తారలు దిగివచ్చిన వేళ
‘ఒక లైలా కోసం’ అంటూ యువహీరో నాగచైతన్య, హీరోయిన్ పూజాహేగ్డె నగరంలో సందడి చేశారు. గత ఏడాది ఆగస్టులోని బందరురోడ్డులోని పీవీపీ స్క్వేర్‌లో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ వేలాదిమంది ప్రేక్షకుల మధ్య ఉత్సాహంగా జరిగింది. ఈ వేడుకలో ప్రేక్షకుల నుంచి తనకు లభించిన ఆదరణ చూసిన నాగచైతన్య ఇకపై తన సినిమాల ఆడియో వేడుకలు, విజయోత్సవాలు విజయవాడలోనే చేస్తానని ప్రకటించారు.
సెప్టెంబరు 28వ తేదీన నగరంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలలో ‘లౌక్యం’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆడియో విడు దలకు విపరీతమైన ఆదరణ లభించడంతో సినిమా విజయోత్సవానికి లయోలా గ్రౌండ్స్‌లో నిర్వహించారు. ఈ వేడుకల్లో హీరో గోపీచంద్‌తో పాటు చిత్ర యూనిట్ సందడి చేసింది.
గత ఫిబ్రవరిలో నందమూరి కల్యాణ్‌రామ్ నటించిన ‘పటాస్’ సినిమా విజయోత్సవం నగరంలోనే జరిగింది.మార్చిలో చినకాకానిలోని హాయ్‌లాండ్‌లో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియో విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో అల్లు అర్జున్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇతర నటీనటులు హాజరయ్యారు. ఇవేకాకుండా ‘గీతాంజలి’ సక్సెస్ మీట్ కోసం అంజలి కూడా నగరానికి వచ్చి సందడి చేసింది. ఇంకా మరెన్నో సినిమాల విజయోత్సవాలు, ఆడియో వేడుకలకు విజయవాడ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. సినిమా వేడుకలు ఎక్కువగా జరుగుతుండటంతో ఇక్కడ యాంకర్లకూ డిమాండ్ పెరిగింది.
భవిష్యత్తులో మరెన్నో..
తెలంగాణకు సంబంధించిన కార్యక్రమాలన్నింటికీ హైదరాబాద్ వేదికగా ఉండగా, నవ్యాంధ్రకు విజయవాడే కేంద్రంగా నిలవడంతో టాలీవుడ్ చూపంతా ప్రస్తుతం ఇక్కడే పడింది. సినీ పరిశ్రమకు చెందిన వారంతా నగరంతో అనుబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తారల క్రికెట్‌కు వేదికగా..
ఒకప్పుడు స్టార్ క్రికెట్ అంటే హైదరాబాద్, విశాఖపట్నంకే పరిమితమయ్యేవి. అలాంటిది హుదూద్ తుపాను బాధితుల కోసం నవ్యాంధ్ర రాజధాని విజయవాడలో స్టార్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. క్రికెట్‌తో పాటు పలు ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో నటులు శ్రీకాంత్, తరుణ్, రామ్‌చరణ్, కామ్నా జెఠ్మలానీ వంటి ఎందరో సందడి చేశారు.
వ్యాపార ప్రమోషన్లకు కేంద్రం
జ్యూవెలరీ.. రెస్టారెండ్.. రెడీమేడ్.. ఇలా వ్యాపారం ఏదైనా ప్రారంభోత్సవాలతో పలువురు తారలు నగరంలో సందడి చేస్తున్నారు. అగ్రహీరోలైన మహేష్‌బాబు, అల్లు అర్జున్ సైతం తాము బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న షోరూమ్‌ల కార్యక్రమాల్లో పాల్గొంటుండగా, హీరోయిన్‌లు తమన్నా, కామ్నా జఠ్మలానీ, అంజలి వంటివారు జ్యూవెలరీ, రెడీమెడ్ షోరూమ్‌ల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు. గంగా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న భూమిక ఇటీవల జరిగిన ఆ సంస్థ రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
సేవలో సమంత...
టాలీవుడ్ అగ్రనటి సమంత నగరంలో తన సేవా కార్యక్రమాలు విస్తృతం చేశారు. ఇందులో భాగంగానే నగరంలోని ఆంధ్రా ఆస్పత్రితో కలిసి చిన్నపిల్లలకు అవసరమైన వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు జనవరి 14న ఆంధ్రా ఆస్పత్రికి విచ్చేసి వివిధ వ్యాధులతో చికిత్స పొందుతున్న చిన్నారులతో కొద్దిసేపు గడిపారు.