మోర్తాడ్, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో సామాన్య ప్రజలపై ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. ఇప్పటికే అమలు చేస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్ల(ఐహెచ్‌హెచ్‌ఎల్) నిర్మాణాలకు రూ. 9,100 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించేది. ఇందులో లబ్ధిదారుడు వాటా ధనంగా రూ. 900 జమ చేయాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి తన వంతు కేటాయించే నిధుల్లో రూ. 900ను హెచ్చింపు చేసి లబ్ధిదారుని వాటాధనాన్ని భరిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఐహెచ్‌హెచ్‌ఎల్ నిర్మించుకునే లబ్ధిదారునికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని ఇక నుంచి అందించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని డ్వామా అధికారులు మండలస్థాయి ఉద్యోగులకు మౌఖికంగా సమాచారం అందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో 99,065 ఐహెచ్‌హెచ్‌ఎల్‌లను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే నిర్మాణ వ్యయం పెరగడం, రింగుల కొరత, ఇసుక కొరతల కారణంగా లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. దీంతో జిల్లాలో 69,463 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉంది.
ఇది వరకు 15,316 మరుగుదొడ్లను ఆయా లబ్ధిదారులు నిర్మించుకున్నారు. 14,286 మరుగుదొడ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. నిర్మల్ అభియాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ. 4,600ను, రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హమీ ద్వారా రూ. 4,500 చెల్లించేది. లబ్ధిదారుడు రూ. 900ను వాటాధనంగా జమచేయాల్సి ఉండేది. అయితే పొరుగు రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ఎక్కువ సొమ్మును చెల్లిస్తున్నాయి. ఈ వివరాలను తెలుసుకున్న రాష్ట్రప్రభుత్వం లబ్ధిదారుని వాటా ధనాన్ని భరించడానికి ముందుకు వచ్చింది.
దీంతో లబ్ధిదారునికి ఎలాంటి ఖర్చు లేకుండానే మరుగుదొడ్డి నిర్మాణం పూర్తి కానుంది. ఐహెచ్‌హెచ్‌ఎల పథకం గత రెండేళ్ల నుంచి అమలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు నిధులు పెంచడాన్ని పరిశీలిస్తే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుందని పరిశీలకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నా లబ్ధిదారులకు మాత్రం ప్రయోజనం కలుగుతుందని పలువురు చెబుతున్నారు.
ఐహెచ్‌హెచ్‌ఎల్ లబ్ధిదారులకు శుభవార్త
Published Mon, Jan 27 2014 2:23 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement