంటుంది. అయితే ఇది టనెŠన్ల్ బోర్ (టీబీ) మెషీన్‌లో అంతర్భాగంగా పనిచేస్తుంది. ఇప్పుడు టీబీఎం ముక్కలుగా మారటంతో సింగరేణి మైనింగ్ రెస్క్యూ బృందాలు, ఆర్మీకి చెందిన మినీ బాబ్‌క్యాట్ డోజర్ల సాయంతో గంటకు 20 టన్నుల వరకు మట్టిని బయటకు తరలించే వీలుందని చెబుతున్నారు.
సొరంగంలోని ప్రమాద స్థలంలో సుమారు 8 నుంచి 10 వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టి పేరుకుపోయినట్టు అంచనా వేస్తుండగా, ఈ మొత్తం శిథిలాలను తొలగించేందుకు కనీసం రెండు రోజులైనా పడుతుందని చెబుతున్నారు. దీంతో ఏ క్షణమైనా కార్మికుల ఆనవాళ్లు లభించే అవకాశం ఉంది.
రంగంలోకి రోబోటిక్స్ నిపుణులు
సొరంగం కుప్పకూలిన చోట మట్టిని తొలగిస్తే రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తుండటంతో సహాయక చర్యల్లో రోబోలను వినియోగించాలని భావిస్తున్నారు. ఇందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఎన్‌వీ రోబోటిక్స్‌కు చెందిన నిపుణులు మంగళవారం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏఐ టెక్నాలజీతో కూడిన రోబోల ద్వారా సహాయక చర్యలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
సొరంగం లోపల ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న సహాయ సిబ్బందికి ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఆర్మీ మెడికల్ విభాగం సహకారం అందిస్తున్నాయి. అలాగే సొరంగం కుప్పకూలడంపై ప్రమాద స్థలానికి ఎగువ భాగంలో నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ నిపుణుల బృందం సర్వే చేపడుతోంది. ఎస్డీఆర్‌ఎఫ్ డీజీపీ నాగిరెడ్డి మంగళవారం సంఘటన స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
క్యాబిన్ ప్రదేశంలో చిక్కుకుని ఉంటారా?
ప్రమాద స్థలంలో జీపీఆర్ గుర్తించిన నాలుగు పాయింట్లలో తవ్వకాలు జరిపినా కార్మికుల జాడ కనిపించలేదు. రాడార్ సూచించిన సమీపంలోని ప్రాంతాలను సైతం జల్లెడ పడుతున్నారు. సింగరేణి మైనింగ్ రెస్క్యూ టీం, ర్యాట్ మైనర్స్ మాన్యువల్ డిగ్గింగ్ పద్ధతిలో సాధారణ గడ్డపార, సమ్మెట, తట్ట సామగ్రితోనే తవ్వకాలు చేపడుతున్నారు.
ఈ క్రమంలో టీబీఎం క్యాబిన్ ఉంటుందని భావిస్తున్న చోట తవ్వకాలు జరపగా, కార్మికుల ఆనవాళ్లు లభించినట్టుగా తెలిసింది. ఆ ప్రాంతంలోనే ప్రత్యేకంగా రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేపట్టాయి. ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రితో పాటు వైద్య శాఖకు చెందిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment