
టీడీపీలో వేరుకుంపట్లు
ఎంపీ నానికి దూరంగా నగర అధ్యక్షుడు
మంత్రి దేవినేనితోనూ వైరం
బెజవాడ నేతల మధ్య అగాధం
ప్రత్యేకంగా నగర కార్యాలయం
విజయవాడ : తెలుగుదేశం పార్టీ నగర ముఖ్య నేతల మధ్య నానాటికీ అంతరం పెరుగుతోంది. ఒకరంటే మరొకరికి గిట్టని పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి పార్టీ నగర కార్యాలయాన్ని కేశినేని భవన్‌లో కాకుండా సొంతంగా ఏర్పాటుచేసుకునే ఆలోచనలో అధ్యక్షుడు బుద్దా వెంకన్న ఉన్నారనేది విశ్వసనీయ సమాచారం. ఇందుకు రాజకీయ, ఆర్థిక, నేర వ్యవహారాలే కారణాలని తెలుస్తోంది. దీనికితోడు అధినేత చంద్రబాబునాయుడు నగరంలో ఉంటున్నందున ఆయన వద్ద ప్రాపకం పొందే ప్రయత్నాలు కూడా ముమ్మరమయ్యాయి. ముఖ్య నేతల అండతో పార్టీ నగర పగ్గాలు చేపట్టడానికి కొందరు వ్యూహప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం.
ఆదినుంచీ వర్గవిభేదాలే
నగర టీడీపీ నేతల మధ్య మొదట్నుంచీ వర్గ విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నాయకుల అవసరార్థం అవి ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి. ఒకరిని ఓ సందర్భంలో ద్వేషించడం, మరోసారి వారినే అక్కున చేర్చుకోవడం ముఖ్య నేతల మధ్య పరిపాటిగా మారింది. ప్రత్యర్థులు విమర్శలు చేసినప్పుడో, మరేదైనా ప్రధాన సమస్య వచ్చినప్పుడో నాయకులు జట్లు కట్టడంలో తేడాలు వస్తున్నాయి.
చిచ్చురేపిన కాల్‌మనీ-సెక్స్‌రాకెట్
కాల్‌మనీ- సెక్స్‌రాకెట్ కేసులో కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులు, వారి ప్రధాన అనుచరులు, బంధువుల వ్యవహారాలు వెలుగుచూడడంతో నాయకుల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. అధినేత వద్దకు వెళ్లి ఫలానా వారికి ఇందులో జోక్యం ఉందని కొందరు ఫిర్యాదులు చేయ డం, ఈ కేసులో తమకు, తమవారికి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకోవడం నాయకులకు షరా మామూలు అయింది. పోలీసు నిఘా వర్గాలను ఆశ్రయించి ఇందులో తమకే పాపం తెలియదనే నివేదికలు అధినేతకు పంపాలనే విన్నపాలు కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలియవచ్చింది. దీంతో పాటు నిఘావర్గాలు నగరంలోని ముఖ్య నాయకుల ఫోన్‌కాల్ జాబితాలను కూడా అధినేత ఎదుట ఉంచినట్లు సమాచారం. కాల్‌మనీ- సెక్స్‌రాకెట్ బండారం బట్టబయలయ్యాక నగర, జిల్లా నేతల మధ్య తకరారు మరీ తీవ్రతరమైంది. తమను రాజకీయంగా దెబ్బతీసేందుకు కాల్‌మనీ- సెక్స్‌రాకెట్ అంశంలో దురుద్దేశపూర్వకంగా ఇరికించే ప్రయత్నాలు జరిగాయని కొందరు నాయకులు వాపోతుండగా, అసలు తప్పులేవీ చేయనప్పుడు ఆందోళనలు ఎందుకనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి.
