సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఎమ్మెల్యేల పనితీరు, పథకాల అమలుపై నియోజకవర్గాల వారీగా టీడీపీ నిర్వహించిన సర్వే ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఎనిమిది అంశాలపై చేసిన సర్వే రిపోర్టు ఆధారంగా ప్రకటించిన ర్యాంకింగ్ అధికార పార్టీలో చర్చనీయాంశ మైంది. టీడీపీ అధినేత,సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలకు ఆ సర్వే రిపోర్టులు అందజేసినట్టు తెలిసింది. జిల్లా విషయానికొస్తే ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారికి మొదటి ర్యాంకు రాగా, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీతకు చివరి ర్యాంకు, మంత్రి మృణాళిని ఎనిమిది ర్యాంకు ఇచ్చినట్టు సమాచారం.
పింఛన్ల పంపిణీ, రేషన్ సరఫరా, జన్మభూమి, ఇసుక పాలసీ, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఆరోగ్య శ్రీ అమలు అంశాలతో పాటు ఎమ్మెల్యే అందుబాటును ఆధారంగా సర్వే చేసినట్టు చేసింది. దీనిలో పారదర్శకత ఎంత ఉందో తెలియదు గాని ప్రకటించిన ర్యాంకులు మాత్రం కాసింత ఆసక్తికరంగా ఉన్నాయి. పథకాల అమల్లో వెనకబడి ఉన్నప్పటికీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడంతో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారికి మొదటి ర్యాంకు ప్రకటించినట్టు తెలిసింది. అంతర్గతంగా ప్రకటించిన ర్యాంకింగ్‌లో బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకు రెండో ర్యాంకు, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణికి మూడో ర్యాంకు, పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులకు నాలుగో ర్యాంకు, గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడికి ఐదో ర్యాంకు,సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు ఆరో ర్యాంకు, నెల్లిమర్ల పతివాడ నారాయణస్వామినాయుడికి ఏడో ర్యాంకు, మంత్రి మృణాళినికి ఎనిమిదో ర్యాంకు, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీతకు తొమ్మిదో ర్యాంకు ఇచ్చినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, జిల్లాలో ఐదో ర్యాంకులో ఉన్న ఎమ్మెల్యే కె.ఎ.నాయుడికి పింఛన్ల పంపిణీలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారని వేదికపై చంద్రబాబు అభినందించారు. అంతేకాకుండా పంపిణీలో మంచి ఫలితాలు సాధించడానికి గల కారణాలు వివరించాలని కె.ఎ.నాయుడ్ని వేదికపైకి పిలిచి మాట్లాడించారు. మొత్తానికి టీడీపీ నిర్వహించిన సర్వేలో నిబద్ధత ఎంతమేర ఉందో తెలియదు గాని ప్రకటించిన ర్యాంకుల కొందరికి మోదం, మరికొందరికి ఖేదం కలుగజేశాయి.
ఫస్ట్ కోళ్ల... లాస్ట్ గీత
Published Sun, Aug 2 2015 1:33 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement