Ramakrishna pur
-
ఫ్లై ఓవర్‌పై నిర్లక్ష్యపు నీడలు
రామకృష్ణాపూర్ : నిధులు లేక మూలిగే పనులు.. ప్రభుత్వ అనుమతి కోసం వేచి ఉన్న పనులు.. సర్వసాధారణంగా వింటుంటాం. కానీ.. పని మంజూరై కోట్ల నిధులుండీ అతీగతీ లేని పరిస్థితి రామకృష్ణాపూర్ రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జికి పట్టుకుంది. అక్షరాలా రూ.30 కోట్ల నిధులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూలుగుతున్నాయి. సమగ్ర సర్వే జరిపి, ఉన్నతాధికారులకు నివేదికలు పంపాల్సిన రెవెన్యూ శాఖ తాత్సార వైఖరితో ప్రజలు తంటాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. రామకృష్ణాపూర్-మంచిర్యాల మార్గంలో ఉన్న రైల్వే లైన్‌పై ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. గత ఫ్రిబవరి నెలలో కొత్త బ్రిడ్జి మంజూరైంది. 30 కోట్ల నిధులు కూడా విడుదల అయ్యాయి. క్యాతన్‌పల్లి గ్రామ పంచాయతీ ప్రాంతంలో దీన్ని నిర్మించాల్సి ఉంది. దీనికి 8 ఎకరాల 20 గుంటల్లో ప్రైవేట్ భూమి అవసరం పడుతుండగా మిగిలింది రైల్వే శాఖ భూమి ఉంది. మొత్తం 11 వందల మీటర్ల పొడవున బ్రిడ్జి నిర్మించడానికి అంచనా వేశారు. ప్రస్తుతమున్న రైల్వే లైన్ నుంచి అటు ఇటూ 550 మీటర్ల పొడవున బ్రిడ్జి నిర్మానం చేపట్టాల్సి ఉంది. కాగా ఒకరిద్దరూ అడ్డుపడుతున్నారనే సాకును తీసుకుని రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారని ప్రజాప్రతినిధులే పేర్కొంటున్నారు. అతీగతీ లేని నివేదిక... ప్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో రెవెన్యూ శాఖ పాత్ర కీలకం. ఎంత పొడవు బ్రిడ్జి నిర్మాణం జరుపుతున్నార్నది ఆ శాఖ గుర్తించాలి. దీనికి సంబంధించి భూ సేకరణ జరపాలి. బ్రిడ్జి నిర్మిస్తున్న ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఎన్ని ఎకరాల్లో ఉన్నాయనేది సర్వే చేయాలి. అదేవిధంగా ఎంతమందికి పరిహారం చెల్లించాల్సి వస్తుంది అన్న అంశాల్ని రెవెన్యూ శాఖ పరిశీలించాల్సి ఉంటుంది. వివిధ కోణాల్లో సర్వే చేపట్టి సదరు నివేదికను ఉన్నతాధికారులకు పంపాలి. కాని ప్రారంభంలో తూతూమంత్రంగా కొలతలు చేసిన నేడు ముఖం చాటేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే బ్రిడ్జి నిర్మాణం అమలుకు నోచుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే రైల్వే, ఆర్అండ్బి శాఖలు తమ పని పూర్తి చేశాయి. రైల్వే శాఖ,ఆర్అండ్బీ ఆధ్వర్యంలో బ్రిడ్జి అలైన్మెంట్ పనిని పూర్తి చేసి నివేదికను సైతం కేంద్రానికి పంపించడం జరిగింది. మిగిలిందల్లా రెవెన్యూ శాఖ పని మాత్రమే. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఏ సర్వే నంబర్లో ఎంత భూమి ఉంది..? భూమి తాలూకూ విలువ.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపాలి. అయితే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాత్సారంతో తంటాలు... రైల్వే లైన్‌పై ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం మంజూరైందన్న మాటే గాని అది ఆచరణకు నోచుకోక పోతుండడంతో ప్రజలకు తంటాలు తప్పడం లేదు. రామకృష్ణాపూర్-మంచిర్యాల మార్గంలోని ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే దాదాపు 30 గ్రా మాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పట్టణంతో పాటు అమరవాది, పొన్నారం, మందమర్రి, చిర్రకుం ట, సారంగపెల్లి, తుర్కపల్లి, సండ్రోన్‌పల్లి.. తదితర గ్రామాల్లోని ప్రజలకు బ్రిడ్జి నిర్మాణంతో ఎంతో ఊరట కలిగేది. హైదరాబాద్-న్యూఢిల్లీ ప్రధాన రైలు మార్గం కావడంతో ఈ మార్గంలో పదేపదే గేట్ వేస్తుండడం వల్ల ప్రయాణీకులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా వైద్య చికిత్సలకు మంచిర్యాలకు వెళ్లే సమయాల్లో గేటు పడుతుండడంతో తిప్పలు తప్పడం లేదు. ఈ బాధలు తీరుతాయని, నిరీక్షించే పరిస్థితి సమసి పోతుందని ఆశించిన ప్రజలు నిరాశకు గురవుతున్నారు. దశాబ్దాల డిమాండ్ తీరిపోతుందని అనుకుంటున్న క్రమంలో అధికారుల నిర్లక్ష్య ధోరణి ఉన్న నిధుల్ని వెనక్కీ పంపే పరిస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా స్పందించి బ్రిడ్జి నిర్మాణానికి సహకరించాలని అధికారులను కోరుతున్నారు. -
