Vasanthakumari
-
పెళ్లి పేరుతో ఎగతాళి
► యువతికి అక్రమ సంబంధం అంటగట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ►గాజువాక పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు ►50 రోజుల తర్వాత తమ పరిధి కాదన్న పోలీసులు ►మంత్రి అచ్చెన్నాయుడు హస్తం ఉందని బాధితురాలి ఆరోపణ ►పెళ్లి కొడుకును అరెస్టు చేసి ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ శ్రీకాకుళం: ఒక యువతితో వివాహం కుదుర్చుకున్న సీఐఎస్ ఎఫ్ కానిస్టేబుల్ కట్నం ఎక్కువ వస్తుందనే దురాశతో మరో యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు. పెళ్లి పేరుతో యువతిలో రేపిన ఆశలను అక్రమ సంబంధం అంటగట్టి తుంచేశాడు. దానికోసం ఒక బినామీ ప్రేమికుడిని సృష్టించాడు. పెళ్లి పెద్దలను సైతం పక్కన పెట్టేశాడు. లఘ్న పత్రిక రాసుకున్న తర్వాత ఇలా చేయడం అన్యాయం బాబూ అని వేడుకున్న యువతి తల్లిదండ్రులను దిక్కున్నచోట చెప్పుకోమన్నాడు. దిక్కులేక ఖాకీలను ఆశ్రయించిన బాధితురాలిని 50 రోజులపాటు తమ స్టేషన్ చుట్టూ తిప్పించుకున్న గాజువాక పోలీసులు ఇప్పుడా కేసు తమ పరిధిలోకి రాదంటూ చల్లగా సెలవిచ్చారు. ఈ తతంగం వెనుక మంత్రి అచ్చెన్నాయుడు హస్తం ఉందని బాధితులు బోరుమంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాధితురాలు మహిళా చేతన అధ్యక్షురాలు కత్తి పద్మను ఆశ్రయించింది. ఈ మేరకు గాజువాకలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు వివరించింది. ఆమె కథనం ప్రకారం... శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం టెక్కలిపాడు గ్రామానికి చెందిన దుంగా అప్పలనాయుడు కుమారుడు పాపారావు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. గాజువాక దరి శ్రీనగర్ అఫీషియల్ కాలనీకి చెందిన రెడ్డి పిన్నన్న కుమార్తె వసంత కుమారిని వివాహం చేసుకోవడానికి పెద్దల ద్వారా సంబంధం ఖాయం చేసుకున్నాడు. రూ.9.5లక్షల కట్నం, ఇతర లాంఛనాలు చెల్లించడానికి పిన్నన్న అంగీకరించడంతో వచ్చే నెల 7న వివాహం చేయాలని నిర్ణయించుకొని లఘ్నపత్రిక రాసుకున్నారు. ఇంతలో ఎక్కువ కట్నం ఇచ్చే సంబంధం కుదరడంతో వసంత కుమారిని వదిలించుకునేందుకు పాపారావు ఓ స్కెచ్ వేశాడు. ఆమెకు ఫోన్ చేసి ‘నీకు ఎవరితోనే ప్రేమ వ్యవహారం ఉందని విన్నాను. ఆ వ్యక్తి నాకు మెసేజ్‌లు పంపుతున్నాడు. అందువల్ల నిన్ను పెళ్లి చేసుకోన’ని చెప్పాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాపారావు తల్లిదండ్రులను సంప్రదించారు. వారు కూడా తమ కుమారుడినే సమర్థించి ఈ వివాహం చేసుకోబోమని స్పష్టం చేశారు. పెళ్లి పెద్దలు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అనడమే కాక సెటిల్మెంట్ చేసుకుందామంటూ మాట్లాడారు. ఎక్కువ కట్నానికి ఆశపడి వేరే యువతితో వివాహం కుదర్చుకున్నారని, ఈ నెల 24న ఆమెతో వివాహం జరగనుందని వసంత కుమారి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో తమను మోసం చేసిన పాపారావు, అతడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలని బాధితులు ఫిబ్రవరి 12న గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో పాపారావు, అతడి తల్లిదండ్రులను గాజువాక పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. విచారణలో ప్రేమ వ్యవహారం అంతా కట్టుకథ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అప్పటికి 50 రోజులు అయినప్పటికీ బాధితుల ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయలేదు. దీనిపై మహిళా చేతన ప్రతినిధులు పది రోజుల క్రితం పోలీసులను నిలదీయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామంటూ ఆరు రోజులు తిప్పించుకున్నారు. చివరకు ఈ కేసు తమ పరిధిలోకి రాదంటూ పోలీసులు తేల్చి చెప్పారు. ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం కేసు నమోదు చేయడానికి అన్ని అవకాశాలున్నప్పటికీ మంత్రి అచ్చెన్నాయుడు కార్యాలయం నుంచి వస్తున్న ఫోన్ల వల్ల పోలీసులు కేసు నమోదు చేయలేదని కత్తి పద్మ ఆరోపించారు. పోలీసులు మంత్రి కనుసన్నల్లో నడిచి యువతికి అన్యాయం చేశారన్నారు. పాపారావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. సీఐఎస్ఎఫ్ అధికారులు స్పందించి అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
జవాబుదారీ రెవె‘న్యూ’
యాచారం: ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు స్థానిక తహసీల్దార్ వసంతకుమారి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. రెవెన్యూ కార్యదర్శులు వారంలో మూడురోజుల పాటు గ్రామాల్లోనే ఉండేం దుకు, జనాల సమస్యలను పరిష్కరించేందుకు ప్ర ణాళికను రూపొందించారు. చిన్న చిన్న పనుల కోసం వారాలతరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పని లేకుండా ప్రజల వద్దకే రెవెన్యూ పాలన తీసుకెళ్లేందుకు ఆమె వినూత్నంగా ఓ కార్యక్రమాన్ని రూపొందించారు. గత ఏడాది ప్రభుత్వం రెవెన్యూ క్లస్టర్లలో గ్రామ రెవెన్యూ కార్యాలయాలు ఏర్పాటు చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది. గ్రామ రెవెన్యూ కార్యాలయాలు ఎప్పుడూ చూసినా మూతపడే ఉండేవి. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రజలు మళ్లీ తహసీల్దార్ కార్యాలయాన్నే ఆశ్రయించేవారు. అయినా సమస్యలు పరిష్కారానికి నోచుకునేవి కావు. దీంతో తహసీల్దార్ వసంతకుమారి గ్రామ రెవెన్యూ పాలనకు శ్రీకారం చుట్టారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ గ్రామాల రెవెన్యూ కార్యదర్శులతో ఆమె సమావేశమయ్యారు. శుక్రవారం నుంచి రెవెన్యూ పాలన గ్రామం నుంచే సాగించాలని కార్యదర్శులకు సూచించారు. వారంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు గ్రామంలోనే కార్యదర్శులు ఉండేలా ప్రణాళికలు సిద్ధంచేశారు. వారు గ్రామాల్లోఉండడమే కాకుండా.. రెవెన్యూ రికార్డులు స్థానికంగానే చూసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్రజల్లో హర్షం కార్యదర్శులు గ్రామాల్లో ఉండే రోజుల్లో ఉదయం నుంచి 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు గ్రామాల్లో ఉండాలి. కార్యదర్శి పేరు, ఫోను నంబరు క్లస్టర్ కార్యాలయం వద్ద అతికించాలి. అత్యవసర సమయాల్లో గ్రామాలకు రాని పక్షంలో తహసీల్దార్ లేదా సర్పంచ్‌కు సమాచారం అందించాలని వసంతకుమారి ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ పాలన ఇక గ్రామాల నుంచి సాగడానికి తహసీల్దార్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ పహాణీ, పాసు పుస్తకాలు, పట్టాల మార్పిడి తదితర చిన్న చిన్న పనుల కోసం నెలల కొద్దీ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగేవాళ్లమని, ప్రస్తుతం స్థానికంగానే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్ కృషి చేయడం ఎంతో సంతోషించదగిన విషయమని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. గ్రామాల్లోనే కార్యదర్శులు ఉండేలా.. సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి నిత్యం కార్యాలయానికి రాకుండా చూడడమే లక్ష్యమని తహసీల్దార్ వసంతకుమారి స్పష్టంచేశారు.