రూ.200 కోట్లతో ‘తానా’ సేవలు | telugu association of north america services with Rs 200 crores | Sakshi
Sakshi News home page

రూ.200 కోట్లతో ‘తానా’ సేవలు

Published Fri, Feb 7 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM

telugu association of north america services with Rs 200 crores

భద్రాచలం రూరల్, న్యూస్‌లైన్: ‘తానా’ ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలకు ఇప్పటివరకు 200 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) అధ్యక్షుడు నన్నపనేని మోహన్ చెప్పారు. ఆయన గురువారం భద్రాచలంలోని నన్నపనేని మోహన్ హైస్కూల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పలు సేవాకార్యక్రమాలకు ఏడాది కాలంలో ఏడుకోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు.

 ప్రతి ఏటా రెండువేల మంది పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పది అనాధాశ్రమాల్లో వెయ్యి మందికి నిరంతర సహాయం అందిస్తున్నామన్నారు. ప్రతి నెలా నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. గత ఏడాది కాలంలో క్యాన్సర్ వైద్య శిబిరాలు ఏడింటిని ఏర్పాటు చేశామని, గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఒంగోలులో పారిశుధ్య నివారణకుగాను ప్రభుత్వానికి పదిలక్షల రూపాయలు ఇచ్చినట్టు చెప్పారు. తెలుగు వారికి అండగా ఉండేందుకు అమెరికాలో ‘తానా’ అత్యవసర సహాయక బృందం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

అమెరికాలోని యూనివర్శిటీల్లో చదువుకునేందుకు వెళ్లి.. అవి మూతపడడం తో మోసపోయిన మూడువేల మంది తెలుగు విద్యార్థులను ఆదుకున్నట్టు చెప్పారు. వారిని ఇతర యూనివర్శిటీల్లో చేర్పించామన్నారు. రానున్న రోజుల్లో తానా సేవాకార్యక్రమాలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్టు చెప్పారు. అమెరికాలో వివిధ రంగాల్లో రాణిస్తున్న తెలుగు మహిళలను, యువతను మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించనున్నట్టు చెప్పారు. మిస్ అమెరికాగా ఎంపికైన మీనా, శివ వేదులూరి, అరుణ మీనన్, స్పెల్‌బీలో ప్రతిభ చూపిన తెలుగు విద్యార్థులు స్నిగ్ద, అరవింద్ మహంకాళిని ప్రత్యేకంగా సన్మానిస్తామన్నారు. జానపద కళలను కాపాడేందుకుగాను ఈ ఏడాది డిశంబర్‌లో భద్రాచలంలో ‘జానపద కళోత్సవం’ నిర్వహిస్తామన్నారు.

 జన్మదిన వేడుకలు
 నన్నపనేని మోహన్ గురువారం తన జన్మదిన వేడుకలను స్థానిక ఎస్‌ఎన్‌ఎం పాఠశాలలో విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. తొలుత, ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించే దిశగా చదవాలన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓగా తెలుగువాడైన సత్య నాదెళ్ల నియామకం గర్వకారణమని అన్నారు. ఆయనను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ఉన్నతంగా ఎదగాలని కోరారు. తాను చదువుకున్నప్పుడు పడిన ఇబ్బందులు ఇప్పటి విద్యార్థులకు కలగకూడదని అనుకున్నానని, అందుకే తన స్వార్జితంతో ఈ పాఠశాలను నిర్మించానని అన్నారు. దీనిని అభివృద్ధి చేసుకునే బాధ్యత ఇక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలదేనని అన్నారు.

Advertisement

పోల్

Advertisement