జయహో తెలంగాణ సంబురాలు
రామకృష్ణాపూర్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో పీవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రామకృష్ణాపూర్‌లోని సూపర్‌బజార్ వద్ద జయహో తెలంగాణ సంబురాలు పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తూర్పు జిల్లాకు చెందిన కళాకారులు, విద్యావంతులు, జేఏసీ నేతలు, రచయితలు, అమరవీరుల తల్లిదండ్రులను సన్మానించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన అమరులకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ, ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావ్, తూర్పు జిల్లా జేఏసీ చైర్మన్ గోనె శ్యాంసుందర్‌రావు, విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు గురిజాల రవీందర్రావు, సింగరేణి జేఏసీ చైర్మన్ ఎండీ.మునీర్, ధూంధాం వ్యవస్థాపకుడు అంతడుపుల నాగరాజు హాజరయ్యారు. కార్యక్రమంలో పీవీఆర్ ఫౌండేషన్ చైర్మన్ పొన్నాల వినయ్, ప్రధాన కార్యదర్శి పొన్నాల సాగర్, సర్పంచ్ జాడి శ్రీనివాస్, పట్టణ జేఏసీ కన్వీనర్ పెద్దపెల్లి ఉప్పలయ్య తదిత రులు పాల్గొన్నారు. -
సాయి సన్నిధి నుంచి మృత్యుఒడికి..
షిరిడీ సాయి దర్శనానికి కుటుంబమంతా తరలివెళ్లింది. సాయి సన్నిధిలో సంతోషంగా పూజలు చేసుకుంది. తమ గారాలపట్టి పుట్టువెంట్రుకలు దేవుడికి సమర్పించుకుంది. ఆనందంగా తిరుగు ప్రయాణమై మరో షిరిడీగా పేరొందిన కోరుట్ల సాయి సన్నిధిలో కాసేపు సేదదీరింది. అక్కడినుంచి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే నలుగురిని మృత్యువు కబళించింది. కన్నవారు కానరాని లోకాలకు వెళ్లినా చివరిచూపు చూసుకోలేని దైన్యస్థితి ఆ కుమారులది. కట్టుకున్న భార్య కనుమూసినా కడసారిచూపునకు దూరమైన పరిస్థితి భర్తది. తమ గారాలపట్టి ఇకలేదని తెలిసీ.. చివరిసారి ముద్దాడలేని దుస్థితి ఓ తల్లిదండ్రులది. మృతులు, క్షతగాత్రులు అంతా తమవారే అయినా ఒకరినొకరు పలుకరించుకోలేని దయనీయ స్థితి ఆ కుటుంబానిది. మేడిపల్లి /జగిత్యాల, న్యూస్‌లైన్ : మేడిపెల్లి శివారులో మంగళవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో 11 మంది తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మృతులంతా వరంగల్ జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందినవారు. క్షతగాత్రులు, డీఎస్పీ పరమేశ్వరరెడ్డి కథనం ప్రకారం... వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన గోనె వీరయ్య(70)-సరోజన(60) దంపతులు. వీరికి కుమారులు, కోడళ్లు సంజీవ్-సువర్ణ, సురేష్-అనూష(25), మహేందర్-రేణుక ఉన్నారు. వీరయ్య సింగరేణిలో పనిచేసి రిటైరయ్యాడు. వీరి కుటుంబం 15 ఏళ్ల క్రితమే భూపాలపల్లికి వలసవెళ్లింది. సంజీవ్ సా యిశ్రీ రెడీమేడ్ డ్రెస్సెస్ దుకాణం, సురేశ్, మహేందర్ సాయిమణికంఠ ఎలక్ట్రానిక్స్ దుకాణం నిర్వహిస్తున్నా రు. మహేందర్ కుమార్తె సాయిమణిషితకు పుట్టువెం ట్రుకలు తీసేందుకు కుటుంబసభ్యులు తమ సొంత వాహనంలో ఈ నెల 26న ఆదివారం షిరిడీకి వెళ్లారు. వీరయ్య దంపతులు, కుమారులు, కోడళ్లతోపాటు మ నుమలు, మనుమరాండ్లు సాయిచరణ్, సాయిశ్రీ (సంజీవ్-సువర్ణల పిల్లలు), సాత్విక, శిరిక(సురేష్-అనూష పిల్లలు), సాయిమణిషిత, నిషిత(8 నెలలు) (మహేందర్-రేణుక పిల్లలు)తోపాటు వీరి కుటుం బమిత్రుడు ఎలగంటి వెంకటేశ్వర్లు కలిసి మొత్తం 15 మంది ఈ వాహనంలోనే వెళ్లారు. 