
బాలిక కిడ్నాప్‌కు యత్నం
తనను కిడ్నాప్ చేసిన దుండగుల చెర నుంచి ఓ బాలిక చాకచక్యంగా తప్పించుకుంది.
► బైక్‌పై తరలించుకెళ్లిన ముగ్గురు యువకులు
► రహదారిపైనే బాలిక కోసం తగువులాట
► దుండగుల కళ్లు కప్పి తప్పించుకున్న బాధితురాలు
నాగసముద్రం(చెన్నేకొత్తపల్లి) : తనను కిడ్నాప్ చేసిన దుండగుల చెర నుంచి ఓ బాలిక చాకచక్యంగా తప్పించుకుంది. వివరాల్లోకి వెళితే... నాగసముద్రానికి చెందిన సుధారాణి, ఓబులేసు దంపతుల కుమార్తె యశస్విని స్థానిక ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం గ్రామ శివారులో బహిర్భూమికి వెళ్లిన బాలికను ముగ్గురు యువకులు బెడ్‌షీట్ కప్పి ద్విచక్ర వాహనంపై ఎత్తుకెళ్లారు. ఎన్‌ఎస్‌గేట్‌కు వెళ్లే దారిలో నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్న తర్వాత బాలిక కోసం ముగ్గురూ గొడవపడ్డారు. ఆ సమయంలో బాలిక తప్పించుకుని పారిపోయింది.
ఆమెను వెంబడించిన దుండగులు కొద్ది దూరంలో బైక్‌పై వ్యక్తి వస్తుండడం గమనించి అక్కడి నుంచి జారుకున్నారు. యశస్విని పరుగును గమనించిన ద్విచక్ర వాహన చోదకుడు శివయ్య(ఎన్‌ఎస్‌గేట్ నివాసి), తన వాహనాన్ని ఆపి బాలికతో జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు. అనంతరం ఆమెను ఎన్‌ఎస్‌గేట్ పోలీస్ ఔట్‌పోస్టుకు తీసుకెళ్లి, విషయాన్ని ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు అందించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శేఖర్ అక్కడకు చేరుకుని బాలికను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అనంతరం బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.