రామకృష్ణాపూర్ : నిధులు లేక మూలిగే పనులు.. ప్రభుత్వ అనుమతి కోసం వేచి ఉన్న పనులు.. సర్వసాధారణంగా వింటుంటాం. కానీ.. పని మంజూరై కోట్ల నిధులుండీ అతీగతీ లేని పరిస్థితి రామకృష్ణాపూర్ రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జికి పట్టుకుంది. అక్షరాలా రూ.30 కోట్ల నిధులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూలుగుతున్నాయి. సమగ్ర సర్వే జరిపి, ఉన్నతాధికారులకు నివేదికలు పంపాల్సిన రెవెన్యూ శాఖ తాత్సార వైఖరితో ప్రజలు తంటాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. రామకృష్ణాపూర్-మంచిర్యాల మార్గంలో ఉన్న రైల్వే లైన్‌పై ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.
గత ఫ్రిబవరి నెలలో కొత్త బ్రిడ్జి మంజూరైంది. 30 కోట్ల నిధులు కూడా విడుదల అయ్యాయి. క్యాతన్‌పల్లి గ్రామ పంచాయతీ ప్రాంతంలో దీన్ని నిర్మించాల్సి ఉంది. దీనికి 8 ఎకరాల 20 గుంటల్లో ప్రైవేట్ భూమి అవసరం పడుతుండగా మిగిలింది రైల్వే శాఖ భూమి ఉంది. మొత్తం 11 వందల మీటర్ల పొడవున బ్రిడ్జి నిర్మించడానికి అంచనా వేశారు. ప్రస్తుతమున్న రైల్వే లైన్ నుంచి అటు ఇటూ 550 మీటర్ల పొడవున బ్రిడ్జి నిర్మానం చేపట్టాల్సి ఉంది. కాగా ఒకరిద్దరూ అడ్డుపడుతున్నారనే సాకును తీసుకుని రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారని ప్రజాప్రతినిధులే పేర్కొంటున్నారు.
అతీగతీ లేని నివేదిక...
ప్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో రెవెన్యూ శాఖ పాత్ర కీలకం. ఎంత పొడవు బ్రిడ్జి నిర్మాణం జరుపుతున్నార్నది ఆ శాఖ గుర్తించాలి. దీనికి సంబంధించి భూ సేకరణ జరపాలి. బ్రిడ్జి నిర్మిస్తున్న ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఎన్ని ఎకరాల్లో ఉన్నాయనేది సర్వే చేయాలి. అదేవిధంగా ఎంతమందికి పరిహారం చెల్లించాల్సి వస్తుంది అన్న అంశాల్ని రెవెన్యూ శాఖ పరిశీలించాల్సి ఉంటుంది. వివిధ కోణాల్లో సర్వే చేపట్టి సదరు నివేదికను ఉన్నతాధికారులకు పంపాలి. కాని ప్రారంభంలో తూతూమంత్రంగా కొలతలు చేసిన నేడు ముఖం చాటేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే బ్రిడ్జి నిర్మాణం అమలుకు నోచుకోవడం లేదని తెలుస్తోంది.
ఇప్పటికే రైల్వే, ఆర్‌అండ్‌బి శాఖలు తమ పని పూర్తి చేశాయి. రైల్వే శాఖ,ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో బ్రిడ్జి అలైన్‌మెంట్ పనిని పూర్తి చేసి నివేదికను సైతం కేంద్రానికి పంపించడం జరిగింది. మిగిలిందల్లా రెవెన్యూ శాఖ పని మాత్రమే. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఏ సర్వే నంబర్‌లో ఎంత భూమి ఉంది..? భూమి తాలూకూ విలువ.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపాలి. అయితే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాత్సారంతో తంటాలు...
రైల్వే లైన్‌పై ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం మంజూరైందన్న మాటే గాని అది ఆచరణకు నోచుకోక పోతుండడంతో ప్రజలకు తంటాలు తప్పడం లేదు. రామకృష్ణాపూర్-మంచిర్యాల మార్గంలోని ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే దాదాపు 30 గ్రా మాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పట్టణంతో పాటు అమరవాది, పొన్నారం, మందమర్రి, చిర్రకుం ట, సారంగపెల్లి, తుర్కపల్లి, సండ్రోన్‌పల్లి.. తదితర గ్రామాల్లోని ప్రజలకు బ్రిడ్జి నిర్మాణంతో ఎంతో ఊరట కలిగేది. హైదరాబాద్-న్యూఢిల్లీ ప్రధాన రైలు మార్గం కావడంతో ఈ మార్గంలో పదేపదే గేట్ వేస్తుండడం వల్ల ప్రయాణీకులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రధానంగా వైద్య చికిత్సలకు మంచిర్యాలకు వెళ్లే సమయాల్లో గేటు పడుతుండడంతో తిప్పలు తప్పడం లేదు. ఈ బాధలు తీరుతాయని, నిరీక్షించే పరిస్థితి సమసి పోతుందని ఆశించిన ప్రజలు నిరాశకు గురవుతున్నారు. దశాబ్దాల డిమాండ్ తీరిపోతుందని అనుకుంటున్న క్రమంలో అధికారుల నిర్లక్ష్య ధోరణి ఉన్న నిధుల్ని వెనక్కీ పంపే పరిస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా స్పందించి బ్రిడ్జి నిర్మాణానికి సహకరించాలని అధికారులను కోరుతున్నారు.
ఫ్లై ఓవర్‌పై నిర్లక్ష్యపు నీడలు
Published Sun, Sep 21 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM
Advertisement