తిరుపతి రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులకు ఏకైక పరిష్కారం సమైక్య రాష్ట్రమేనని మేధావులు అభిప్రాయపడ్డారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ‘వర్తమాన పరిణామాలు-రాష్ట్ర భవిష్యత్’ అనే అంశంపై చర్చావేదిక జరిగింది. పలువురు మేధావులు, సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు, రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాలు, జర్నలిస్టులు పాల్గొని రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. ఎస్‌కేయూ మాజీ వీసీ ఆచార్య కే.వెంకటరెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై పార్లమెంట్‌లో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై మండిపడ్డారు.
కమిటీ ప్రధానంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే ఉత్తమమైన మార్గమని సూచించిందని చెప్పారు. ఇందుకు భిన్నంగా సీడబ్ల్యుసీ విభజన నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయ కారణాలే తప్ప మరొకటి లేదన్నారు. రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్ మాట్లాడుతూ రాయల తెలంగాణ పేరుతో రాయలసీమను విభజించే నీచకుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఈ కుట్రను ఎదుర్కొనేందుకు ప్ర జలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తిరుపతి జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయ పార్టీలు సమైక్య రాష్ట్రం కోసం ప్రత్యక్ష ఉద్యమంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ విభజనకు కారణమైన వారు భావితరాలకు తీరని ద్రోహం చేసిన వారవుతారని పేర్కొన్నారు. అలాంటి వారు వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ మాట్లాడుతూ హైదరాబాద్‌ను ఒక్క ప్రాంతానికి పరిమితం చేస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటుంటే ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. సీపీఎం మాత్రమే తొలి నుంచి సమైక్యాంధ్ర కోసం కట్టుబడి ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ రాయల తెలంగాణ అంగీకరించే ప్రసక్తేలేదన్నారు. ముస్లిం జేఏసీ గౌరవాధ్యక్షులు సయ్యద్‌షఫి అహ్మద్‌ఖాదరి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. తిరుపతి జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి మా ట్లాడుతూ విడిపోయేందుకు సీమాంధ్ర ప్రజలు సిద్ధంగా లేరన్నారు.
ఈ కార్యక్రమంలో సాప్స్ అధ్యక్షుడు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం, ఏపీడబ్ల్యుజేఎఫ్ జిల్లా కార్యదర్శి పీ.లోకేష్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగభూషణం, టీడీపీ నగర అధ్యక్షుడు భాస్కర్‌యాదవ్, మధ్య తరగతి ఉద్యోగుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, ప్రైవేటు విద్యా సంస్థల నాయకులు విశ్వనాథరెడ్డి, టీ.వెంకటేశ్వరరావు, ఏపీడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు వీ. గోపి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదిమూలం శేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు జయచంద్ర, మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.
సమైక్య రాష్ట్రమే ఏకైక పరిష్కారం
Published Sat, Aug 17 2013 2:59 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement