సిర్సనగండ్లలో పొలం వద్ద తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్తు తీగలు
- సరిచేయని విద్యుత్ శాఖ
- భయాందోళన చెందుతున్న ప్రజలు
కొండపాక: నేలకు గజం ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలను చూసి రైతులు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. విద్యుత్ స్తంభాల ఏర్పాటుచేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప వాటిని నిరంతరం పర్యవేక్షించడంలేదు. దీంతో కరెంట్ షాక్ ప్రమాదాలు తరచూ జరుగుతున్నా సంబంధిత శాఖ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. బిల్లులు వసూలుపై శ్రద్ధ సమస్యలను పరిష్కరించడంలో చూపడలంలేదని ప్రజలు మండిపడుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కొండపాక మండలంలో సిర్సనగండ్ల, మర్పడ్గ, తిమ్మారెడ్డిపల్లి, మంగోల్, జప్తినాచారం, దుద్దెడ, కొండపాక గ్రామాల్లోని వ్యవసాయ బావుల వద్ద విద్యుత్తు తీగలు చేతికందే ఎత్తులో వేలాడుతున్నాయి. దీంతో రాత్రి సమయాల్లో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాలంటే రైతులు జంకుతున్నారు. ఏళ్ల కిందట వ్యవసాయ బావులకు విద్యుత్తు కనెక‌్షన్లు ఇచ్చేందుకు విద్యుత్ స్థంబాలను ఏర్పాటు చేశారు.
అయితే నిర్వహణ కొరవడి విద్యుత్తు తీగలు క్రమేణా సాగి నేలకు సుమారు గజం ఎత్తుకు చేరాయి. ఇటీవల పశువులు మేత కోసం వెళ్ళినప్పుడు వాటిని తాకి మృతి చెందాయి. అలాగే మర్పడ్గ శివారులో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ప్యూజ్ వైరును సరిచేస్తుండగా రైతు విద్యుత్తు షాక్‌తో మృతి చెందాడు.
వ్యవసాయ బావుల వద్ద నేలకు తాకేలా వ్రేలాడుతున్న విద్యుత్తు వైర్లను సరి చేయాలంటూ పలుమార్లు విద్యుత్తు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల్లో రైతులు పేర్కొన్నారు. విద్యుత్ బిల్లుల వసూలుపై ఉన్న శ్రద్ధ సమస్యలను పరిష్కచడంలో చూపడలేదని మండిపడుతున్నారు. సమస్య ఇలాగే పరిష్కరించకుండా ఉంటే ఆందోళన చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.
విద్యుత్తు వైర్లను సరి చేయాలి
వ్యవసాయ బావుల వద్ద నేలకు తాకేలా విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. మేత కోసం వెళ్లిన పశువులు రెండు సార్లు కరెంట్ షాక్‌కు గురయ్యాయి. పెనుప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలి. వేలాడే విద్యుత్ తీగ ప్రాంతానికి వెళ్లాలంటే భయంగా ఉంది.
- చెంది ఆంజనేయులు, రైతు, సిర్సనగండ్ల
వైర్లను సరి చేయడంలో లేదు
నెల నెలా విద్యుత్తు బిల్లులను వసూలు చేయడంపై అధికారులు చూపుతున్న శ్రద్ధ నేలకు తాకేలా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు వైర్లను సరి చేయడంలో చూపడం లేదు. విద్యుత్తు వైర్లను సరి చేసి ప్రమాదాలు జరుగకుండా చూడాలి. - క్యాతం శ్రీనివాస్, రైతు, సిర్సనగండ్ల
ప్రమాదాలు జరుగుతున్నా స్పందించరా?
వ్యవసాయ బావుల వద్ద నేలకు తాకేలా వ్రేలాడుతున్న విద్యుత్తు తీగల వల్ల పశువులు ప్రమాదవశాత్తు తగలడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా విద్యుత్తు అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి
- జైన్ ఆంజనేయులు వ్యాపారి, కొండపాక
అదనపు స్తంభాల కోసం ప్రతిపాదనలు పంపాం
విద్యుత్తు వైర్లను సరి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అవసరపడే స్తంబాల కోసం ప్రతిపాదనలు పంపాం. మంజూరు కాగానే విద్యుత్తు వైర్లను సరిచేస్తాం. మరీ కిందకు వేలాడుతున్న వైర్లను సరిచేసేందుకు దృష్టిసారించాం. రైతులు భయపడాల్సిన పనిలేదు. త్వరలో అన్ని సమస్యలను పరష్కరిస్తాం. - బాల్యానాయక్, విద్యుత్ లైన్‌మెన్