సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్ని గిమ్మిక్కులు చేసినా జిల్లాలో ‘పచ్చ’ పార్టీ పాచిక పారలేదు. ఉచిత హామీలు గాలిలో తేలిపోయాయి. మోడీ ప్రభంజనం.. సినీ గ్లామర్.. అన్నీ ప్రజాభిమానం ముందు నిలవలేకపోయాయి. మున్సిపల్.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ భరతంపట్టిన ఓటర్లు.. సార్వత్రిక ఎన్నికల్లోనూ కోలుకోలేని దెబ్బతీశారు. ఎప్పటికీ తాము వైఎస్ కుటుంబ విధేయులమేనని మరోసారి చాటి చెప్పారు. జిల్లాలో ఎనిమిది మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగా ఐదింట్లో విజయం కట్టబెట్టారు. అదేవిధంగా 30 మంది వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను జెడ్పీటీసీ పీఠం ఎక్కించారు. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ 397 మంది పార్టీ అభ్యర్థులకు ఘన విజయాన్ని అందించారు.
ఈ నేపథ్యంలో టీడీపీ చతికిలపడింది. ఇక కర్నూలు, నంద్యాల పార్లమెంట్ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం చేపట్టిన ఓట్ల లెక్కింపులోనూ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు విజయపరంపర కొనసాగించారు. కర్నూలు నంద్యాల పార్లమెంట్ స్థానాల్లో బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి విజయదుందుబి మోగించారు. కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆదోని, ఆలూరు, శ్రీశైలం, కోడుమూరు, నందికొట్కూరు, డోన్, మంత్రాలయం, పాణ్యం అసెంబ్లీ స్థానాల్లోనూ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. బనగానపల్లి, ఎమ్మిగనూరు, పత్తికొండ అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే టీడీపీ బయటపడగలిగింది. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్, 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన టీడీపీకి ఈ ఎన్నికల్లో చుక్కెదురైంది.
ఉనికి కోల్పోయిన టీడీపీ
కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌లలో టీడీపీ నేతలు సామాజిక కార్డును ప్రయోగించారు. అయితే వారి పాచికలు పారలేదు. రాజకీయాలకు కొత్తే అయినా బుట్టా రేణుక తన సత్తా చాటారు. ఈమె స్థానికేతరురాలని కాంగ్రెస్, టీడీపీ ప్రచారం చేసినా.. జనం విశ్వసనీయతకే పట్టంకట్టారు. ఇక ఎస్పీవెరైడ్డి విషయానికొస్తే ఆయన సేవాతత్పరతే ఆయనకు మరోసారి విజయం చేకూర్చింది. మొత్తంగా రెండు పార్లమెంట్ స్థానాల్లోనూ టీడీపీకి పరాభవం ఎదురైంది. బనగానపల్లి, ఎమ్మిగనూరు, పత్తికొండ మినహా మిగిలిన 11 నియోజకవర్గాల్లో టీడీపీకి చేదు అనుభవమే మిగిలింది.
కోడుమూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధాటికి కాంగ్రెస్, బీజేపీ కొట్టుకుపోయాయి. అదేవిధంగా నందికొట్కూరు, ఆళ్లగడ్డ, ఆదోని, పాణ్యం, డోన్, మంత్రాలయం, శ్రీశైలంలో టీడీపీ నేతలకు స్థానిక ఓటర్లు షాక్ ఇచ్చారు. నంద్యాల, కర్నూలు విషయానికి వస్తే శిల్పా మోహన్‌రెడ్డి, టీజీ వెంకటేష్ రకరకాల గిమ్మిక్కులు చేసినా భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి విజయాన్ని నిలువరించలేకపోయాయి. ఆళ్లగడ్డలో స్థానిక ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ప్రమాదవశాత్తు మరణించారని తెలిసీ మానవత్వంతో నివాళుర్పించాల్సిన నాయకులు ఆమె విజయాన్ని అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. అయితే ఆళ్లగడ్డ ప్రజలు భూమా కుటుంబం వెంటే ఉన్నామని నిరూపించారు.
పాణ్యంలో టీడీపీ, కాంగ్రెస్, ఆర్‌పీఎస్ అన్నీ ఏకమై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డిని అడ్డుకోవాలని చూసినా ఫలితం లేకపోయింది. డోన్‌లో కాంగ్రెస్, టీడీపీ కుమ్ముక్కై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డిని ఓడించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. నందికొట్కూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఐజయ్యను అడ్డుకునేందుకు స్థానిక టీడీపీ నాయకులు దౌర్జన్యాలకూ తెగబడ్డారు. ఆర్‌పీఎస్‌తో టీడీపీ అక్రమ పొత్తుకు తెరతీసినా ఫలితం చేజిక్కించుకోలేకపోయారు. శ్రీశైలంలో టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేయించినా.. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి విజయాన్ని ఆపలేకపోయారు.
ఆదోనిలో మీనాక్షినాయుడు మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందేందుకు రకరకాల ప్రయత్నాలు చేసినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సాయిప్రసాద్‌రెడ్డి దూసుకుపోయారు. మంత్రాలయంలో టీడీపీ నేత తిక్కారెడ్డిపై స్థానికులకు నమ్మకం లేకపోవటం.. తిక్కారెడ్డి దౌర్జన్యాలకు దిగినా జనం భయపడకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలనాగిరెడ్డికి విజయం కట్టబెట్టడం విశేషం. ఇకపోతే ఆలూరులో కాంగ్రెస్ రౌడీయిజం, టీడీపీ డబ్బు రాజకీయం చేసినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం విజయాన్ని అడ్డులేకపోవడం గమనార్హం.
సై‘కిల్’
Published Sat, May 17 2014 1:20 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement
Advertisement