ఎంపీ కార్యాలయానికి వెళ్లని బుద్దా
టీడీపీ నగర అధ్యక్షుడు బుద్దా వెంకన్న కొంతకాలంగా ఎంపీ కేశినేని కార్యాలయానికి వెళ్లడం మానేశారు. టీడీపీ ముఖ్య నాయకులతో పాటు ఎంపీ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జుల ఫొటోలతో కూడిన బ్యానర్ కేశినేని భవన్‌లో ఉండేది. ఆ బ్యానర్‌లో నుంచి తన ఫొటోను ఉద్దేశపూర్వకంగా ఇటీవల తొలగించారన్న సమాచారం వెంకన్నకు చేరింది. అది నిజమేనని నిర్ధారించుకున్న ఆయన అక్కడికి వెళ్లడం మానేశారు. తనకు అత్యంత ఆప్తుడిగా భావించే తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి తాజా పరిణామాలన్నింటినీ తీసుకెళ్లి కింకర్తవ్యం ఏమిటని వెంకన్న చర్చించారని వినికిడి. సొంత కార్యాలయం ఏర్పాటుచేసుకోవాలని తాను ఎప్పటి నుంచో సూచిస్తున్నా అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదని రామ్మోహన్.. వెంకన్నకు క్లాస్ పీకినట్లు సమాచారం. ఇక కాల్‌మనీ అంశంలో తనకు సంబంధం లేదని వెంకన్న పదేపదే వివరణ ఇచ్చుకోవడంతోపాటు ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లారు.
మంత్రి దేవినేనికి దూరం
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతోనూ నగర నాయకులు అంటీముట్టనట్లు ఉంటున్నారు. పైకి మాత్రం కలిసినట్లు కనిపిస్తున్నా మంత్రి, ఆయన కార్యాలయం నుంచి ఫోన్లు చేసినప్పుడు నగర నేతలు కొందరు స్పందించడం లేదు. జన్మభూమి కార్యక్రమం సందర్భంగా, అంతకు ముందు భవానీదీక్షల సమయంలో గిరి ప్రదక్షిణకు మంత్రి స్వయంగా పిలిచినా ముఖ్య నాయకులు స్పందించలేదు.పార్టీ నగర అధ్యక్ష, కార్యదర్శులు ఈ విషయంలో రాజీ పడడంలేదని తెలిసింది. పదవులపేరిట, అప్పుల రూపంలో వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని ఆ తరువాత వాటి ఊసెత్తడం లేదని ప్రజాప్రతినిధుల కార్యాలయాలు కోడై కూస్తున్నాయి. మధ్యవర్తులుగా వ్యవహరించిన వారు కూడా నేరుగా రుణగ్రస్తులనే సంప్రదించాలని సూచిస్తున్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. నగర ఎమ్మెల్యే ఒకరు మంత్రి తీరుపై బాహాటంగానే తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నట్లు పార్టీ వర్గాలు ప్రచా రం చేస్తున్నాయి. తన కోటరీ మినహా ఇతరుల అంశాలను మంత్రి ఏమాత్రం పట్టించుకోవడంలేదని, అందువల్లే అధినేతకు నేరుగా చెప్పుకోవాల్సి వస్తోందని ప్రజాప్రతినిధులు గుర్తుచేస్తున్నారు. సాగునీటి విషయంలో రైతుల తరఫున మాట్లాడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నా ఇష్టం: ఎంపీ నాని
ఎంపీ నాని కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో పార్లమెంటు నియోజకవర్గంలోని ముఖ్య నాయకుల ఫొటోలన్నీ ఉన్నాయి. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫొటో కనిపించలేదు. దీనిపై జనంలో జరుగుతున్న చర్చను ఎంపీ వద్ద సాక్షి ప్రస్తావించగా ‘నా ఇష్టం.. నాడబ్బులతో పెట్టుకునే ఫ్లెక్సీలో నాకు ఇష్టమైన వారి ఫొటోలు పెట్టుకుంటా..’ అని బదులిచ్చారు.