ఏపీఎండీసీ ఆస్తుల పంపకం ప్రతిపాదనలపై ఉద్యోగుల్లో అసంతృప్తి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీపీ) ఆస్తుల పంపకం ప్రతిపాదనలు సీమాంధ్ర కు అన్యాయం కలిగించేలా ఉన్నాయని ఆ ప్రాంత ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంస్థ ఆదాయంలో 95 శాతం వాటా కలిగిన సీమాంధ్రకు అప్పులు వదిలేసి ఆదాయాన్ని మాత్రం సీమాంధ్ర (ఆంధ్రప్రదేశ్), తెలంగాణలకు 52 : 48 నిష్పత్తిలో పంచాలంటూ సంస్థ చేసిన ప్రతిపాదనలపై అసహనంతో ఉన్నారు. ‘ఏపీఎండీసీకి రూ. 700 కోట్ల డిపాజిట్లు, ఇతరత్రా నగదు నిల్వలు ఉన్నాయి. ఇందులో సుమారు రూ. 200 కోట్లు పల్వరైజింగ్ మిల్లుల వారు బెరైటీస్ ఖనిజం కోసం చెల్లించిన అడ్వాన్సులకు సం బంధించినవి. భవిష్యత్తులో వారికి రూ. 200 కోట్ల విలువైన ఖనిజాన్ని ఇవ్వాల్సి ఉంది. అంటే ఈ రూ. 200 కోట్లు అప్పు కింద తొలగించాల్సి ఉంది. అప్పు కింద రూ. 200 కోట్లు మినహాయించి మిగిలిన రూ. 500 కోట్లు 52 : 48 నిష్పత్తిలో రెండు రాష్ట్రాలకు పంచాల్సి ఉండగా అప్పును వదిలేసి నగదు నిల్వలు మాత్రమే పంచేలా సంస్థ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఇది కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయమే’ అని ఆ ప్రాంత ఉద్యోగులు పేర్కొంటున్నారు.
అమీర్‌పేట భవనంలో వాటా ఉంచండి..
ఏపీఎండీసీకి వస్తున్న ఆదాయంలో మొదటి నుంచి 95 శాతం సీమాంధ్రలోనిదే. కాగా మంగంపేట బెరైటీస్, చీమకుర్తి గ్రానైట్స్ ద్వారా వచ్చిన ఆదాయంతోనే అమీర్‌పేటలో ఏపీఎండీసీకి భవనాన్ని కొనుగోలు చేశారు. దీనిని కూడా రెండు రాష్ట్రాలకు 52:48 నిష్పత్తిలో పంచాలని అధికారులు భావిస్తున్నారు. ఇలా పంచి విక్రరుుంచడం ద్వారా తమ వాటా ఇవ్వకుండా భవనాన్ని అలాగే ఉంచాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. అది హైదరాబాద్‌లో అలాగే ఉంటే తమకు అతిథి గృహంగానైనా ఉపయోగపడుతుందనే అభిప్రాయూన్ని వ్యక్తం చేస్తున్నారు.
బొగ్గు గనులివ్వాలి
ఏపీఎండీసీకి మధ్యప్రదేశ్‌లోని సిలిగురి, ఒడిశాలోని నొవగాం-తెలిసాహిలో బొగ్గు గనులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సింగరేణి బొగ్గు గనులు ఉన్నందున ఏపీఎండీసీకి ఉన్న రెండు కోల్‌బ్లాకులను ఆంధ్రప్రదేశ్‌కే వదిలేయాలని సంస్థ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆ గనుల కోసం ఏపీఎండీసీ వెచ్చించిన మొత్తమంతా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి వచ్చినదేనని ఆ సంస్థ ఉద్యోగులు అంటున్నారు.
సీమాంధ్రకు అన్యాయం!
Published Wed, May 21 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM
Advertisement