తిరుమలలో వైభవంగా తెప్పోత్సవాలు ఆరంభం
- ఐదు రోజులపాటు వేడుక
- తొలిరోజు శ్రీరామచంద్రుడి దర్శనం
తిరుమల : తిరుమలలో శనివారం రాత్రి శ్రీవారి తెప్పోత్సవాలు ఆరంభమయ్యాయి. ఐదు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో తొలి రోజు శ్రీ సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర మూర్తి అవతారంలో శ్రీ మలయప్ప స్వామివారు మూడుమార్లు పుష్కరిణిలో ప్రదక్షిణగా విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి, చివరి మూడు రోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు పుష్కరిణిలో విహరించనున్నారు.
క్రీ.శ.1468 సాళువ నరసింహరాయలు పుష్కరిణి మధ్యలో ఉత్సవాలకు అనువుగా 'నీరాళి మంటపం' నిర్మించారు. అంతకుముందు నుంచే శ్రీవారికి తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నట్టు శాసనాధారం. ఈ సందర్భంగా ఆర్జిత సేవలైన వసంతోత్సవం, సహస్త్ర దీపాలంకరణ సేవ రద్దు చేశారు. తెప్పోత్సవం సందర్భంగా పుష్కరిణితోపాటు ఆలయానికి దేదీప్యమానంగా విద్యుత్ దీపాలతో అలంకరణ, ప్రత్యేకంగా దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశారు.
రాత్రి 7 నుండి 8 గంటల మధ్య జరిగిన ఉత్సవ వేడుక లో టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు దంపతులు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, ఆలయ ప్రధాన అర్చకుడు డాక్టర్ రమణదీక్షితులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.