27న సోమవారం సాయిదర్శనం చేసుకుని సాయిమణిషితకు పుట్టువెంట్రుకలు తీశారు. అనంతరం ఆనందంగా తిరుగుపయనమయ్యారు. మంగళవారం వేకువజామున 3.30 గంటలకు మరో షిరిడీగా పేరొందిన కోరుట్ల సా యిబాబా గుడికి చేరుకున్నారు. అక్కడ కాసేపు సేదదీరారు. ఉదయం 6గంటల ప్రాంతంలో ఆలయ సిబ్బంది వచ్చి వారిని లేపడంతో నిద్రమత్తులోనే అం దరూ మళ్లీ వాహనంలో బయలుదేరారు. కాసేపటికే కోరుట్ల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడిపెల్లి శివారులోని పెట్రోల్‌బంకు వద్దకు చేరుకోగానే డ్రైవింగ్ చేస్తున్న సురేశ్ నిద్రమబ్బులోకి జారుకోవడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుకు కుడివైపుగా వెళ్లి వేపచెట్టుకు ఢీకొట్టింది. అంతే.. ఒకటే ఆర్తనాదాలు. వీరయ్య, సరోజన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు సంఘటన స్థలానికి చేరుకునేసరికి వాహనంలోంచి మం టలు మొదలయ్యాయి. వెంటనే వాటిని ఆర్పేసి అందులో చిక్కుకున్నవారిని బయటకు తీశారు. గాయపడ్డవారిని జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందిస్తుండగానే సురేశ్ భార్య అనూష, మహేందర్ కూతురు నిషిత చనిపోయారు. అందరికీ తీవ్రగాయాలు ఈ ప్రమాదంలో మిగతా అందరికీ తీవ్రగాయాలయ్యాయి. చిన్నపిల్లలకు దెబ్బలు పైకి కనిపించకపోయినా వారికి చికిత్స చేస్తున్న సమయంలో ఫిట్స్ రావడం, వణుకుతుండడంతో అంతర్గతంగా దెబ్బలు తగిలి ఉంటాయని వైద్యులు భావిస్తున్నారు. వెంకటేశ్వర్లుకు స్వల్ప గాయాలు కాగా, మహేందర్, సురేశ్, సంజీవ్ తల, కాళ్లు, చేతులు, ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. రేణుకకు ముఖంపై తీవ్రగాయమైంది. సువర్ణకు కంటిపై గాయమైంది. ప్రమాద సమాచారం అందుకున్న బంధువులు ఆస్పత్రికి తరలిరావడంతో రోదనలు మిన్నంటాయి. గాయపడ్డ వారికి ప్రాథమిక చికిత్స చేసి కొందరిని కరీంనగర్‌లోని ప్రతిమ, శ్రీ లక్ష్మి, అపోల్రీచ్ ఆస్పత్రులకు తరలించారు. సంఘటన స్థలాన్ని కోరుట్ల సీఐ మహేశ్‌గౌడ్, ఎస్సై వెంకటేశ్వర్రావు పరిశీలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల ఏరియా ఆస్పత్రిలో క్షతగాత్రులను జగిత్యాల డీఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి పరామర్శించారు. గాయపడ్డవారిలో మహేం దర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. -
మాజీ ఎంపీటీసీ దారుణ హత్య
వీణవంక, న్యూస్‌లైన్ : మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఉయ్యాల బాల్‌రాజు(39) ఆదివారం రాత్రి రామకృష్ణాపూర్ వాగులో దారుణహత్యకు గురయ్యాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బాల్‌రాజు వారం రోజులుగా పోతిరెడ్డిపల్లి గ్రామానికి కల్లు తాగడానికి వెళ్తున్నాడు. ఎప్పట్లాగే ఆదివారం కూడా అక్కడికి వెళ్లాడు. సాయంత్రం తన గ్రామానికి చెందిన కుమార్‌ను తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని తిరిగి ఇంటికి బయల్దేరాడు. వీణవంక శివారులోని వాగు వద్దకు రాగానే కుమార్ బహిర్భూమికి వెళ్తానని బైక్ దిగాడు. బాల్‌రాజ్ తన వాహనాన్ని వాగులోంచి తోసుకుంటూ వస్తుండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో బాల్‌రాజ్ తల పగిలి, కాలు విరిగి అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలాన్ని హుజూరాబాద్ డీఎస్పీ సత్యనారాయణరెడ్డి, ఎస్సై సంతోష్‌కుమార్ పరిశీలించారు. కుమార్‌ను విచారించగా తాను బహిర్భూమికి వెళ్లానని, ముగ్గురు వచ్చి చంపారని పేర్కొన్నాడు. అయితే అతడి చొక్కా చినిగి ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మృతుడికి భార్య కళ్యాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. 2006లో ఎంపీటీసీ సభ్యుడిగా.. బాల్‌రాజు తన స్వగ్రామమైన నర్సింగాపూర్ నుంచి 2006లో ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొందాడు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అప్పటి నుంచి మండల కేంద్రంలో తనకున్న చికెన్ సెంటర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అందరితో కలుపుగోలుగా ఉండేవాడని స్థాని కులు పేర్కొన్నారు. ఇది రాజకీయ హత్యనా, లేక పాత కక్షలా కారణంగా చేసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.