
వివాహిత అనుమానాస్పద మృతి
భర్తే చంపాడని కుటుంబసభ్యుల ఆరోపణ
నెల్లూరు(నవాబుపేట): కులాలు వేరైనా వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త కోసం ఆమె పేరును కూడా మార్చుకుంది. పిల్లాపాపలతో హాయి గా జీవిస్తున్న సమయంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శనివారం బోడిగాడితోటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కోవూరు మండలం సాలుచిం తలలో నివాసం ఉండే వీరయ్య, నిర్మల దంపతులకు కుమారుడు, కుమార్తె జ్యోతి (25) ఉన్నారు. బోడిగాడితోటకు చెందిన షేక్ సుబహాన్‌బాబుతో జ్యోతికి పరిచయం ఏర్పడింది.
పరి చయం కాస్త ప్రేమగా మారి ఆరేళ్ల కిందట పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. జ్యోతి పెళ్లి తరువాత తన పేరును రేష్మాగా మార్చుకుంది. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సుబహాన్‌బాబు నగరంలోని ఓ టీ దుకాణంలో పని చేస్తున్నాడు. రోజూ తెల్లవారుజామున 4.30 గంటలకు ఇంటి నుంచి దుకాణానికి వెళ్లిపోతాడు. రోజూలాగే ఈ నెల 9వ తేదీన ఇంటి నుంచి 4.30గంటలకు టీ దుకాణానికి వెళ్లాడు.
తిరిగి ఉదయం 7 గంటలకు ఇంటికి రాగానే జ్యోతికి మరిది వరుస అయిన షాహుల్‌తో సన్నిహితంగా ఉండడాన్ని గమనించిన సుబహాన్‌బాబు జ్యోతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. తల్లిదండ్రులు బోడిగాడితోటలోని ఇంటికి వచ్చేలోపు జ్యోతి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
కుటుంబసభ్యులు జ్యోతికి ఫోన్ చేసి ఇంటికి రావాలని అభ్యర్థించారు. 10వ తేదీ ఉదయం ఇంటికి వచ్చిన జ్యోతికి, సుబహాన్‌బాబుకు తల్లిదండ్రులు నచ్చజెప్పి వెళ్లిపోయారు. తరువాత ఏం జరిగిందో ఏమో.. అదేరోజు రాత్రి జ్యోతి తల్లిదండ్రులకు సుబహాన్ ఫోన్ చేసి మీ కుమార్తె నిద్రమాత్రలు మింగిందని, హాస్పిటల్‌కు తీసుకొచ్చానని తెలిపాడు.
మళ్లీ ఐదు నిమిషాలకు ఫోన్ చేసి చున్నీతో ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపాడు. జ్యోతి తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి వచ్చారు. వారు వచ్చి చూడగా మృతదేహాన్ని కింద పడుకోబెట్టి ఉన్నారు. పక్కన కుర్చీ ఉంది. తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడలేదని, భర్తే హతమార్చి ఉంటాడని జ్యోతి తల్లిదండ్రులు ఆరోపించారు. ఆమె మెడపై మచ్చలు ఉన్నాయి. జ్యోతి ఆత్మహత్యకు పాల్పడిందా, హత్యకు గురైందా అన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండోనగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.