అప్పుడే అగ్గి | The fire | Sakshi
Sakshi News home page

అప్పుడే అగ్గి

Published Wed, Jan 29 2014 3:38 AM | Last Updated on Fri, Oct 19 2018 7:33 PM

The fire

 మూసీ పరీవాహక ప్రాంతంతో పాటు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని వరి రైతుకు అన్నీ కష్టాలే చుట్టుముడుతున్నాయి. గత ఏడాది తుపాన్ల కారణంగా కురిసిన భారీ వర్షాలకు చేతికొచ్చే దశలో పంటంతా నీటిపాలైంది. ఖరీఫ్‌లో తెగుళ్ల కారణంగా దిగుబడి పూర్తిగా తగ్గింది. కాగా రబీలోనైనా ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చని భావించిన రైతన్న ఆశలపై తెగుళ్లు నీళ్లు చల్లుతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ప్రధానంగా అగ్గితెగులు, కాండం తొలుచు పురుగు తదితర తెగుళ్లు రైతన్నను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
 
 భూదాన్ పోచంపల్లి, న్యూస్‌లైన్: ఈ రబీ సీజన్‌లో మండలంలోని మూసీ పరీవాహక గ్రామాలలో సుమారు 15వేలకుపైగా ఎకరాలలో 1010 , ఐఆర్64 రకాలు సాగు చేశారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో వరి ముదురుతీసే దశలో ఉంది. మరికొన్ని గ్రామాల్లో పొట్టకువచ్చే దశలో ఉంది. ఈ దశలో వరికి ప్రధానంగా అగ్గితెగులు, నటపిప్పి(కాండం తొలుచు పురుగు), గంధక విషప్రభావం ఉంది. దీంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టగా.. తీరా చేను ఎదుగుతున్న దశలో తెగుళ్లు సోకడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆందోళ చెందుతున్నారు.
 
  తెగుళ్ల లక్షణాలు - నివారణ చర్యలు
 కాండం తొలుచు పురుగు(నటపిప్పి) : ఈ పురుగు ఆకుల చివరి భాగంలో గుడ్లు పెడుతుంది. పిలకలు తొడిగే దశలో ఆశిస్తే మొవ్వలు ఎండిపోతాయి. అదే పూత దశలో నైతే వెన్నులు తెల్లకంకులుగా మారుతాయి.  
 సలహాలు
 వరి కొసలను తుంచడం ద్వారా కొనలమీద పెట్టిన గుడ్లను తొలగించవచ్చు. అలాగే ఎకరాకు 400 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్, లేదా 320 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా  8కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్‌ను వెదజల్లి నివారించాలి.
 
 గంధక విష ప్రభావం
 
 మూసీ నీటి వల్ల గంధక విష ప్రభావం కన్పిస్తుంది. ఈ ప్రభావం చౌటనేలల్లో అధికంగా ఉంది. వరినాటు వేసిన 3 నుంచి 4 వారాలలో ఈ ప్రభావం కన్పిస్తుంది.  ప్రారంభ దశలో ముదురు ఆకులు పసుపురంగులోకి మారి ఎండిపోతాయి.
 
 తరువాత పక్క పిలకలు కూడా ఎండిపోయి.. కొన్ని పిలకలే మిగులుతాయి. మొక్క వేర్లను పరిశీలిస్తే నల్లని పొర కప్పి ఉంటుంది. దీనివల్ల ఆ మొక్క నీటిని, పోషకాలను తీసుకోలేక చనిపోతుంది. మొక్కవేళ్లకు ఆక్సిజన్ అందుబాటులో లేని కారణంగా నేలలోని గంధకం, ఇనుప ధాతువులు రసాయనిక మార్పు చెంది మొక్కకు హాని కలిగించడాన్నే‘గంధక విష ప్రభావం’ (సల్ఫర్ ఇంజురి) అంటారు.
 
 ఇలా చేయాలి..
 పొలంలో చిన్నకాలువలు చేసి మురుగు నీటిని తీసేయాలి. నేల పై భాగంలో పగుళ్లు ఏర్పడే వరకు పొలాన్ని ఆరబెట్టాలి. తిరిగి కొత్తనీరు పెట్టాలి.
 
 ఇలా రోజుకు 2-3 సార్లు చేయడం వల్ల వేళ్లకు ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చి వాడిపోయే దశలో ఉన్న మొక్కలు తిరిగి నిలదొక్కుకుంటాయి
 
 నేలను ఆరబెట్టడం వల్ల పొలంలో వేసిన నత్రజని పోతుంది. కాబట్టి మరొక మోతాదు నత్రజనిని అదనంగా వేయాలి.
 
 సల్ఫర్ ఇంజురి వచ్చే నేలల్లో గంధకం కలిగి ఉన్న సూపర్ ఫాస్పేట్, 20-20-0-13, జిప్సం వంటి ఎరువులు వేయకూడదు.
 
 ఈ సమస్య ఉన్న నేలల్లో జింక్ లోపం కన్పిస్తుంది. కాబట్టి జింక్  2 శాతం ద్రావణాన్ని రెండు, మూడు సార్లు పిచికారీ చేసి ఆ లోపాన్ని సరిచేసుకోవచ్చు.
 
 అగ్గితెగులు..
 ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. నూలు కండె ఆకారంలో చివర్లు మొనదేలి ఉంటాయి. వీటి అంచులు ముదురు గోధుమరంగులో లేక నల్లగా ఉండి మచ్చల మధ్యన బూడిద  లేదా తెల్లగా కన్పిస్తుంది. తెగులు ఉధృతం అయినప్పుడు ఈ మచ్చలు పెద్దవిగా కావడం వల్ల ఆకులు ఎండిపోయినట్టు కనిపిస్తాయి.
 
 నివారణ ఇలా..
 ఎకరానికి 120 గ్రాముల ట్రై సైక్లోజోల్, 300 మిల్లీ లీటర్ల కార్టాప్ హైడ్రో క్లోరైడ్  ఈ రెండింటిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అవసరాన్ని  బట్టి రెండు, మూడు సార్లు పిచికారీ చేయవచ్చు.
 
 మందు పిచికారీ చేసినా అదుపులోకి వస్తలేదు
 ఐదు ఎకరాల్లో వరిసాగుచేశా. 15 రోజుల క్రితం నటపిప్పి కనిపిస్తే మందు పిచికారీ చేశా. ఆ రోగం తగ్గక ముందే పదిరోజులుగా ఆకులపై మచ్చలు ఏర్పడి ఎండిపోతోంది. అధికారులకు చూపిస్తే అగ్గితెగులు సోకింది, మందు పిచికారీ చేయమన్నారు. వారం రోజుల క్రితం మందు కొట్టా. అయినా అదుపులోకి వస్తలేదు. ఇప్పటికే పెట్టుబడి రూ.50వేలు దాటింది. ఈసారిదిగుబడి తగ్గుతుందని ఆందోళనగా ఉంది.
 - జి. కృష్ణారెడ్డి, గుణంగారివాడ
 
 పరేషాన్ అవుతున్నం
 ఐదు ఎకరాల్లో వరి సాగు చేస్తే ఇప్పటి వరకు రూ.54వేల పెట్టుబడి అయ్యింది. ఇటీవల అగ్గితెగులు, గంధకవిష ప్రభావంతో పంట ఎండిపోతోంది. తెలిసిన వారు చెబితే మందు చల్లా. అయినా రోగం తగ్గకపోవడంతో భువనగిరికి వెళ్లి రూ.2వేలు ఖర్చు చేసి మందుతీసుకు వచ్చి చల్లా. అయినా తగ్గడం లేదు. అధికారులేమో ఉదయం మంచు కురుస్తుంది కాబట్టి ఎండకొడితే రోగం పోతదని అంటున్నారు.
 - నేదురు కృష్ణారెడ్డి, జగత్‌పల్లి
 
 50వేల ఎకరాల్లో వరినాట్లు పూర్తి
 హాలియా :హాలియా వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో సాగర్ ఎడమ కాల్వ కింద హాలియా, నిడమనూరు, త్రిపురారం మండలాల్లో  70 వేల ఆయకట్టు ఉంది. ఇప్పటి వరకు రైతులు సుమారు 50 వేల ఎకరాల్లో వరినాట్లు వేయగా మరో 20 వేల ఎకరాల్లో నాట్లు వేయాల్సి ఉంది.  ఇప్పటి వరకు అనుముల మండలంలో సుమారు 16 వేల ఎకరాలు,  త్రిపురారం 15వేలు, నిడమనూరు 18వేల ఎకరాల్లో వరినాట్లు వేశారు. పెద్దవూర, గుర్రంపోడు మండలాల్లో బోరుబావుల కింద వరిసాగు చేసిన రైతులను ఓవైపు లోవోల్టేజీ సమస్య, మరోవైపు వరినారు మడులకు తెగుళ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
 
 
 10వేల ఎకరాల్లో..
 హాలియా వ్యవసాయ డివిజన్ పరిధిలో నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధిలో సుమారు 10వేల ఎకరాల్లో వరికి అగ్గి తెగులు సోకింది. రబీలో ఐదు తడులకే నీరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ సీజన్‌లో వరిసాగు చేసే రైతులు నారుమడి త్వరగా పెరిగి రావాలని చెప్పి యూరియా అధిక మొత్తంలో వేశారు. దీనికి తోడు వాతావరణంలో వస్తున్న మార్పులే వరికి అగ్గి తెగులు సోకడానికి ప్రధాన కారణమని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాత్రి సమయంలో వరినారుతో పాటు చేలపై మంచు కురవడం, పగటి సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఈ తెగులు వ్యాపిస్తుందని వారం టున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement