ప్రమాదకర స్థితిలో తెలుగుభాష | Telugubhasa in a dangerous position | Sakshi
Sakshi News home page

ప్రమాదకర స్థితిలో తెలుగుభాష

Published Mon, Oct 20 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 PM

ప్రమాదకర స్థితిలో తెలుగుభాష

ప్రమాదకర స్థితిలో తెలుగుభాష

కడప కల్చరల్ :
 తెలుగుభాష ప్రమాదకర స్థితిలో ఉందని, పరిస్థితిని ఇలాగే కొనసాగనివ్వకూడదని, ఏదో ఒకటి చేసి రాబోయే తరానికి ఈ భాష, సంస్కృతులను అందించి తెలుగు ప్రాంత ఘన వారసత్వాన్ని అందజేయాలని భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అభిప్రాయడ్డారు. డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి 90వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సాహితీ పీఠం యోగి వేమన విశ్వవిద్యాలయం, సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంతో కలిసి ఆదివారం బ్రౌన్ కేంద్రంలో నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తొలుత గ్రంథాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన డాక్టర్ జానమద్ది కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జానమద్ది చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి తరానికి తెలుగుభాష, సంస్కృతుల పట్ల అవగాహన బాగా లోపించిందని, ఈ దురవస్థ చూస్తే భావితరాలకు ఇవి అందవేమోనన్న ఆందోళన కలుగుతోందన్నారు. సైన్స్, టెక్నాలజీ మానవ జీవితానికి అవసరమే అయినా భాష, సంస్కృతులకు గల ప్రాముఖ్యత, అవసరం ఇంకా గొప్పదన్నారు. వాటిని పరిరక్షించేందుకు జానమద్ది చేసిన కృషి ఎన్నదగినదన్నారు.

 తెలుగును ప్రపంచ భాష చేద్దాం:  మండలి బుద్ద ప్రసాద్
 రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో గుగూల్ సహకారంతో తెలుగును ప్రపంచ భాషగా చేసేందుకు అందరూ తమవంతు కృషి చేయాలన్నారు. తెలుగుభాష, సంస్కృతుల అభివృద్ధికి అనన్య సామాన్యమైన సేవ చేసిన బ్రౌన్ శాస్త్రి తెలుగు వారందరికీ ప్రాతః స్మరణీయులన్నారు.  డాక్టర్ జానమద్ది వ్యక్తిత్వం, ఔదర్యం ఆయనను ఓ వ్యవస్థగా తీర్చిదిద్దాయన్నారు.

  రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ మాట్లాడుతూ సాహిత్యం గురించి తెలియని తనకు జానమద్ది పరిచయంతోనే సాహితీ, సంస్కృతుల గొప్పతనం తెలిసిందన్నారు.  నేటితరంలో విలువలు తగ్గడానికి కారణం బాల్యంనుంచి మానవత్వాన్ని బోధించక పోవడమేనని, జానమద్ది లాంటి వారు ఆ విలువలను పాటించారు గనుకనే ఆ ఫలితాలు తెలుగు వారందరికీ దక్కాయన్నారు.

  జిల్లా కలెక్టర్ కేవీ రమణ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌గా బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రానికి తనవంతు సహాయ సహకారాలను తప్పక అందిస్తానన్నారు. వైవీయూ వీసీ ఆచార్య బేతనభట్ల శ్యాం సుందర్ సభకు అధ్యక్షత వహించి ప్రసంగించారు. బ్రౌన్ కేంద్రం బాధ్యులు రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు.

 పుస్తకావిష్కరణలు
 డాక్టర్ జానమద్ది రచించిన బహురూపి గణపతి సంచికను, కొండూరు జనార్దన్‌రాజు ప్రచురించిన ఁమన జానమద్ది ప్రత్యేక సంచికను అతిథులు సభలో ఆవిష్కరించారు. విద్వాన్ కట్టా రచనతో ఎలమర్తి మధు గానంతో తయారైన జానమద్దిపై ప్రశంసాగీతం సీడీని కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. కార్యక్రమంలో బద్వేలు మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణారావు, డీటీసీ శ్రీకృష్ణవేణి, సాహిత్యనేత్రం సంపాదకులు శశిశ్రీ, అలపర్తి పిచ్చయ్యచౌదరి, డాక్టర్ జానమద్ది కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 విద్వాన్ కట్టాకు ప్రముఖుల ప్రశ ంస
 సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం పూర్వ బాధ్యులు విద్వాన్ కట్టా నరసింహులు సాహితీ సేవలను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఆదివారం సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో జరిగిన డాక్టర్ జానమద్ది జయంతి సభలో పలువురు వక్తలు ఆయన సాహితీ సేవలను కొనియాడారు. రాష్ర్ట శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్ తమ ప్రసంగంలో డాక్టర్ జానమద్ది సీపీ బ్రౌన్ సాహితీ సేవలకు చిరకీర్తిని కల్పిస్తే జానమద్ది సహచరుడు విద్వాన్ కట్టా నరసింహులు మెకంజీ కైఫీయత్తులను పరిష్కరించి, వాటి సారాంశాన్ని జిల్లా వాసులకు అందించడం విశేషమన్నారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ మాట్లాడుతూ తనకు పురాణాల పట్ల ఎంతో ఆసక్తి ఉండేదని, నేర్చుకునేందుకు మిత్రుల సలహాపై డాక్టర్ జానమద్దిని కలిశామన్నారు. ఇందుకు తగిన వ్యక్తి కట్టా నరసింహులేనని, ఆయనే నీకు వాటిని బోధించగలరని కట్టాను పంపారన్నారు. కట్టా నరసింహులు తనకు రామాయణ, భారత, భాగవతాలను నేర్పారని, అందుకే కట్టాను తన సాహితీ గురువుగా చెప్పుకుంటున్నానని తెలిపారు. ఈ సభలో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు విద్వాన్ కట్టా నరసింహులును ప్రశంసించడంతో సభకు హాజరైన పలువురు సాహితీవేత్తలు, కవులు, రచయితలు కట్టా నరసింహులును అభినందనలతో ముంచెత్తారు.

Advertisement

పోల్

Advertisement