షిరిడీ సాయి దర్శనానికి కుటుంబమంతా తరలివెళ్లింది. సాయి సన్నిధిలో సంతోషంగా పూజలు చేసుకుంది. తమ గారాలపట్టి పుట్టువెంట్రుకలు దేవుడికి సమర్పించుకుంది. ఆనందంగా తిరుగు ప్రయాణమై మరో షిరిడీగా పేరొందిన కోరుట్ల సాయి సన్నిధిలో కాసేపు సేదదీరింది. అక్కడినుంచి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే నలుగురిని మృత్యువు కబళించింది.
కన్నవారు కానరాని లోకాలకు వెళ్లినా చివరిచూపు చూసుకోలేని దైన్యస్థితి ఆ కుమారులది. కట్టుకున్న భార్య కనుమూసినా కడసారిచూపునకు దూరమైన పరిస్థితి భర్తది. తమ గారాలపట్టి ఇకలేదని తెలిసీ.. చివరిసారి ముద్దాడలేని దుస్థితి ఓ తల్లిదండ్రులది. మృతులు, క్షతగాత్రులు అంతా తమవారే అయినా ఒకరినొకరు పలుకరించుకోలేని దయనీయ స్థితి ఆ కుటుంబానిది.
మేడిపల్లి /జగిత్యాల, న్యూస్‌లైన్ : మేడిపెల్లి శివారులో మంగళవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో 11 మంది తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మృతులంతా వరంగల్ జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందినవారు. క్షతగాత్రులు, డీఎస్పీ పరమేశ్వరరెడ్డి కథనం ప్రకారం... వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన గోనె వీరయ్య(70)-సరోజన(60) దంపతులు. వీరికి కుమారులు, కోడళ్లు సంజీవ్-సువర్ణ, సురేష్-అనూష(25), మహేందర్-రేణుక ఉన్నారు. వీరయ్య సింగరేణిలో పనిచేసి రిటైరయ్యాడు. వీరి కుటుంబం 15 ఏళ్ల క్రితమే భూపాలపల్లికి వలసవెళ్లింది.
సంజీవ్ సా యిశ్రీ రెడీమేడ్ డ్రెస్సెస్ దుకాణం, సురేశ్, మహేందర్ సాయిమణికంఠ ఎలక్ట్రానిక్స్ దుకాణం నిర్వహిస్తున్నా రు. మహేందర్ కుమార్తె సాయిమణిషితకు పుట్టువెం ట్రుకలు తీసేందుకు కుటుంబసభ్యులు తమ సొంత వాహనంలో ఈ నెల 26న ఆదివారం షిరిడీకి వెళ్లారు. వీరయ్య దంపతులు, కుమారులు, కోడళ్లతోపాటు మ నుమలు, మనుమరాండ్లు సాయిచరణ్, సాయిశ్రీ (సంజీవ్-సువర్ణల పిల్లలు), సాత్విక, శిరిక(సురేష్-అనూష పిల్లలు), సాయిమణిషిత, నిషిత(8 నెలలు) (మహేందర్-రేణుక పిల్లలు)తోపాటు వీరి కుటుం బమిత్రుడు ఎలగంటి వెంకటేశ్వర్లు కలిసి మొత్తం 15 మంది ఈ వాహనంలోనే వెళ్లారు. 27న సోమవారం సాయిదర్శనం చేసుకుని సాయిమణిషితకు పుట్టువెంట్రుకలు తీశారు.
అనంతరం ఆనందంగా తిరుగుపయనమయ్యారు. మంగళవారం వేకువజామున 3.30 గంటలకు మరో షిరిడీగా పేరొందిన కోరుట్ల సా యిబాబా గుడికి చేరుకున్నారు. అక్కడ కాసేపు సేదదీరారు. ఉదయం 6గంటల ప్రాంతంలో ఆలయ సిబ్బంది వచ్చి వారిని లేపడంతో నిద్రమత్తులోనే అం దరూ మళ్లీ వాహనంలో బయలుదేరారు. కాసేపటికే కోరుట్ల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడిపెల్లి శివారులోని పెట్రోల్‌బంకు వద్దకు చేరుకోగానే డ్రైవింగ్ చేస్తున్న సురేశ్ నిద్రమబ్బులోకి జారుకోవడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుకు కుడివైపుగా వెళ్లి వేపచెట్టుకు ఢీకొట్టింది. అంతే.. ఒకటే ఆర్తనాదాలు. వీరయ్య, సరోజన అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు సంఘటన స్థలానికి చేరుకునేసరికి వాహనంలోంచి మం టలు మొదలయ్యాయి. వెంటనే వాటిని ఆర్పేసి అందులో చిక్కుకున్నవారిని బయటకు తీశారు. గాయపడ్డవారిని జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందిస్తుండగానే సురేశ్ భార్య అనూష, మహేందర్ కూతురు నిషిత చనిపోయారు.
అందరికీ తీవ్రగాయాలు
ఈ ప్రమాదంలో మిగతా అందరికీ తీవ్రగాయాలయ్యాయి. చిన్నపిల్లలకు దెబ్బలు పైకి కనిపించకపోయినా వారికి చికిత్స చేస్తున్న సమయంలో ఫిట్స్ రావడం, వణుకుతుండడంతో అంతర్గతంగా దెబ్బలు తగిలి ఉంటాయని వైద్యులు భావిస్తున్నారు. వెంకటేశ్వర్లుకు స్వల్ప గాయాలు కాగా, మహేందర్, సురేశ్, సంజీవ్ తల, కాళ్లు, చేతులు, ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. రేణుకకు ముఖంపై తీవ్రగాయమైంది. సువర్ణకు కంటిపై గాయమైంది.
ప్రమాద సమాచారం అందుకున్న బంధువులు ఆస్పత్రికి తరలిరావడంతో రోదనలు మిన్నంటాయి. గాయపడ్డ వారికి ప్రాథమిక చికిత్స చేసి కొందరిని కరీంనగర్‌లోని ప్రతిమ, శ్రీ లక్ష్మి, అపోల్‌రీచ్ ఆస్పత్రులకు తరలించారు. సంఘటన స్థలాన్ని కోరుట్ల సీఐ మహేశ్‌గౌడ్, ఎస్సై వెంకటేశ్వర్‌రావు పరిశీలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల ఏరియా ఆస్పత్రిలో క్షతగాత్రులను జగిత్యాల డీఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి పరామర్శించారు. గాయపడ్డవారిలో మహేం దర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు.
సాయి సన్నిధి నుంచి మృత్యుఒడికి..
Published Wed, Jan 29 2014 4:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
Advertisement