పెళ్లి పేరుతో ఎగతాళి
Published Fri, Apr 7 2017 8:47 AM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM
► యువతికి అక్రమ సంబంధం అంటగట్టిన సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్
►గాజువాక పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
►50 రోజుల తర్వాత తమ పరిధి కాదన్న పోలీసులు
►మంత్రి అచ్చెన్నాయుడు హస్తం ఉందని బాధితురాలి ఆరోపణ
►పెళ్లి కొడుకును అరెస్టు చేసి ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్
శ్రీకాకుళం: ఒక యువతితో వివాహం కుదుర్చుకున్న సీఐఎస్ ఎఫ్ కానిస్టేబుల్ కట్నం ఎక్కువ వస్తుందనే దురాశతో మరో యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు. పెళ్లి పేరుతో యువతిలో రేపిన ఆశలను అక్రమ సంబంధం అంటగట్టి తుంచేశాడు. దానికోసం ఒక బినామీ ప్రేమికుడిని సృష్టించాడు. పెళ్లి పెద్దలను సైతం పక్కన పెట్టేశాడు. లఘ్న పత్రిక రాసుకున్న తర్వాత ఇలా చేయడం అన్యాయం బాబూ అని వేడుకున్న యువతి తల్లిదండ్రులను దిక్కున్నచోట చెప్పుకోమన్నాడు.
దిక్కులేక ఖాకీలను ఆశ్రయించిన బాధితురాలిని 50 రోజులపాటు తమ స్టేషన్ చుట్టూ తిప్పించుకున్న గాజువాక పోలీసులు ఇప్పుడా కేసు తమ పరిధిలోకి రాదంటూ చల్లగా సెలవిచ్చారు. ఈ తతంగం వెనుక మంత్రి అచ్చెన్నాయుడు హస్తం ఉందని బాధితులు బోరుమంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాధితురాలు మహిళా చేతన అధ్యక్షురాలు కత్తి పద్మను ఆశ్రయించింది. ఈ మేరకు గాజువాకలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు వివరించింది. ఆమె కథనం ప్రకారం...
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం టెక్కలిపాడు గ్రామానికి చెందిన దుంగా అప్పలనాయుడు కుమారుడు పాపారావు సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. గాజువాక దరి శ్రీనగర్ అఫీషియల్ కాలనీకి చెందిన రెడ్డి పిన్నన్న కుమార్తె వసంత కుమారిని వివాహం చేసుకోవడానికి పెద్దల ద్వారా సంబంధం ఖాయం చేసుకున్నాడు. రూ.9.5లక్షల కట్నం, ఇతర లాంఛనాలు చెల్లించడానికి పిన్నన్న అంగీకరించడంతో వచ్చే నెల 7న వివాహం చేయాలని నిర్ణయించుకొని లఘ్నపత్రిక రాసుకున్నారు. ఇంతలో ఎక్కువ కట్నం ఇచ్చే సంబంధం కుదరడంతో వసంత కుమారిని వదిలించుకునేందుకు పాపారావు ఓ స్కెచ్ వేశాడు.
ఆమెకు ఫోన్ చేసి ‘నీకు ఎవరితోనే ప్రేమ వ్యవహారం ఉందని విన్నాను. ఆ వ్యక్తి నాకు మెసేజ్‌లు పంపుతున్నాడు. అందువల్ల నిన్ను పెళ్లి చేసుకోన’ని చెప్పాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాపారావు తల్లిదండ్రులను సంప్రదించారు. వారు కూడా తమ కుమారుడినే సమర్థించి ఈ వివాహం చేసుకోబోమని స్పష్టం చేశారు. పెళ్లి పెద్దలు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అనడమే కాక సెటిల్‌మెంట్ చేసుకుందామంటూ మాట్లాడారు. ఎక్కువ కట్నానికి ఆశపడి వేరే యువతితో వివాహం కుదర్చుకున్నారని, ఈ నెల 24న ఆమెతో వివాహం జరగనుందని వసంత కుమారి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో తమను మోసం చేసిన పాపారావు, అతడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలని బాధితులు ఫిబ్రవరి 12న గాజువాక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో పాపారావు, అతడి తల్లిదండ్రులను గాజువాక పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. విచారణలో ప్రేమ వ్యవహారం అంతా కట్టుకథ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
అప్పటికి 50 రోజులు అయినప్పటికీ బాధితుల ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ మాత్రం నమోదు చేయలేదు. దీనిపై మహిళా చేతన ప్రతినిధులు పది రోజుల క్రితం పోలీసులను నిలదీయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామంటూ ఆరు రోజులు తిప్పించుకున్నారు. చివరకు ఈ కేసు తమ పరిధిలోకి రాదంటూ పోలీసులు తేల్చి చెప్పారు. ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం కేసు నమోదు చేయడానికి అన్ని అవకాశాలున్నప్పటికీ మంత్రి అచ్చెన్నాయుడు కార్యాలయం నుంచి వస్తున్న ఫోన్‌ల వల్ల పోలీసులు కేసు నమోదు చేయలేదని కత్తి పద్మ ఆరోపించారు. పోలీసులు మంత్రి కనుసన్నల్లో నడిచి యువతికి అన్యాయం చేశారన్నారు. పాపారావుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. సీఐఎస్‌ఎఫ్ అధికారులు స్పందించి అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement