విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇతర హామీలు అమలు చేయకుండా కేంద్రం మోసం చేస్తోందని....
అనంతపురం టౌన్ : విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇతర హామీలు అమలు చేయకుండా కేంద్రం మోసం చేస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి. సత్యనారాయణ మూర్తి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఒత్తిడి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టేందుకు సిద్ధపడ్డారంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదా, ఇతర హామీల అమలు, సీపీఐ నేతల అరెస్టును నిరసిస్తూ సీపీఐ జిల్లా కమిటీ బుధవారం చేపట్టిన మౌన ప్రదర్శన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మౌన ప్రదర్శన ప్రెస్‌క్లబ్ వద్ద నుంచి సప్తగిరి సర్కిల్ వరకు నిర్విహ ంచారు. ప్రదర్శన ముందు బేడీలు తొడిగిన ఎర్రచొక్క వేసుకున్న కార్యకర్తను పోలీసు తీసుకెళుతున్నట్లుగా నడిపిస్తూ నిరసన తెలిపారు. ప్రదర్శన అనంతరం సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ప్రజలను మోసగిస్తున్నాయని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, ఇతర హామీల్లో ఒక్కటి కూడా బడ్జెట్‌లో ప్రస్తావించలేదన్నారు. రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా సరిపోదు పదేళ్లు కావాలని కోరిన వెంకయ్యనాయుడు వారి పార్టీ అధికారంలోకి రాగానే మాటమార్చి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని చెప్పడం ప్రభుత్వ దగాకోరుతనానికి నిదర్శనమన్నారు.
విభజన హామీలు సాధనకు కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చుందన్నారు. పోరాటం చేస్తున్న సీపీఐ నాయకులను జైలుకు పంపి తన నిరంకుశ ధోరణి చాటుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సుపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, ప్రతినిధులను ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సీనియర్ నేత ఎం.వి.రమణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజరెడ్డి, వేమయ్య యాదవ్, కార్యవర్గ సభ్యులు శకుంతలమ్మ, అమీనా, కాటమయ్య, కేశవరెడ్డి, రామకృష్ణ, అల్లీపీరా, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రమణ, మహిళ సమాఖ్య ప్రధాన కార్యదర్శి పద్మావతి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అద్యక్ష కార్యదర్శులు జాన్సన్‌బాబు, నరేష్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, ఏఐటీయూసీ నాయకులు రాజేష్‌గౌడ్, బాలపెద్దన్న, మల్లికార్జున, మనోహర్, వన్నారెడ్డి, నాగరాజు, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు గాదిలింగ, జమీర్, మున్నా, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.