వీణవంక, న్యూస్‌లైన్ : మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఉయ్యాల బాల్‌రాజు(39) ఆదివారం రాత్రి రామకృష్ణాపూర్ వాగులో దారుణహత్యకు గురయ్యాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బాల్‌రాజు వారం రోజులుగా పోతిరెడ్డిపల్లి గ్రామానికి కల్లు తాగడానికి వెళ్తున్నాడు. ఎప్పట్లాగే ఆదివారం కూడా అక్కడికి వెళ్లాడు. సాయంత్రం తన గ్రామానికి చెందిన కుమార్‌ను తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని తిరిగి ఇంటికి బయల్దేరాడు. వీణవంక శివారులోని వాగు వద్దకు రాగానే కుమార్ బహిర్భూమికి వెళ్తానని బైక్ దిగాడు.
బాల్‌రాజ్ తన వాహనాన్ని వాగులోంచి తోసుకుంటూ వస్తుండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో బాల్‌రాజ్ తల పగిలి, కాలు విరిగి అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలాన్ని హుజూరాబాద్ డీఎస్పీ సత్యనారాయణరెడ్డి, ఎస్సై సంతోష్‌కుమార్ పరిశీలించారు. కుమార్‌ను విచారించగా తాను బహిర్భూమికి వెళ్లానని, ముగ్గురు వచ్చి చంపారని పేర్కొన్నాడు. అయితే అతడి చొక్కా చినిగి ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మృతుడికి భార్య కళ్యాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
2006లో ఎంపీటీసీ సభ్యుడిగా..
బాల్‌రాజు తన స్వగ్రామమైన నర్సింగాపూర్ నుంచి 2006లో ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొందాడు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అప్పటి నుంచి మండల కేంద్రంలో తనకున్న చికెన్ సెంటర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అందరితో కలుపుగోలుగా ఉండేవాడని స్థాని కులు పేర్కొన్నారు. ఇది రాజకీయ హత్యనా, లేక పాత కక్షలా కారణంగా చేసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ ఎంపీటీసీ దారుణ హత్య
Published Mon, Jan 6 2014 4:54 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement
Advertisement